గిరిజన బాలికల కళాశాలకు మోక్షం ఎప్పుడో.?

ABN , First Publish Date - 2021-07-12T05:54:16+05:30 IST

మండలంలోని సీజీ ప్రాజెక్టు వద్ద నాటి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో గిరిజన బాలికల కోసం గురుకుల పాఠశాల మంజూరుతో పాటు గిరిజన బాలికల కోసం కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ మంజూరు చేశారు.

గిరిజన బాలికల కళాశాలకు మోక్షం ఎప్పుడో.?
ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలం


 2014 లో మంజూరు.. 2016లో తరగతులు ప్రారంభం.. 

  గదులు లేవని కదిరికి తరలింపు


తనకల్లు, జూలై 11: మండలంలోని సీజీ ప్రాజెక్టు వద్ద నాటి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో గిరిజన బాలికల కోసం గురుకుల పాఠశాల మంజూరుతో పాటు గిరిజన బాలికల కోసం కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ మంజూరు చేశారు. పాఠశాలకు ప్రభుత్వం భూమి కేటాయించి నిధులు మంజూరు చేయడంతో భవనాలు నిర్మించి పాఠశాలను ప్రారంభించారు. పాఠశాలకు అనుబంధంగా 2014 లోనే కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పేరుతో బాలికల కోసం కళాశాల కూడా మంజూరు చేశారు. కానీ నేటి వరకు ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. ఈ కారణంగా 2016 లో కళాశాల ప్రారంభంలో ఒక సంవత్సరం కాలం మాత్రమే గురుకుల పాఠశాలలో కళాశాల నిర్వహించారు. ఆ తర్వాత కళాశాలను కదిరిలో నిర్వహిస్తున్నారు. కదిరిలోనే కళాశాల నిర్మాణం చేపట్టాలని అధికారులు తలంచడంతో గిరిజన సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ కారణంగా కళాశాల నిర్మాణం కదిరిలో కాకుండా తనకల్లులో చేపడతామని అధికారులు సెలవిచ్చారు. కానీ నేటి వరకు ఎలాంటి కళాశాల నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. దీంతో సీజీ ప్రాజెక్టు వద్ద ఉన్న గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు జూనియర్‌ కళాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తోంది. ఇతర ప్రాంతాలకు తమ పిల్లలను పంపడం ఇష్టం లేని తల్లిదండ్రులు పదో తరగతితోనే చదువులను మానిపిస్తున్నారు. ఈ కారణంగా గిరిజన బాలికలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్న విమర్శలు మండలంలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు మం డలంలోని సీజీ ప్రాజెక్టు వద్దనే కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ నిర్మాణం చేపట్టాలని గిరిజన సంఘాలు, గిరిజన నాయకులు , గిరిజనులు మండలంలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.


  స్థలం కేటాయిస్తే కళాశాల నిర్మాణం చేపడతాం..

తనకల్లుకు కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ మంజూరు అయిన విషయాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి దృష్టికి తీసుకెళ్ళింది. ఈ విషయంపై జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అన్నాదొరై మాట్లాడుతూ ప్రభుత్వం కళాశాల నిర్మాణానికి స్థలం కేటాయించలేదన్నారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే నిర్మాణం చేపడతామని వివరించారు.  


Updated Date - 2021-07-12T05:54:16+05:30 IST