తిరుమలలో ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం

ABN , First Publish Date - 2021-12-30T07:05:07+05:30 IST

‘ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా సంపూర్ణంగా ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేస్తున్నాం.

తిరుమలలో ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం
సమావేశంలో ప్రసంగిస్తున్న ధర్మారెడ్డి

ప్లాస్టిక్‌ షాంపూ ప్యాకెట్లు కూడా విక్రయించొద్దు

బయోడిగ్రేడబుల్‌ క్యారీ బ్యాగులకే అనుమతి

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి


తిరుమల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా సంపూర్ణంగా ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేస్తున్నాం. దుకాణాల నిర్వాహకులు కూడా బయోడిగ్రేడబుల్‌ క్యారీ బ్యాగులనే వినియోగించాలి’ అని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కోరారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల సర్వే చేశామని, కొండపై పలు దుకాణాల్లో ఇంకా ప్లాస్టిక్‌ క్యారీబ్యాగులు, ప్యాకింగ్‌ వినియోగిస్తున్నట్టు గుర్తించామన్నారు. మూడు నెలలు గడువు ఇస్తున్నామని, అందరూ ప్లాస్టిక్‌ నిషేధానికి సహకరించాలన్నారు. ప్లాస్టిక్‌ షాంపు ప్యాకెట్లు కూడా విక్రయించకూడదని, సబ్బులపై బయోడిగ్రేడబుల్‌ కవర్లు ఉండాలన్నారు. ఇప్పటికే గుట్కా, పొగాకు ఉత్పత్పుల నిషేధం అమలవుతోందని, ప్లాస్టిక్‌ విషయంలోనూ ఇలాగే వ్యవహరించాలని చెప్పారు. దుకాణాల వద్ద ఆక్రమణలు లేకుండా చూడాలన్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు నిర్దేశించిన విధంగా అన్ని దుకాణాలూ ఒకేలా కనిపించేలా షెల్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని దుకాణాల లైసెన్సులను పరిశీలించామని, అనధికారికంగా నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బేడి ఆంజనేయస్వామి ఆలయం, సబ్‌వే ప్రాంతాల్లో ఉన్న దుకాణదారుల సమస్యను పరిష్కరించామన్నారు. అలాగే పాపవినాశనం రోడ్డులోని దుకాణదారుల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితులకు దుకాణాలు కేటాయించే స్కీమ్‌ 2011లో ముగిసిందని తెలిపారు. తర్వాత దుకాణదారులు తెలిపిన సమస్యలను పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. టీటీడీ ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్య అధికారి శ్రీదేవి, ఎస్టేట్‌ అధికారి మల్లికార్జున, డీఎ్‌ఫవో శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T07:05:07+05:30 IST