రొటేషనలోనే నీటిని విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-12-30T05:58:24+05:30 IST
కొన్నేళ్ల నుంచి రొటేషన పద్ధతిలో వదులుతున్న నీటిని రెండు కాలువలకు దామాషా ప్రకారం వదలాలని భైరవానతిప్ప ప్రాజెక్టు ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు.

ఆయకట్టు రైతుల సమావేశంలో తీర్మానం
గుమ్మఘట్ట, డిసెంబరు 29: కొన్నేళ్ల నుంచి రొటేషన పద్ధతిలో వదులుతున్న నీటిని రెండు కాలువలకు దామాషా ప్రకారం వదలాలని భైరవానతిప్ప ప్రాజెక్టు ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. ఈక్రమంలో వాడివేడిగా సాగిన చర్చ చివరకు రసాభాసగా మారింది. బీటీపీ కుడి, ఎడమ కాలువల పరిధిలోని ఆయకట్టు రైతుల సమావేశం బుధవారం గుమ్మఘట్టలోని వెలుగు కార్యాలయంలో సాగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్యతో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు, అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం జ రిగింది. రొటేషన పద్ధతి ద్వారా అన్యాయం జరుగుతోందననీ, దానిని మార్చి తమకు నీటిని సక్రమంగా కేటాయించాలని పోలేపల్లి మాజీ ఎంపీటీసీ లోకేష్.. అధికారులను కోరాడు. దీంతో సమావేశంలో ఉన్న కుడి, ఎడమ కాలువల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా కొనసాగుతున్న రొటేషన పద్ధతిని మార్పు చేసి రైతులకు అన్యాయం చేసేవిధంగా మాట్లాడటం సబబు కాదంటూ హితవు పలికారు. దీంతో పది నిమిషాల పాటు సమావేశం రసాభాసగా మారింది. వెంటనే ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని గత కొన్నేళ్లుగా రైతుల శ్రేయస్సు కోసం అందిం చే సాగునీటిని ఎలా వినియోగించుకుంటారో అదే పద్ధ తిని కొనసాగించాలని తీర్మానిస్తూ రైతులకు నచ్చజెప్పారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి నీరు చేరి 20 రోజులు గడుస్తున్న కు డి, ఎడమ కాలువల మరమ్మతుల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఇప్పటిదాకా కాలువల్లో పిచ్చి మొక్కలు, కంపచెట్లు తొలగించారే తప్ప పూడికతీత పనులు చేపట్టలేదని పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు అధి కారులను నిలదీశారు. రెండు మూడురోజుల్లో కాలువ పూడికతీత పనులు ఉపాధి హామీ పనుల ద్వారా వెంట నే చేపట్టాలని బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట మండలాల ఉ పాధి సిబ్బందిని ప్రజాప్రతినిధులు ఆదేశించారు. ఆయ కట్టు రైతుల సమావేశం సందర్భంగా నీటి విడుదల తేదీను ఖరారు చేస్తారనే ఆశతో ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. కలెక్టర్ సెలవులో ఉన్న కారణంగా నీటి విడుదల తేదీను ఖరారు చేయడం లేదని, మరో రెండు మూడు రోజుల్లో కలెక్టర్ అనుమతితో తేదీలు ఖరారు చేస్తామని ప్రజాప్రతినిధులు రైతులకు తెలిపారు. ఇంత మాత్రానికి ఇలాంటి సమావేశాలు నిర్వహించడ మెందుకని కుడి, ఎడమ కాలువల పరిధిలోని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. కాగా ఎడమ కాలువ పరిధిలో గతంలో మిగిలి ఉన్న 2800 ఎకరాలు పూర్తి చేస్తూ కుడి కాలువ పరిధిలో 1800 ఎకరాల చివరి ఆయకట్టు నుంచి నీటిని అందించేందుకు తీర్మానించారు. సమావేశంలో ఇరిగేషన ఈఈ మురళి, రాయదుర్గం డీఈ నరసింహమూర్తి, కళ్యాణదుర్గం డీఈ బలరామ్, ఏఈ సాయిరామ్, గుమ్మఘట్ట ఏఈ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.