తెలంగాణ రైతులకు టీటీడీ పశువుల దత్తత

ABN , First Publish Date - 2021-11-02T07:18:17+05:30 IST

ప్రకృతి వ్యవసాయం చేసే వారు కోరితే ఉచితంగా పశువులిచ్చే కార్యక్రమానికి టీటీడీ సోమవారం శ్రీకారం చుట్టింది.

తెలంగాణ రైతులకు టీటీడీ పశువుల దత్తత

ప్రకృతి వ్యవసాయం చేసే వారు కోరితే ఉచితంగా పశువులు


తిరుపతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం చేసే వారు కోరితే ఉచితంగా పశువులిచ్చే కార్యక్రమానికి టీటీడీ సోమవారం శ్రీకారం చుట్టింది. మొట్టమొదటగా తెలంగాణలోని నాగర్‌కర్నూలుకు చెందిన 45 మంది రైతులకు 90 పశువులను ఇచ్చింది. టీటీడీ వాహనాల్లోనే వాటిని తరలించారు. తమకు అనుబంధంగా నేచురల్‌ ఫామింగ్‌ విభాగం రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, వారికి పశువులు ఇవ్వాలని అగ్రికల్చర్‌ విభాగం సిఫార్సు చేయగా టీటీడీ అందించింది. ఈ పశువులను తీసుకున్న రైతులు వాటి సంరక్షణకు హామీ పత్రం ఇచ్చారు. అలాగే, అనిమల్‌ హస్బెండరీ విభాగం కూడా తాము ప్రతి ఆరు నెలలకు ఒకసారి టీటీడీ ఇచ్చిన పశువుల ఆరోగ్య స్థితిపై నివేదిక ఇస్తామని హామీ పత్రం అందించింది. ఇటీవల అనిమల్‌ హస్బెండరీ విభాగం, అగ్రికల్చరల్‌ విభాగంతో టీటీడీ చేసుకున్న ఒప్పందంలోని నిబంధనలను పాటిస్తున్నామని నాగర్‌ కర్నూలుకు చెందిన అనిమల్‌ హస్బెండరీ అధికారి రమేష్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఆవు పేడ, ఆవు పంచితం ప్రకృతి వ్యవసాయానికి లభ్యం కావటం లేదని, ఒట్టిపోయిన పశువులను తాము తీసుకోవడం ద్వారా వాటి గోమయం, గో పంచితం తమ వ్యవసాయానికి ఉపయుక్తం అవుతుందని పశువులను టీటీడీ గోశాలకు వచ్చి ఎంపిక చేసుకున్న రైతులు తెలిపారు. తిరుపతి, పలమనేరుల్లోని గోశాలల్లో ఇంకా వేలాదిగా ఒట్టిపోయిన పశువులున్నాయి. 

Updated Date - 2021-11-02T07:18:17+05:30 IST