నుంజర్ల వద్ద 14 ఏనుగుల గుంపు

ABN , First Publish Date - 2021-05-21T06:20:35+05:30 IST

ఏనుగుల గుంపు బుధవారం రాత్రి బంగారుపాళ్యం మీదుగా యాదమరి మండలం తాళ్లమడుగు అటవీప్రాంతానికి చేరుకున్నాయి.

నుంజర్ల వద్ద 14 ఏనుగుల గుంపు
అర్ధగిరి కొండపై ఏనుగుల గుంపు (ఫైల్‌ ఫొటో)

యాదమరి/పూతలపట్టు, మే 20: తవణంపల్లె మండలంలో ఉండిన ఏనుగుల గుంపు బుధవారం రాత్రి బంగారుపాళ్యం మీదుగా యాదమరి మండలం తాళ్లమడుగు అటవీప్రాంతానికి చేరుకున్నాయి. గురువారం నుంజర్ల ప్రాజెక్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో 10 పెద్ద ఏనుగులతోపాటు నాలుగు గున్నలున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ట్రాకర్ల సాయంతో వాటిని పంట పొలాలపైకి రాకుండా తరమడానికి ప్రయత్నిస్తున్నారు. రాత్రి సమయంలో ఎవరూ పొలాల వైపు వెళ్లొద్దని రైతులకు సూచించారు. 


పూతలపట్టు మండలంలో ఒంటరి ఏనుగు హల్‌చల్‌

పూతలపట్టు మండలంలోని ముత్తిరేవుల, వావిలతోట పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో రెండ్రోజులుగా ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేస్తోంది. మంగళవారం రాత్రి ఎస్వీసెట్‌ కళాశాల వెనుకవైపున్న అటవీ ప్రాంతం నుంచి ఒంటరి ఏనుగు ముత్తిరేవులలోకి చొరబడింది. స్థానిక యువకులు గమనించి, టపాకాయలు కాల్చడంతో వావిలతోట సమీపాన ఉన్న కండ్రిగ గ్రామంవైపు వెళ్లింది. అక్కడ బుధవారం సాయంత్రం కొంతమంది రైతులకు చెందిన మామిడి చెట్లను ధ్వంసం చేసింది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు బుధవారం అర్ధరాత్రి వరకూ కండ్రిగ గ్రామం వద్ద ఏనుగు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి దాటడంతో అధికారులు వెనుతిరిగారు. గురువారం కూడా ఒంటరి ఏనుగు వీర్లగుడిపల్లె వ్యవసాయ పొలాల్లో కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. 

Updated Date - 2021-05-21T06:20:35+05:30 IST