అందరి చూపు.... తిరుపతి వైపు

ABN , First Publish Date - 2021-03-22T07:39:13+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికల్లో విజయంపైనే అందరి దృష్టీ పడింది.

అందరి చూపు.... తిరుపతి వైపు

ఉప ఎన్నికల ఇన్‌చార్జిలుగా అసెంబ్లీ నియోజకవర్గానికో మంత్రి, ఎమ్మెల్యే

తిరుపతికి టీడీపీ అగ్ర నేతల రాక

16 మందితో బీజేపీ ప్రచార కమిటీ


తిరుపతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి ఉప ఎన్నికల్లో విజయంపైనే అందరి దృష్టీ పడింది.అధికార పార్టీ నేతలకు ఇజ్జత్‌ కా సవాల్‌గా మారింది.అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ మంత్రిని ఇన్‌ఛార్జిగా నియమించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేకి సహకారమందించడానికి మరో ఎమ్మెల్యేకి పార్టీ అధిష్ఠానం బాధ్యతలప్పగించింది. సత్యవేడుకు మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, శ్రీకాళహస్తికి మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాఽథ రెడ్డి, తిరుపతికి మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలకు బాధ్యతలను అప్పగించారు. వీరంతా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఎన్నికల వ్యూహరచన చేయనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటీ ఓట్లతో బయటపడిన తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో పైచేయి తనదేనని నిరూపించుకున్నారు.ఇదే జోరును ఉప ఎన్నికలోనూ చూపించేందుకు సమాయత్తమవుతున్నారు.‘మున్సిపల్‌ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించాం. ఇప్పుడు మమ్మల్ని గెలిపించాలి. అంటే ప్రతి డివిజన్లో మెజారిటీ పెరగాలి. అప్పుడే భవిష్యత్‌లో మీకు ప్రాధాన్యత ఉంటుంది’ అని  ఇటీవల ఎన్నికైన కార్పొరేటర్లకు చెప్పినట్టు తెలుస్తోంది. మరో యువనేత హోటల్లో మకాం వేసి మరీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే వెంకట్రమణకు బాగా కలిసివచ్చిన ఆ హోటల్‌ ఇప్పుడా యువనేతకు అడ్డాగా మారింది. డివిజన్‌ స్థాయి నాయకులను హోటల్‌కు పిలిపించుకుని దిశానిర్దేశం చేస్తున్నారు.ఆర్పీలను, వలంటీర్లను విరివిగా వాడుకోవాలని , వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు అందవని చెప్పడానికి కూడా వెనకాడవద్దని ఉపదేశం చేసినట్టు సమాచారం. మున్సిపల్‌ ఎన్నికల్లో సగ భాగం ఏకగ్రీవాలు చేసుకుని, మరో సగభాగం ఎలాగెలిచామో బాగా ఎరిగిన క్షేత్రస్థాయి నాయకత్వం ఇప్పుడు అధినాయకులిచ్చిన టార్గెట్‌ సాధించడంపై తలమునకలవుతున్నట్టు తెలుస్తోంది. ఏకగ్రీవాలను బహుమతిగా పొందిన కొందరు కార్పొరేటర్లు రుణం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.ఉప ఎన్నికల్లో ఏజెంట్లను పెట్టకూడదంటూ ఓ టీడీపీ డివిజన్‌ అధ్యక్షుడి ఇంటికి వెళ్లి మరీ వైసీపీ కార్పొరేటర్‌ ఒకరు  బెదిరించారు.తమను కాదని టీడీపీకి పనిచేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని సదరు అధ్యక్షుడు టీడీపీ నాయకులతో మొరపెట్టుకున్నాడు.మరోవైపు శనివారం సాయంత్రం తిరుపతి వచ్చిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని ఆదివారం ఉదయం టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహ యాదవ్‌ తదితరులు కలిసి ఉప ఎన్నిక గురించి చర్చించారు.వెంకటగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన  సోమవారం శ్రీకాళహస్తి, సత్యవేడుల్లో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. 23వ తేదీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తిరుపతికి రానున్నారు. కపిలతీర్థం రోడ్డులోని పార్టీ కార్యాలయంలో  సమావేశం ఏర్పాటుచేస్తున్నారు. 24వ తేదీ పనబాక నామినేషన్‌ దాఖలు చేయనున్న సందర్భంగా పెద్దఎత్తున ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటిదాకా అభ్యర్థిని ప్రకటించని  బీజేపీ  16మందితో ప్రచార కమిటీని నియమించింది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కన్వీనర్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో పార్టీ అగ్రనేతలందరికీ స్థానం కల్పించారు. 

Updated Date - 2021-03-22T07:39:13+05:30 IST