TPT : బతుకుపోరులో పడిలేచిన కెరటం.. మొక్కుకున్న ఆలయానికే ఛైర్మన్!

ABN , First Publish Date - 2021-10-31T18:36:46+05:30 IST

దాతృత్వం ఒక్కోసారి కుటుంబాన్నే హారతి కర్పూరంలా కరిగించేస్తుంది. పడి లేచి పైకెదిగిన తర్వాత మళ్లీ సేవాగుణాన్ని కలిగి ఉండడం కష్టం...

TPT : బతుకుపోరులో పడిలేచిన కెరటం.. మొక్కుకున్న ఆలయానికే ఛైర్మన్!

చిత్తూరు జిల్లా/తిరుపతి : దాతృత్వం ఒక్కోసారి కుటుంబాన్నే హారతి కర్పూరంలా కరిగించేస్తుంది. పడి లేచి పైకెదిగిన తర్వాత మళ్లీ సేవాగుణాన్ని కలిగి ఉండడం కష్టం. సంపాదన కన్నా మిన్నగా దాతృత్వంతో సంతృప్తిపడుతున్న ఒక రైతు కథ ఇది. 


పుంగనూరు మండలం ఇటిక నెల్లూరు గ్రామానికి చెందిన ఎస్‌కే వెంకట్రమణారెడ్డిది మోతుబరి రైతు కుటుంబం. అరవై ఎకరాల పొలముండేది. పదవ తరగతి వరకే చదువుకున్న ఆయనది స్వతహాగా సేవాతత్వం. అడిగిన వారికీ అడగని వారికీ కూడా సాయం చేసేవారు. దానికోసం క్రమంగా భూములు అమ్ముకుంటూ పోయారు. చూస్తుండగానే మొత్తం ఆస్తులన్నీ హారతి కర్పూరమయ్యాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో బతుకుదెరువు కోసం 20 ఏళ్ళ కిందట కుటుంబంతో ఊరు విడిచిపెట్టారు. గ్రామ దేవతలకు, పుంగనూరులోని మారెమ్మగుడికి, బోయకొండ గంగమ్మలకు మొక్కుకుని హైదరాబాదు వెళ్ళారు. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అడుగుపెట్టి పదేళ్ళలోనే అనూహ్యంగా ఎదిగారు. దీనికంతటికీ తన ప్రాంత దేవతల ఆశీస్సులే కారణమని బలంగా విశ్వసించారు. దీంతో సంపాదనలో సింహభాగం ఆలయాల అభివృద్ధికి, సమాజ సేవకు వెచ్చించడం ప్రారంభించారు.


మొక్కుకున్న ఆలయానికే ఛైర్మన్లయ్యారు!

ఊరు విడిచే ముందు ఏ అమ్మవారికైతే మొక్కుకున్నారో అదే ఆలయ పాలకమండలికి రమణారెడ్డి దంపతులు ఏకంగా అధ్యక్షులుగా నియమితులయ్యారు. బోయకొండ గంగమ్మ దేవస్థానం ట్రస్టు బోర్డుకు తొలుత రమణారెడ్డి 2010-11 నడుమ రెండేళ్ళ పాటు ఛైర్మన్‌గా పనిచేయగా ఆయన సతీమణి రతీదేవి 2014-15 నడుమ రెండేళ్ళ పాటు ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. అమ్మవారి దయతోనే తమకీ ఉన్నతి కలిగిందన్న భావనతో రమణారెడ్డి ఆలయాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన పదవీ కాలంలోనే కొండపై పుష్కరిణి నిర్మించారు. అక్కడి నుంచీ ఆలయ రాజగోపురం వరకూ మెట్లు కూడా కట్టించారు. మెట్లకు, గోపురానికి ఇరువైపులా, అలాగే బలిగుండు వద్ద అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేయించారు. అప్పటి వరకూ ఆలయానికి డిపాజిట్లు రూ. లక్షల్లోనే వుండేవి. వాటిని కూడా ఆలయ నిర్వహణ కోసం తరచూ ఖర్చు చేయడం జరిగేది. రమణారెడ్డి ఛైర్మన్‌ అయ్యాక తొలిసారి అమ్మవారి పేరిట ఏకంగా రూ. 4.50 కోట్లు డిపాజిట్‌ చేయించారు.


రెండొందలకు పైగా ఆలయాల జీర్ణోద్ధరణ

పుంగనూరు నియోజకవర్గంలో సుమారు రెండొందలకు పైగా ఆలయాల జీర్ణోద్ధరణకు రమణారెడ్డి భారీ ఎత్తున నిధులు ఖర్చు చేశారు. పుంగనూరు నడిబొడ్డునున్న మారెమ్మ ఆలయ జీర్ణోద్ధరణకు రూ. 50 లక్షలు, చౌడేపల్లెలో జనమేజయుడు నిర్మించినట్టుగా భావిస్తున్న  రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ రాజగోపుర పునరుద్ధరణకు రూ.80 లక్షలు ఖర్చు పెట్టారు. అలాగే 400 ఏళ్ళ కిందట పుంగనూరు జమీందారులు నిర్మించిన మృత్యుంజయేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణకు, చౌడేశ్వరీదేవి ఆలయ రాజగోపుర నిర్మాణానికి రూ.1.50 కోట్లు వెచ్చించారు.  గత పదేళ్ళలో ఆరు సార్లు సామూహిక వివాహాలు జరిపించారు.  500కు పైగా పేద జంటలకు పట్టు వస్త్రాలను, మంగళసూత్రాలను అందించారు. పేదలకు వైద్య చికిత్సల కోసం విరివిగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లో రమణారెడ్డి పలువురికి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు. - తిరుపతి, ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-10-31T18:36:46+05:30 IST