చెప్పేదొకటి.. చేసేదొకటి..!

ABN , First Publish Date - 2021-02-06T07:17:10+05:30 IST

ఎన్నికల్లో ఒత్తిళ్లకు తలొగ్గం.. నిష్పాక్షికంగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్నారే గానీ, క్షేత్రస్థాయిలో మాత్రం చేతలు మరోలా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

చెప్పేదొకటి.. చేసేదొకటి..!

అధికారుల ఏకపక్షంతో  విసిగిపోతున్న అభ్యర్థులు

అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు  తలొగ్గుతున్నారంటూ ఆవేదన

పరిగణనలోకి తీసుకోని ప్రత్యర్థుల అభ్యంతరాలు

వైసీపీ మద్దతుదారులకు  వత్తాసు

అనంతపురం, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి):  ఎన్నికల్లో ఒత్తిళ్లకు తలొగ్గం.. నిష్పాక్షికంగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్నారే గానీ, క్షేత్రస్థాయిలో మాత్రం చేతలు మరోలా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి ఓ న్యాయం, ప్రతిపక్షాలకు మరో న్యాయంలా నడుచుకుంటున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పలు ఘటనలే ఇందుకు నిదర్శనం. పంచాయతీ ఎన్నికల్లో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్య నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. వైసీపీ మద్దతుదారుల నామినేషన్లపై టీడీపీ, ఇతర పార్టీల మద్దతుదారులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను తోసిపుచ్చుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. రెండో విడతలో భాగంగా ధర్మవరం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్లలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు వ్యవహరించిన తీరుతో ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు నివ్వెరపోవాల్సి వస్తోంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ మద్దతుదారులపై టీడీపీ, ఇతర పార్టీల వారు అభ్యంతరాలను వ్యక్తం చేసినా.. పట్టించుకునే నాథుడు క రువయ్యాడు. వారి అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధంగా లేని పరిస్థితుల్లో అధికారుల తీరుండటం సందేహాలకు తావిస్తోంది. ఏకంగా అధికార పార్టీ మద్దతుదారుల నామినేషన్లపై ఏ ఒక్కరు అభ్యంతరాలను వ్యక్తం చేసినా.. ఏదో ఒక సాకుతో తోసిపుచ్చుతున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ సిఫార్సులే శిరోధార్యంగా కొందరు అధికారులు పాటిస్తుండటం చూస్తే.. పంచాయతీ ఎన్నికలు ఏ మేరకు నిష్పక్షపాతంగా సాగుతున్నాయో స్పష్టంగా అర్థమవుతోంది. కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా ఇదే తరహాలో ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ చేసిన ఫిర్యాదులపై ఆగమేఘాలపై స్పందిస్తున్న పోలీసులు.. ఇతర పార్టీల విషయంలో మాత్రం చూసీచూడనట్లు ఉంటున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. అధికార పార్టీ మద్దతుదారులకే వత్తాసు పలుకుతుండటంతో ఇతర పార్టీలు బలపరచిన వారు నిస్సహాయ స్థితిలో మిన్నకుండిపోతున్నారు. ఎన్నికల అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. కార్యాలయాల ముందు ఏకంగా ధర్నాలకు కూర్చోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఎన్నికల అధికారులు ఏ తరహాలో వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.


అధికారులపై తీవ్ర ఒత్తిడి

స్థానిక సంస్థల షెడ్యూల్‌ మొదలు.. ఇప్పటి వరకూ అధికారులు చెబుతున్నదొకటి.. చేసేది మరొకటిలా కనిపిస్తోంది. ఆది నుంచి అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తాం. విమర్శలకు తావివ్వం.. ఒత్తిళ్లకు తలొగ్గేది లేదంటూ’ సమావేశాలు పెట్టుకుని మరీ.. చెబుతూ వచ్చారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతోపాటు మండలస్థాయిలో వైసీపీ ముఖ్య నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితోపాటు మండలస్థాయి అధికారి ఏకపక్షంగా వ్యవహరించారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. మండలంలోని తూముచెర్ల పంచాయతీ స్థానానికి పోటీచేసిన అధికార పార్టీ మద్దతుదారురాలు మరియమ్మకు ముగ్గురు సంతానం ఉన్నట్లు ప్రత్యర్థి అభ్యర్థి, టీడీపీ మద్దతుదారురాలు తగిన ఆధారాలతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించి మరియమ్మ పిల్లలు చదువుతున్న పాఠశాలల్లోని రికార్డుల్లో నమోదైన సర్టిఫికెట్లను జతపరిచారు. సంబంధిత రిటర్నింగ్‌ అధికారి పరిశీలిస్తామంటూ కాలయాపన చేశారు. తీరా.. సమయం ముగిసిన తరువాత చేతులెత్తేశారు. టీడీపీ మద్దతుదారురాలు ఇచ్చిన ఫిర్యాదులో వివరాలు సరిగా లేవని చెబుతుండటం చూస్తే.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు వారిపై ఏ మేరకు పనిచేశాయన్నది స్పష్టంగా అర్థమవుతోంది.


రాప్తాడు నియోజకవర్గంలోని బొమ్మేపర్తిలోనూ టీడీపీ మద్దతుదారుడు నరసింహులుపైనా ఇదే అభియోగాన్ని బయటికి తీసుకొచ్చారు. నరసింహులు గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన క్రమంలో సోషల్‌ ఆడిట్‌లో భాగంగా రూ.1000 దుర్వినియోగమైందని ఆ సొమ్మును చెల్లించలేదనే సాకును చూపుతూ.. ఆ అభ్యర్థి నామినేషన్‌ను దాదాపుగా తిరస్కరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.


కనగానపల్లి సర్పంచ్‌ స్థానానికి అధికార పార్టీ మద్దతుదారులిద్దరు పోటీలో ఉన్నారు. ఆ నియోజకవర్గ ముఖ్యనేత ఆదేశాలతో నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థికి అండగా నిలిచేందుకే అధికారులు తహతహలాడారు. అదే పార్టీ మద్దతుదారుడిగా పోటీచేసిన రెబల్‌ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించేలా సాకు చూపారు. గతంలో ఆ అభ్యర్థి ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ క్రమంలో జరిగిన సోషల్‌ ఆడిట్‌లో కొంత డబ్బు పక్కదారి పట్టిందనీ, దానిని ఆ అభ్యర్థి తిరిగి చెల్లించనందున తిరస్కరించేందుకు సిద్ధమవుతుండటం విమర్శలకు తావిస్తోంది.


చెన్నేకొత్తపల్లి మండలంలోని వెంకటాంపల్లి సర్పంచ్‌ స్థానానికి పోటీ చేసిన టీడీపీ మద్దతుదారుడు రమణారెడ్డి విషయంలోనూ సోషల్‌ ఆడిట్‌ ఉదంతాన్నే తెరపైకి తీసుకొచ్చారు. సామాజిక తనిఖీల్లో భాగంగా కొంత సొమ్ము దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటుండటం విమర్శలకు దారితీస్తోంది.


రాయదుర్గం నియోజకవర్గంలో డి. హిరేహాళ్‌ మండలం మలపనగుడి సర్పంచ్‌ స్థానానికి టీడీపీ మద్దతుదారుడిగా నామినేషన్‌ వేసిన ఏకాంతరెడ్డికి ఆ గ్రామ కార్యదర్శి షాకిచ్చారు. నోడ్యూస్‌ సర్టిఫికెట్‌ కోసం కార్యదర్శి చుట్టూ తిరిగినప్పటికీ.. ఇవ్వకుండా మొఖం చాటేయటంతో చివరకు అతడి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించాల్సి వచ్చింది. అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా కార్యదర్శి ఎర్రిస్వామి నోడ్యూస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడమనేది విమర్శలకు దారితీసింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులెవరైనా నామినేషన్‌ వేసేందుకు కావాల్సిన సర్టిఫికెట్లను పార్టీలతో పనిలేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ ఇస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ.. కిందిస్థాయిలో గ్రామ కార్యదర్శి తీరు చూస్తుంటే.. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఆ వ్యవహారమంతా నడిచిందన్నది స్పష్టంగా అర్థమవుతోంది.



Updated Date - 2021-02-06T07:17:10+05:30 IST