కుంగుతున్న పాకాల పెద్ద చెరువు కట్ట

ABN , First Publish Date - 2021-10-28T05:58:36+05:30 IST

పాకాల మండలం సామిరెడ్డిపల్లె సమీపంలోని పాకాల పెద్దచెరువు కట్ట కుంగుతోంది. చెరువు నిండి నెలరోజులుగా మొరవ పోతోంది. చెరువుకు వస్తున్న నీటి ఉధ్రుతి కారణంగా కట్ట మధ్యలో 50 అడుగుల మేర కుంగిపోయి తెగిపోయే పరిస్థితి నెలకొంది.

కుంగుతున్న పాకాల పెద్ద చెరువు కట్ట
పాకాల మండలం సామిరెడ్డిపల్లె సమీపంలోని పాకాల పెద్దచెరువు కట్ట కుంగుతున్న దృశ్యం - కుంగుతున్న చెరువుకట్టను పరిశీలిస్తున్న ఆర్డీవో కనకనరసారెడ్డి, ఇరిగేషన్‌ అధికారులు

భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు


పాకాల, అక్టోబరు 27: పాకాల మండలం సామిరెడ్డిపల్లె సమీపంలోని పాకాల పెద్దచెరువు కట్ట కుంగుతోంది. చెరువు నిండి నెలరోజులుగా మొరవ పోతోంది. చెరువుకు వస్తున్న నీటి ఉధ్రుతి కారణంగా కట్ట మధ్యలో 50 అడుగుల మేర కుంగిపోయి తెగిపోయే పరిస్థితి నెలకొంది. 156.56 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు కట్ట సుమారు రెండు కిలోమీటర్లకుపైగా ఉంటుంది. ఈ చెరువు కట్ట తెగిపోతే పాకాల, పూతలపట్టు మండలాల పరిధిలో పలు గ్రామాలకు నష్టం వాటిల్లుతోంది. బండపాకాల, పసుపులేటివారిపల్లె, సంజీవరాయనిపల్లె, కల్లూరువారిపల్లె, పికొత్తకోట, మన్నారుపల్లె, దొమ్మాండ్లపల్లె, చెర్లోపల్లె, చవటపల్లె గ్రామాలకు పెనుముప్పు సంభవించనుంది. కొత్తకోటచెరువు, పెద్దినాయనిచెరువులూ తెగిపోయే పరిస్థితి ఉంది. వందలాది ఎకరాల్లో పంట నష్టంతో పాటు ప్రాణనష్టమూ ఉండొచ్చని పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వెంటనే కట్టకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ఈ చెరువు కట్ట రెండువైపులా ముళ్లకంపలు, చెట్లు ఏపుగా పెరిగిపోయి ఎక్కడ ప్రమాదం చోటుచేసుకుంటుందో తెలియని పరిస్థితి. తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి, తహసీల్దారు భాగ్యలక్ష్మి, ఎంపీపీ లోకనాథం, తిరుపతి రూరల్‌ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మజరెడ్డి, సర్పంచి జగన్నాథంరెడ్డి, ఇరిగేషన్‌ అధికారులు బుధవారం చెరువుకట్టను పరిశీలించారు. చెరువుకట్ట రక్షణకు చర్యలు చేపడతామన్నారు.

Updated Date - 2021-10-28T05:58:36+05:30 IST