భారీ వర్షాలు, వరదలకు చేతికొచ్చిన పంట వర్షార్పణం

ABN , First Publish Date - 2021-12-25T06:29:41+05:30 IST

ఖరీ్‌ఫలో సాగు చేసిన పంటలు కళ్లముందే భారీ వర్షాలు, వరదలకు కొట్టుకుపోయాయి.

భారీ వర్షాలు, వరదలకు   చేతికొచ్చిన పంట వర్షార్పణం
వరద నీటిలో మొక్కజొన్న (ఫైల్‌)

సాయం అందదు..సాగు సాగదు!

నేటికీ నష్టపరిహారం అందించని ప్రభుత్వం

రబీ సాగు పెట్టుబడికి రైతుల అవస్థలు

హిందూపురం, డిసెంబరు 24: ఖరీ్‌ఫలో సాగు చేసిన పంటలు కళ్లముందే భారీ వర్షాలు, వరదలకు కొట్టుకుపోయాయి. రైతులకు అపార నష్టం కలిగింది. సర్కారు సాయంతో రబీ సీజనలో అయినా పంటలు సాగు చేసి గట్టెక్కుదామనుకున్న రైతులకు నిరాశే మిగులుతోంది. సీజన ప్రారంభమై రెండు నెలలు గడిచినా చేతిలో చిల్లిగవ్వలేక రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా హిందూపురం వ్యవసాయ డివిజనలో మొక్కజొన్న, వరి పంటలు వర్షార్పణమవడం రైతులకు భారీ నష్టాన్ని కలిగించింది.  పలు గ్రామాల్లో పంటలు నేటికీ నీటి ముంపులోనే ఉన్నాయి. చేతికొచ్చిన పంటను కోల్పోగా ప్రభుత్వం అందించే నష్ట పరిహారం రైతు చేతికి అందకపోవటంతో  రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంపై ఆశలు సన్నగిల్లడంతో సన్న, చిన్నకారు రైతులు పంట సాగు చేయడానికి  అప్పుల కోసం అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులకు వచ్చే జనవరిలో పరిహారం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 


పంట నష్టం 908 ఎకరాల్లోనేనట!

జిల్లాలోనే అత్యధికంగా మొక్కజొన్న పంట సాగు చేసే హిందూపురం వ్యవసాయ డివిజనలో భారీ పంట నష్టం జరిగింది. ఖరీఫ్‌ సీజనలో 17500 ఎకరాలకుపైగా మొక్క జొన్న సాగు చేయగా కోతదశలో ఉన్న పంటను నవంబరులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, కర్ణాటక నుంచి వచ్చిన వరద నీరు ముంచేశాయి. పెన్నా, చిత్రావతి, కుషావతి, జయమంగళి నదులతోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లి పొలాలపై నీరు ప్రవహించింది. హిందూపురం డివిజనలోనే మొక్కజొన్న పంట సాగులో రూ. 35 కోట్లకుపైగా పెట్టుబడి పెడితే దాదాపుగా రూ. 10 కోటకుపైగా నష్టం వచ్చింది. అయితే 977 రైతులకుగాను 635 ఎకరాల్లో మాత్రమే పూర్తిగా మొక్కజొన్న నష్టం వాటిల్లినట్లు మరో 100 ఎకరాలకుపైగా పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ పంట నష్టం అంచనా వేసింది. వరి 263 ఎకరాలు, వేరుశనగ 10 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం. పరిగి, గోరంట్ల మండలాల్లో భారీగా మొక్కజొన్న పంట దెబ్బతిన్నా 635 ఎకరాలను మాత్రమే అంచనా వేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌ మొక్కజొన్నకు రూ. 12500. వరి రైతుకు హెక్టార్‌కు రూ. 15 వేల చొప్పున పరిహారం ఇస్తామని వెల్లడించింది. అయితే పంట నష్టపరిహారం జాబితాలో తమ పేర్లులేవని చాలా మంది రైతులు ఆవేదన చెందుతున్నారు.  


ప్రభుత్వ సాయంపై ఆశ

వరదల కారణంగా చేతికొచ్చిన పంట తీవ్రంగా దెబ్బతినగా రైతుల కష్టం నీటిపాలైంది. రబీ సీజన ప్రారంభమైనా చేతిలో నయాపైసా లేక కొత్తగా రుణ పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దీంతో రైతులు ప్రైవేట్‌గా అప్పులు చేయాల్సివస్తోంది. మొక్కజొన్న పంట సాగు చేయాలంటే ఎకరాకు రూ. 25 వేలు పెట్టుబడి పెట్టాలి. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే పరిహారం తోడైతే కాస్తా ఊరట లభిస్తుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి అదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


పరిహారం కోసం ఎదురుచూస్తున్నా: అంజినప్ప, మొక్కజొన్న రైతు

ఖరీ్‌ఫలో ఒకటిన్నర ఎకరాలో మొక్కజొన్న సాగు చేశా. చేతికొచ్చిన పంట నవంబరులో కురిసిన వర్షాలు, కర్ణాటక నుంచి వచ్చిన వరదకు పూర్తిగా నీట మునిగింది. రూ. 45 వేల వరకు నష్టం వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం నమోదు చేశారు. నెలరోజులు గడిచినా నేటికి పైసా ఇవ్వలేదు. రబీ సాగు చేసేందుకు పెట్టుబడి లేక అప్పు చేసి సాగు  చేయాలా వద్దా అని ఆలోచిస్తు న్నా. ప్రభుత్వం పంట నష్టం పరిహారం ఇస్తే రబీ లో పంట సాగు చేస్తా.

 

పరిహారం ఊసే లేదు: బ్రహ్మానందరెడ్డి, కొత్తచామలపల్లి, చిలమత్తూరు మండలం

నవంబరులో వచ్చిన వరదల కారణంగా సాగుచేసిన వరి, మొక్కజొన్నపంటలు పూర్తిగా కొట్టుకుపోయాయి. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం అందిస్తామన్న పంట నష్టపరిహారం ఇంతవరకు అందలేదు. ఎకరం వరి, రెండు ఎకరాలు మొక్కజొన్న పంటను పూర్తిగా నష్టపోయా. వ్యవసాయ అధికారులు వచ్చి నష్టపోయిన పంటను పరిశీలించి వెళ్లారు. కానీ ఇప్పటివరకు పరిహారం ఊసే లేదు. పంటల సాగుకు అప్పులు తెచ్చుకొన్నాను. ఇప్పుడు పంట నష్టపోవడం వలన అప్పుల బాధ పెరిగింది. రబీ సాగు చేద్దామంటే పెట్టుబడికి మళ్లీ అప్పులు చేయాలి.  పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి ఆదుకోవాలి. 


నష్టం అంచనా నివేదిక పంపాం

నవంబరులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పాటు వాగులు, వంకల వరద ప్రవాహంతో మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మొక్కజొన్నతోపాటు దెబ్బతిన్న పంటలపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి పారదర్శకంగా పంట నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేశాం. పంటల నష్టం అంచనా నివేదిక ప్రభుత్వానికి పంపాం. పరిహారం ఈనెలఖారునలేదా జనవరిలో రైతుకు అందే అవకాశం ఉంది. రబీ సాగు సాధారణంగా అక్టోబరులో ప్రారంభమైనా మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం మాత్రం జనవరిలో పెరుగుతుంది. 

- రవి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, వ్యవసాయ శాఖ, హిందూపురం
Updated Date - 2021-12-25T06:29:41+05:30 IST