ఉపాధ్యాయులకూ కేంద్ర మార్గదర్శకాలు: కత్తి

ABN , First Publish Date - 2021-05-05T06:20:22+05:30 IST

కేంద్రం ప్రకటించిన రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఉద్యోగ, ఉపాధ్యాయులకూ వర్తింపజేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండు చేశారు.

ఉపాధ్యాయులకూ కేంద్ర మార్గదర్శకాలు: కత్తి
కత్తి నరసింహారెడ్డి

శ్రీకాళహస్తి, మే 4: కొవిడ్‌ విధుల్లో మృతిచెందే వైద్యుల కుటుంబాలకు కేంద్రం ప్రకటించిన రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకూ వర్తింపజేయాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు కత్తి నరసింహారెడ్డి డిమాండు చేశారు. మంగళవారం ఆయన పట్టణ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌తో మృతిచెందిన 160 మంది ఉపాధ్యాయ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.  కొవిడ్‌ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఈహెచ్‌ఎ్‌స అమలుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌, వెంటిలేటర్ల కొరతతో అనేక మంది కొవిడ్‌ బాధితులు మృతిచెందుతున్నట్లు గుర్తుచేశారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు కొవిడ్‌ నుంచి తన భర్తను కాపాడుకోవడానికి రెండురోజుల పాటు ఆక్సిజన్‌ బెడ్‌ కోసం ప్రయత్నించినా దొరకలేదన్నారు. తిరుపతి సమీపంలోని చెర్లోపల్లెకు చెందిన ఓ చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఇదే పరిస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చిందని వాపోయారు. ఉద్యోగుల పరిస్థితి ఇలాగుంటే.. పేద, మధ్య తరగతి ప్రజల అవస్థలు వర్ణనాతీతమని వివరించారు. ఏ కొవిడ్‌ ఆస్పత్రికి వెళ్లినా దయనీయ దృశ్యాలే కన్పిస్తున్నాయన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నాడు-నేడు పనుల ఇన్‌చార్జిలుగా ఎంఈవోలు, డీవైఈవోల బాధ్యతలు అప్పగించడంతో విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 400 హెచ్‌ఎం పోస్టుల మంజూరు జాడలేదన్నారు. ఉర్దూ, తమిళ పాఠశాలల్లో 14ఏళ్లుగా కొత్త పోస్టుల భర్తీ లేదని చెప్పారు. యూపీ, ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ అయిన పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 10వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు యువశ్రీ మురళి, రామకృష్ణ, బాలయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-05T06:20:22+05:30 IST