పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు

ABN , First Publish Date - 2021-06-21T05:42:46+05:30 IST

విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఎస్‌ఐ జీపును అడ్డుకుని దుర్భాషలాడి నోటీసులు చించివేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ములకలచెరువు సీఐ సురేష్‌కుమార్‌ తెలిపారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు
ఎస్‌ఐ జీపు ముందు కూర్చున్న వెంకటరమణ కుటుంబం

ఎస్‌ఐ జీపు అడ్డగింత... నోటీసుల చించివేత


ముగ్గురి అరెస్టు... మరొకరి కోసం గాలింపు


ములకలచెరువు, జూన్‌ 20: విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఎస్‌ఐ జీపును అడ్డుకుని దుర్భాషలాడి నోటీసులు చించివేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్‌కుమార్‌ తెలిపారు. వీరిలో ముగ్గురిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను సీఐ తెలిపారు. ఈ నెల 17న ములకలచెరువులో రెండు వర్గాల మధ్య జరిగిన పరస్పర దాడులకు సంబంధించి ఒక కేసులో నిందితులుగా ఉన్న బత్తుల వెంకటరమణ కుటుంబానికి 41(ఏ) నోటీసులు జారీ చేయడానికి ములకలచెరువు ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో శనివారం సాయంత్రం వినాయకనగర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో బత్తుల వెంకటరమణ, ఆయన భార్య పద్మావతమ్మ, వారి కుమారులు సదాశివ, గణేష్‌... తమపైనే కేసు నమోదు చేస్తారా అంటూ ఎస్‌ఐ, సిబ్బందిని   దుర్భాషలాడారు. హెడ్‌కానిస్టేబుల్‌ గణేష్‌ చేతిలో ఉన్న నోటీసులను లాక్కొని చించేశారు. అలాగే ఎస్‌ఐ జీపు ముందు బైఠాయించి విఽధులకు ఆటంకం కలిగించారు. ఇంతటితో ఆగకుండా నిందితులలో ఒకడైన గణేష్‌ తమకు ఇప్పుడే న్యాయం జరగాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ కత్తితో కడుపుపై గాయం చేసుకున్నాడు. ఎస్‌ఐ రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడిన నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో బత్తుల వెంకటరమణ, పద్మావతమ్మ, గణేష్‌ను అరెస్టు చేశామన్నారు. బత్తుల సదాశివ పరారీలో ఉన్నాడన్నారు. వీరిలో బత్తుల సదాశివ, గణేష్‌పై 2018లో రౌడీషీట్లు  ఓపెన్‌ అయ్యాయని సీఐ చెప్పారు. ఈ ఘటనపై మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి శనివారం అర్ధరాత్రి విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన వెంటనే ములకలచెరువు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీఐతో కలిసి వినాయకనగర్‌ చేరుకుని విచారణ జరిపారు. 

Updated Date - 2021-06-21T05:42:46+05:30 IST