రాప్తాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి

ABN , First Publish Date - 2021-06-22T14:50:39+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ...

రాప్తాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా ముందుకొచ్చి జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఇటీవల గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జరిగిన ఘటనలు మరువకముందే రాప్తాడులో సోమవారం అర్ధరాత్రి మరో ఘటన చోటుచేసుకుంది.


రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైసీపీ కార్యకర్తల చేతిలో టీడీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలయ్యారు. పూర్తి వివరాల్లోకెళితే.. చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామంలో మహిళలను అసభ్య పదజాలంతో వైసీపీ కార్యకర్తలు దూషించారు!. ఆడవారిని ఇలా మాట్లాడటమేంటి..? అని వారిని టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ వారిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు రవి, మూర్తి, రామన్న తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రాథమిక చికిత్స నిమిత్తం సీకేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా మారడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. అయితే ఈ ఘటనపై నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ నేతలు ఇంతవరకూ స్పందించలేదు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యిందా..? ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారా.. లేదా..? అనే విషయం కూడా ఇంకా తెలియరాలేదు.

Updated Date - 2021-06-22T14:50:39+05:30 IST