సీనియర్ ఇంటర్‌లో 48,990 మంది పాస్
ABN , First Publish Date - 2021-07-24T06:39:21+05:30 IST
సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 48,990 మంది పాస్ అయ్యారు.

తిరుపతి(విద్య), జూలై 23: సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. 2020-2021 విద్యా సంవత్సరంలో సీనియర్ సైన్స్ గ్రూపుల విద్యార్థులకు ప్రయోగపరీక్షలు పూర్తవగా, కొవిడ్ కారణంతో ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల విద్యార్థులకూ థియరీ పరీక్షలు జరగని విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఛాయారతన్ కమిటీ సూచనల మేరకు టెన్త్, ఇంటర్ ఫస్టియర్, సీనియర్ ఇంటర్ ప్రాక్టికల్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చారు. ఆర్ట్స్ గ్రూపుల విద్యార్థులకు టెన్త్, ఇంటర్ ఫస్టియర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించినట్లు సమాచారం. ఈ పరీక్షలకు జిల్లాలో జనరల్ రెగ్యులర్, ప్రైవేట్, ఒకేషనల్ రెగ్యులర్, ప్రైవేట్‌గా మొత్తం 48,990 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని ఆర్‌ఐవో శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. జనరల్ రెగ్యులర్‌లో 45,387మందికి 23,525మంది బాలురు.. 21,862మంది బాలికలుండగా, ప్రైవేట్‌లో 604 మందికిగాను బాలురు 300మంది, బాలికలు 304 మంది ఉన్నారు. ఒకేషనల్ రెగ్యులర్ కోర్సుల్లో 2,955మందికి గాను బాలురు 1,789మంది, బాలికలు 1,166, ప్రైవేట్‌లో 44మందికిగాను బాలురు 25మంది, బాలికలు 19మంది పరీక్షలకు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. కాగా.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు దరఖాస్తు చేసిన 48,121మంది విద్యార్థులూ పాసయ్యారు. వీరిలో జనరల్ విభాగంలో 44,180మంది, ఒకేషనల్‌లో 3,941మంది ఉన్నారు.