రూ. కోటితో ఉడాయించిన బిగ్ బజార్ నిర్వాహకుల అరెస్టు
ABN , First Publish Date - 2021-12-30T05:50:07+05:30 IST
పీలేరులో బిగ్‌బజార్ పేరిట సూపర్‌మార్కెట్ తరహా దుకాణాన్ని ఏర్పాటు చేసి రూ.కోటి అప్పులు తీసుకుని ఉడాయించిన దంపతులు రెండేళ్ల తరువాత బుధవారం పోలీసులకు పట్టుబడ్డారు.

రూ. 1.40లక్షల నగదు, 230గ్రాముల బంగారం స్వాధీనం
పీలేరు, డిసెంబరు 29: పీలేరులో బిగ్‌బజార్ పేరిట సూపర్‌మార్కెట్ తరహా దుకాణాన్ని ఏర్పాటు చేసి రూ.కోటి అప్పులు తీసుకుని ఉడాయించిన దంపతులు రెండేళ్ల తరువాత బుధవారం పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ. 1.40లక్షల నగదు, 230గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన నారాయణమ్మ, ఆమె భర్త దండపాని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2010లో పీలేరులో ఏ టూ జడ్ బిగ్‌బజార్ పేరిట సూపర్‌మార్కెట్ తరహా దుకాణాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులు, పరిసరగ్రామాల వారితో పరిచయాలు పెంచుకున్నారు. తమ ప్రేరిట స్థానిక ఆంధ్రాబ్యాంకులో రూ. 85లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉందని, ఈ డబ్బుతో వడ్డీ వ్యాపారాన్ని చేపట్టనున్నట్లు నమ్మించారు. అధిక వడ్డీ ఇస్తామని పలువురి నుంచి రూ.కోటి అప్పలు తీసుకుని షూరిటిగా బ్లాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చారు. నెలలు గడిచినా అసలు, వడ్డీ ఇవ్వక పోవడంతో రుణదాతలు ఒత్తిడి చేశారు. దీంతో 2019లో దంపతులు అదృశ్యమయ్యారు. బాధితులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన దంపతులు తూర్పు గోదావరి జిల్లా తణుకులో ఎవరికంటా పడకుండా ఉంటూ వచ్చారు. బుధవారం పీలేరుకు వచ్చి షాపులోని సరుకును తీసుకెళ్లుందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పసిగట్టి వీరిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచారు.