రేణిగుంట పంచాయతీలో రూ.27.76 లక్షల దుర్వినియోగం
ABN , First Publish Date - 2021-07-08T08:15:54+05:30 IST
రేణిగుంట పంచాయతీలో పన్నులు వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని ఖజానాకు జమ చేయలేదు.

జూనియర్ అసిస్టెంట్ చేతివాటం
రేణిగుంట, జూలై 7: రేణిగుంట పంచాయతీలో పన్నులు వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని ఖజానాకు జమ చేయలేదు. మొత్తం రూ.27.76 లక్షలను సొంతానికి వాడుకున్నాడు. ఇలా పంచాయతీ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. రేణిగుంట మేజర్ పంచాయతీలో ఏటా రూ1.5 కోట్లు పన్నుల రూపంలో వసూళ్లవుతోంది. రోజువారీగా వసూలుచేసే ఇంటిపన్ను, కొళాయిపన్నును మరుసటి రోజు ఉదయాన్నే బ్యాంకులో ప్రభుత్వ ఖజానాకు జమచేస్తారు. అయితే జూనియర్ అసిస్టెంట్ గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు వసూలు చేసిన పైకాన్ని ఖజానాకు చెల్లించలేదు. ఈ క్రమంలో రోజువారి జమ వివరాలను చూపించాలని పంచాయతీ ఈవో కోరారు. దీనిపై సమాధానం చెప్పక పోవడంతో రికార్డులు సీజ్‌చేసి డివిజన్, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిసింది. ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారి దశరథరామిరెడ్డిని వివరణ కోరగా.. రేణిగుంట పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై తిరుపతి పంచాయతీ డివిజనల్ అధికారిని విచారించమని ఆదేశించినట్లు తెలిపారు.