అమరావతే ఆంధ్రుల ఏకైక రాజధాని!

ABN , First Publish Date - 2021-12-18T07:52:23+05:30 IST

అమరావతే ఆంధ్రుల ఏకైక రాజధాని అని, దాన్ని సాధించేవరకూ అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా వుంటామని వైసీపీ మినహా రాజకీయ పార్టీలన్నీ ఏకకంఠంతో నినదించాయి.

అమరావతే ఆంధ్రుల ఏకైక రాజధాని!
చంద్రబాబు రాకతో కార్యకర్తల్లో హుషారు

అమరావతీ పరిరక్షణ మహోద్యమ సభలో వైసీపీయేతర పార్టీల స్పష్టీకరణ


తిరుపతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అమరావతే ఆంధ్రుల ఏకైక రాజధాని అని, దాన్ని సాధించేవరకూ అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా వుంటామని వైసీపీ మినహా రాజకీయ పార్టీలన్నీ ఏకకంఠంతో నినదించాయి. తిరుపతిలో శుక్రవారం సాయంత్రం అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభలో టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ,కాంగ్రెస్‌ పార్టీల ముఖ్య నేతలు ఈ మేరకు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రె్‌సకు సంబంధించి పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు తులసిరెడ్డి, షేక్‌ మస్తాన్‌ వలీ తమ పార్టీల తరపున అమరావతికి మద్దతు ప్రకటించడంతో పాటు దాన్ని సాధించేవరకూ రాజధాని రైతులతో కలసి పోరాడతామంటూ ప్రకటించారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పంపిన మద్దతు సందేశాన్ని ఆ పార్టీ నేతలు పసుపులేటి హరిప్రసాద్‌, గంగారపు రామ్‌ దాస్‌ చౌదరి సభా పూర్వకంగా ప్రకటించగా సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు బీజేపీతో వేదికను పంచుకోలేమని చెబుతూనే ఉద్యమానికి తమ మద్దతు కొనసాగుతుందంటూ అమరావతి పరిరక్షణ సమితి నేతలకు లేఖ రాశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ అమరావతి రాజధాని పరిరక్షణకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టయింది. ఈ పార్టీలు కాకుండా ఏపీ సాధు పరిషత్‌ తరపున శ్రీనివాసానంద సరస్వతి, సినీ పరిశ్రమ నుంచీ హీరో శివాజి, రైతు సంఘాల తరపున పలువురు నేతలు సైతం సభలో పాల్గొని తమ మద్దతు ప్రకటించడం విశేషం. అదే సమయంలో వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా సభకు హాజరై అమరావతికి మద్దతు ప్రకటించారు.


టీడీపీ శిశువు అమరావతి

అమరావతి రైతుల పాదయాత్ర.. ఓ సామాజిక వర్గానికి చెందినదని, తెలుగుదేశం పార్టీదే అంటున్నారు. అమరావతి.. తెలుగుదేశం పార్టీ శిశువు. ఆ బిడ్డను కాపాడుకోవడం కోసం మేము ఎప్పుడూ ముందుంటాం. అది తప్పా. ఇది కమ్మ కులస్తులకు సంబంధించినదని అంటున్నారు. మేమంతా రాయలసీమ రెడ్లు కాదా? ఇక్కడ కూర్చొన్న వారిలో బీసీలు, దళితులు లేరా? అమరావతి రాజధాని ఏ మతానికో, కులానికో సంబంధించినది కాదు. అందరూ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కావాలని డిమాండు చేస్తున్నారు. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులని అంటున్నావ్‌, నీకు దమ్ముంటే పంచాయతీల్లో ఏర్పాటుచేసిన సచివాలయాల విషయంలోనూ ఒక్కో పల్లెలో ఒక్కో విభాగాన్ని పెట్టాలి కదా? అమరావతికో చట్టం.. సచివాలయాలకో చట్టమా...? పాలన చేతకాక రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి సర్వనాశనం చేస్తున్నాడు. 


అమరావతిని ఆపడం ఏ శక్తి వల్లా కాదు 

ఈ రోజు అమరావతి రైతులు చేపట్టిన మహాసభకు వచ్చిన అశేష జనవాహినిని చూస్తుంటే అందరిలోనూ ఆత్మస్థ్వైర్యం పెరిగింది. అర చేతితో సూర్యుడిని ఆపడం సాధ్యమేమో కానీ.. అమరావతి రాజధానిని ఆపడం ఏ శక్తి వల్లా కాదు. జగన్‌రెడ్డికాదు వాడి తాత దిగొచ్చినా ఆపలేడు. దళిత ఓట్లతో ముఖ్యమంత్రి గద్దెనెక్కిన జగన్‌ వారినే దగా చేశాడు. అంబేడ్కర్‌ ఆశయాలను ప్రపంచానికి చాటి చెప్పాలని, నాటి సీఎం చంద్రబాబు రూ.150కోట్లతో అంబేడ్కర్‌ స్మారక చిహ్నాన్ని, భవనాన్ని నిర్మించాలని సంకల్పించారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. అధికారంలోకి వచ్చిన ఈ దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశాడు. దళితులే జగన్‌ను గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయి. ఐదు కోట్ల ఆంధ్రప్రజల బంగారు భవిష్యత్తు కోసం సుసంపన్నమైన రాజధాని నిర్మించాలని అమరావతిని ఎంపికచేశారు. ప్రపంచాన్ని చుట్టి కోట్లాది రూపాయల పెట్టుబడులు తెచ్చారు. రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు, ఆర్థికాభివృద్ధి వస్తుందని అనుకున్నాం, జగన్‌ రూపంలో అవన్నీ ఆవిరయ్యాయి. 


పాలనా రాజధానిపై శ్రీబాగ్‌ ఒప్పందంలో చెప్పలేదు

రాష్ట్రానికి పాలనా రాజధాని ఉండాలని శ్రీబాగ్‌ ఒప్పందంలో ఎక్కడా చెప్పలేదు. శ్రీబాగ్‌ ఒప్పందంలో ఏమి చెబుతోందో దానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కొందరు శ్రీబాగ్‌ ఒప్పందాన్ని తెరపైకి తీసుకొచ్చి.. మూడు రాజధానులను సమర్థిస్తున్నారు. 


కులాన్ని, మతాన్ని, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నాడు 

రాష్ట్రంలో కులాన్ని, మతాన్ని, ప్రాంతీయవాదాన్ని జగన్‌ రెచ్చగొడుతున్నాడు. నాది చిత్తూరు జిల్లా అయినా నా రాజధాని అమరావతి. ప్రతి ఒక్కరి రాజధాని అమరావతే. 45 రోజులు 450 కిలోమీటర్లు నడిచి కాళ్లకు బొబ్బలు వచ్చేలా అమరావతి కోసం న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట రైతులు పాదయాత్ర చేశారు. వీరిలో.. మహిళలు, వృద్ధులు, యువకులున్నారు. వీరిఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. మన చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధికి కట్టడాలు నిర్మిస్తే.. వాటిని కూల్చడం జగన్‌రెడ్డి నేర్చుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు. 


వైసీపీ నిర్ణయం మార్చుకోక తప్పదు

రైతులకు కష్టపెట్టకుండా భూములు తీసుకోవాలని రైతుల పక్షపాతి పవన్‌ కల్యాణ్‌ గతంలోనే చెప్పారు. అప్పుడు చెప్పినట్టే ఇప్పుడుకూడా అమరావతి రాజధాని కోసమే కట్టుబడి ఉన్నాం. మూడు రాజధానులు అని చెబుతున్న వైసీపీ పాలకులు నిర్ణయం మార్చుకోక తప్పదు. 

Updated Date - 2021-12-18T07:52:23+05:30 IST