ముగ్గురు అన్నదమ్ములు దొంగలే..!

ABN , First Publish Date - 2021-08-27T05:49:53+05:30 IST

ఆ ముగ్గురూ స్వయానా అన్నదమ్ములు. దొంగతనాలు చేయడంలో అన్నదమ్ములది అందెవేసిన చేయి. కలసి పుట్టారు..

ముగ్గురు అన్నదమ్ములు దొంగలే..!
అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ రమ్య

- అంతర్‌రాష్ట్ర సెల్‌ఫోన దొంగల ముఠా అరెస్ట్‌ 

 - 53 సెల్‌ఫోన్లు స్వాధీనం 

హిందూపురం టౌన, ఆగస్టు 26: ఆ ముగ్గురూ స్వయానా అన్నదమ్ములు. దొంగతనాలు చేయడంలో అన్నదమ్ములది అందెవేసిన చేయి. కలసి పుట్టారు.. కలసి దొంగతనాలు చేయాలనేది వీరి సిద్ధాంతం. సెల్‌ఫోన్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే నలుగురిని పోలీసులు అరెస్టుచేశారు. వీరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండటం విశేషం. అరె్‌స్టకు సంబంధించిన వివరాలను గురువారం పెనుకొండ డీఎస్పీ రమ్య హిందూపురంలో వెల్లడించారు. కర్నూలు జిల్లా డోనకు చెందిన అన్నదమ్ములు ఎరుకుల కావిడి లక్ష్మీనారాయణ, ఎరుకుల కావిడి వంశీకృష్ణ, ఎరుకల కావిడి రాజే్‌షలతోపాటు డోన పట్టణంలోని కొండపేటకు చెందిన షేక్‌ మాసూమ్‌బాషలు ముఠాగా ఏర్పడ్డారు. కొంతకాలంగా హిందూపురం, చిలమత్తూరు, కర్నాటక చిక్కబళ్లాపురం, దేవనహళ్లి, విజయపురం, మునమంగ్ల, తిరుపతి, కాళహస్తి ప్రాంతాల్లో జనం అధిక సంఖ్యలో ఉండేచోట రైల్వే స్టేషన, బస్టాండు, సినిమాహాళ్లను ఎంచుకుని సెల్‌ఫోన్లను దొంగలించేవారు. అయితే చిలమత్తూరు పోలీసులు చోరీకి గురైన సెల్‌ఫోన నంబరు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొడికొండ చెక్‌పోస్టులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ స్కార్పియో వాహనంలో నలుగురు వస్తుండగా హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.7.5 లక్షలు విలువైన 53 సెల్‌ఫోన్ల స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు మన్సూరుద్దీన, హమీద్‌ఖాన, బాలమద్దిలేటి, అస్రార్‌బాష, ఎస్‌ఐ రంగడు, కరీం పాల్గొన్నారు. 





Updated Date - 2021-08-27T05:49:53+05:30 IST