పట్టణ రైతులకు చుక్కెదురు..!
ABN , First Publish Date - 2021-05-21T05:18:45+05:30 IST
సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల కోసం పట్టణ పరిధిలోని ప్రాంతాల రైతులు అవస్థలు పడుతున్నారు.

సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం అవస్థలు
జిల్లా వ్యాప్తంగా వేలాది మంది బాధితులు
పట్టణ వార్డు సచివాలయాలకు ఆప్షన ఇచ్చేందుకు ఉన్నతాధికారుల నిరాకణ
సమీప రైతు భరోసా కేంద్రాలకు వెళ్లాలని ఉచిత సలహా
అనంతపురం వ్యవసాయం, మే 20: సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల కోసం పట్టణ పరిధిలోని ప్రాంతాల రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో అనంతపురం నగర పా లక సంస్థ, 11 మున్సిపాలిటీలున్నాయి. ఆయా మున్సిపాలిటీల పరిధిల్లో కొన్ని రెవెన్యూ గ్రామాలున్నాయి. ఆయా రెవెన్యూ గ్రామాల రైతులు మున్సిపాలిటీ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోకి వస్తారు. రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ విత్తన కాయల పంపిణీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయితే మున్సిపాలిటీ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి వచ్చే రెవెన్యూ గ్రామాల రైతులకు అక్కడే విత్తన కాయలు పంపిణీకి ఆప్షన ఇచ్చేందుకు ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు అంగీకరించలేదు. గత ఏడాదిగా ఈ సమస్య కొనసాగుతోంది. ఈ ఏడాదైనా ఈ సమస్యను పరిష్కరిస్తారని భావించినా ఫలితం లేకపోయింది. ఈనెల 10వ తేదీ నుంచి తొలి విడత కింద రైతు భరోసా కేంద్రాల్లో రైతుల పేర్లు రిజిస్ర్టేషన చేసుకున్నారు. అలాగే తొలి విడతలో ఈనెల 17 నుంచి విత్తన కాయలు పంపిణీ చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని రైతులను రెండు, మూడో విడతల కింద ఎంపిక చేశారు. అలాగే ఈనెల 17 నుంచి రెండో విడతలో పేర్లు నమోదు కొనసాగుతోంది. 23వ తేదీ నుంచి మూడో విడత కింద పేర్లు నమో దు ప్రారంభించనున్నారు.
సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం అవస్థలు
మున్సిపాలిటీ పరిధిల్లో దాదాపు 40 రెవెన్యూ గ్రామాల పరిధిల్లో వేలాది మంది రైతులు సబ్సిడీ విత్తన కాయల కోసం ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి విత్తన కాయలు ఇప్పించాలని కోరినా ఆప్షన ఇవ్వలేదని సమాధానం చెబుతుండటంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఆయా రైతులకు సమీపంలో గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ర్టేషనతోపాటు డబ్బులు చెల్లించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డబ్బులు కట్టించుకునే ఆప్షన లేకపోవడంతో, సమీపంలోని గ్రామ సచివాలయాలకు వెళ్లాలని రైతులకు సూచించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు ప్రాంతాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన రైతులను పట్టించుకోవడం లేదన్న వాదనలు విపిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాయాల్లో విత్తన కాయలు పంపిణీ చేసేలా చూస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. కొన్ని మున్సిపాలిటీల పరిధిల్లోని రె వెన్యూ గ్రామాలకు ఇతర గ్రామాల రైతు భరోసా కేంద్రాలు ఎక్కువ దూరంలో ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాల్సి ఉంది. మరి ఏమేరకు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.