తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.272 కోట్లు
ABN , First Publish Date - 2021-12-09T08:03:58+05:30 IST
తిరుపతి రైల్వేస్టేషన్ ఉత్తరం, దక్షిణం వైపు నూతన భవనాలు, పాతవి పునర్నిర్మాణ పనులను రూ.272 కోట్లతో చేపట్టే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ మేనేజర్ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు.

తిరుపతి(ఆటోనగర్) డిసెంబరు 8: తిరుపతి రైల్వేస్టేషన్ ఉత్తరం, దక్షిణం వైపు నూతన భవనాలు, పాతవి పునర్నిర్మాణ పనులను రూ.272 కోట్లతో చేపట్టే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ మేనేజర్ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్‌లోని అన్ని విభాగాలను బుధవారం ఆయన పరిశీలించారు. తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్ల తరహాలో వసతులు కల్పించడానికి పనులు చేపట్టడంపై తమ పర్యటన సాగుతోందన్నారు. దక్షిణం వైపు ఆరో ప్లాట్ఫారానికి అనుబంధంగా స్టేషన్ భవనాలను నిర్మించడానికి అవసరమైన వసతులపై స్థానిక అధికారులతో చర్చించారు. స్టేషన్‌కు ఉత్తరం వైపున్న పాతభవనాల స్థానంలో కొత్తవి నిర్మించడానికి అంచనాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఒకటో ప్లాట్ఫారం నుంచి ఆరో ప్లాట్ఫారం వరకు మరో రెండు ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. దక్షిణం వైపు నూతన భవనాన్ని నిర్మించిన అనంతరమే ఉత్తరం వైపు పనులను ప్రారంభిస్తే బాగుంటుందని సమీక్షా సమావేశంలో కొందరు అధికారులు సూచించారు. రెండు వైపులా ఒకేసారి పనులు చేపడితే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతాయని వారు వివరించారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనరు గిరీషతో వెంకటరమణారెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం సూర్యనారాయణ, సీనియర్ డీసీఎం ప్రశాంత్‌కుమార్, డీవోఎం బాలాజీ కిరణ్, డీఎ్‌సటీఈ శివప్రసాద్, డీఈఈ బండ్ల నరేష్, డీఎంఈ పుష్పరాజ్, డీఈఎన్ వెస్ట్ రుద్రమూర్తి, డీఈఎన్(నిర్మాణాలు) రామరాజు, స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ కె.సోమశేఖర్, సీసీఐ పరమేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.