తిరుపతిలో కూలిన 60 ఏళ్లనాటి ఇల్లు

ABN , First Publish Date - 2021-11-28T07:26:52+05:30 IST

తిరుపతిలోని భవానీనగర్‌లో సుమారు 60 ఏళ్లనాటి పాత ఇల్లు ఒకటి శనివారం రాత్రి కూలిపోయింది.

తిరుపతిలో కూలిన 60 ఏళ్లనాటి ఇల్లు
ఇల్లు కూలకముందు

ఖాళీ భవనం కావడంతో తప్పిన ప్రాణనష్టం


తిరుపతి(కొర్లగుంట), నవంబరు 27: తిరుపతిలోని భవానీనగర్‌లో సుమారు 60 ఏళ్లనాటి పాత ఇల్లు ఒకటి శనివారం రాత్రి కూలిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నానిపోవడంతో ఆ భవనం ధృఢత్వం కోల్పోయి నేలమట్టమైంది. తిరుచానూరు ఆలయంలో అర్చకుడిగా పనిచేసిన ఎంజీ రామచంద్రన్‌ కుటుంబీకులు సుమారు ఆరు దశాబ్దాల కిందట భవానీనగర్‌లో మూడంతస్తుల భవనం నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం పాతపడటంతో అందులోనివారు వేరే ఇంటికి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఆ ఇల్లు ఖాళీగానే ఉంటోంది. గత వారంలో కురిసిన వర్షాలకు, వరదలకు నేలభాగం నుంచి గోడలు పూర్తిగా చెమ్మగిల్లాయి. మళ్లీ రెండ్రోజులుగా అప్పుడప్పుడు తేలికపాటి వర్షం కురుస్తుండడంతో గోడలు మరింత నాని.. గట్టిదనం కోల్పోయాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఒక్కసారిగా ఇల్లు నేలమట్టమైంది. అయితే పక్కన నివాసాలకు, స్థానికులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. కూలేటప్పుడు పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలియడంతో ఇంటి యజమానులు వచ్చి పరిశీలించారు. 



Updated Date - 2021-11-28T07:26:52+05:30 IST