తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో అనంతపురం జిల్లాకు తీవ్ర నష్టం

ABN , First Publish Date - 2021-06-25T05:56:27+05:30 IST

కరువు జిల్లాపై..

తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో అనంతపురం జిల్లాకు తీవ్ర నష్టం
శ్రీశైలం జలాశయం

అడ్డుకోకపోతే అంధకారమే!

తాగు, సాగు నీటికి కృష్ణా జలాలే శరణ్యం 

తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులే జిల్లాకు జీవనాధారం 

ఆ రెండు ప్రాజెక్టులతో 70 టీఎంసీల దాకా కేటాయింపులు 

కృష్ణా జలాలతో 4.9 లక్షల ఎకరాల సాగు 

ఎగువ నుంచి భారీ వరద రాకుంటే జిల్లా ఎడారే 

అక్రమ ప్రాజెక్టులను ఆపకపోతే వలసలు, ఆకలి చావులు తప్పవు!


రాయదుర్గం(అనంతపురం): కరువు జిల్లాపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటోంది. ఇప్పటికే వలసలు, కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనాన్ని కల్గించే భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు భవిష్యత్తులో గండం తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు తుంగభద్ర జలాశయాలే జీవనాధారంగా ఉన్న పరిస్థితుల్లో ఎగువన తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టుల వల్ల నీటి కష్టాలు తప్పవని స్పష్టమవుతోంది. కృష్ణా జలాల ఆధారంగా జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టులు, చెరువుల పరిస్థితి దయనీయంగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 27.10 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఉన్నా 70 టీఎంసీలకు పైగా నీటి కేటాయింపులు ఉన్నాయి.  4.90 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కాకపోతే హంద్రీనీవా కాలువ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా జలాలకు సంబంధించి ఆయకట్టు కేటాయింపు చేశారు.


ముఖ్యంగా జిల్లాలో చెరువులు, రిజర్వాయర్‌లు ఉన్నప్పటికీ ప్రధాన జీవనాధారం మాత్రం కృష్ణా జలాలే  ఎగువన భారీగా వర్షాలు కురిసి వరదలు వస్తేనే కేటాయించిన జలాలు జిల్లాకు అందుతాయి. పైగా ఇప్పటికే ఎగువ నుంచి వరద కొన్ని సార్లు పూర్తిగా తగ్గిపోయి కేటాయింపుల్లోని నీటి వాటా తగ్గుతోంది. దీంతో అటు ఆ యకట్టులో సాగు విస్తీర్ణానికి కోత విధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఎగువన ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లాపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన సాగునీటి రంగ నిపుణుల నుంచి వినిపిస్తోంది. 



జిల్లాలో జలాశయాల పరిస్థితి

జిల్లాలో పెన్నఅహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(పీఏబీఆర్‌), మిడ్‌ పెన్నార్‌ రిజర్వాయర్‌(ఎంపీఆర్‌), హంద్రీనీవాలో భాగమైన జీడిపల్లి లాంటి రిజర్వాయర్‌లు ఉన్నాయి. ఉన్న పది రిజర్వాయర్ల సామర్థ్యం 27.10 టీఎంసీలే. ఇందులో విజయనగరరాజుల కాలంలో నిర్మించిన చెరువులు కూడా ఉన్నాయి. వాటిలో చిక్కణ్ణేశ్వరస్వామి, బుక్కరాయసముద్రం చెరువు లాంటి వాటి వల్ల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరగడమే కాకుండా ఉద్యాన పంటల సాగుకు ఎంతో దోహదపడుతున్నాయి. జిల్లాకు తుంగభద్ర, హంద్రీనీవా ద్వారా 70 టీఎంసీల దాకా నీటి కేటాయింవులు ఉన్నాయి. వాటిలో తుంగభద్ర నుంచి 32.50 టీఎంసీలు, తాగునీటి అవసరాల కోసం కేసీ కెనాల్‌ డైవర్షన్‌ నీటిని పీఏబీఆర్‌కు మళ్లించేందుకు పది టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు మల్యాల నుంచి లిఫ్ట్‌ చేసి 40 టీఎంసీలు మూడు జిల్లాలకు కేటాయిస్తే అందులో 30 టీఎంసీల దాకా జిల్లాకు కేటాయించారు. దీంతో పాటు తుంగభద్ర ఎగువ కాలువ కింద 1,45,236 ఎకరాలు ఆయకట్టును స్థిరీకరించారు. అయినప్పటికీ ఎగువ నుంచి నీటి లభ్యత తగ్గిపోతుండటంతో లక్ష ఎకరాలకు మించి సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. హంద్రీనీవా ద్వారా 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించినప్పటికీ ప్రస్తుతం పురోగతిలో ఉంది. కాలువ వెడల్పు చేసి మరిన్ని జలాలు తీసుకు రావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెండు టీఎంసీల సామర్థ్యం కలిగిన భైరవానితిప్ప ప్రాజెక్టు, 1.7 టీఎంసీల సామర్థ్యం కలిగిన పేరూరు ప్రాజెక్టులు ఇప్పటికే ఎగువ నుంచి వరద నీరు రాక బీడు పడ్డాయి. వీటికి కూడా హంద్రీనీవా జలాలను అందించడమే కాకుండా చెరువులకు నీరిచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు పుష్కలంగా వరద వస్తుండటంతో కేటాయించిన నీటిని విడుదల చేసుకోవడంలో సఫలీకృతులవుతున్నారు. పైగా ఎగువ రాష్ట్రం తెలంగాణ, కృష్ణా పరివాహక నీటి ఆధారంగా పలు ప్రాజెక్టులను నిర్మించింది. తాజాగా కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెల్లడించిన విషయం విదితమే. హంద్రీనీవా, తుంగభద్ర జలాలపై అధిక శాతం పట్టణాలు, గ్రామాలు తాగునీటికి ఆధారపడ్డాయి. సాగునీటికి కూడా రైతులు ఆధారపడి ఆయకట్టును స్థిరీకరించి జీవనాధారం పొందుతున్నారు. ఎగువన ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఆశించిన మేరకు వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరకపోతే హంద్రీనీవా నుంచి అందాల్సిన జలాలు అందకపోతే స్థిరీకరించిన ఆయకట్టు పరిస్థితితో పాటు తాగు నీటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. 



శ్రీశైలం నీటి లభ్యత

కృష్ణా, తుంగభద్ర, హంద్రీ నదులపై ఆధారపడిన శ్రీశైలం జలాశయానికి 2010-11 నుంచి 2020-21 వరకు నీటి లెక్కలు పరిశీలిస్తే 2010-11, 2019-20, 2020-21 మూడేళ్లలో మాత్రం వెయ్యికి పైగా టీఎంసీల వరదనీరు చేరింది. 2011-12లో 734 టీఎంసీలు, 2013-14లో 848 టీఎంసీలు, 2014-15లో 614 టీఎంసీల నీరు చేరాయి. ఐదేళ్లలో కనిష్టంగా 59, గరిష్టంగా 541 టీఎంసీలు చేరాయి. సగటున యేటా 311 టీఎంసీలకు మించి జలాశ యంలో నీరు చేరలేదని ఇంజనీర్ల లెక్కలు చెబుతున్నా యి. 35-45 శాతం నీటి వాటా తుంగభద్ర నది నుంచే చేరుతోంది. దీని ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసి, భారీ వరదలు వస్తే తప్ప శ్రీశైలం జలాశయానికి కృష్ణా వరద ఆశాజనకంగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే నిర్మించిన, నిర్మించబోతున్న ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి లిఫ్ట్‌, పాలమూరు -రంగారెడ్డి, దండి లిఫ్ట్‌, మిషన్‌ భగీరథ, భక్త రామదాసు, తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకాల ద్వారా 255 టీఎంసీలకు పైగా వాడుకోవాలని తెలంగాణ రాష్ట్రం సన్నాహాలు చేస్తోంది. ఐదేళ్లు సగటున శ్రీశైలం జలాశయంలో చేరే వరదలో ముప్పాతిక శాతం ఎగువ రాష్ట్రమే వాడుకుంటే దిగువన ఉన్న రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం లేకపోలేదు.  



ఆయకట్టుపై తీవ్ర ప్రభావం 

ఎగువన అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో మల్యాల నుంచి లిఫ్ట్‌ పద్ధతి ద్వారా హంద్రీనీవా నుంచి జిల్లాకు అందుతున్న కృష్ణా జలాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆగస్టు నుంచి నవంబరు వరకు లిఫ్ట్‌ పద్ధతిలో జలాలను మళ్లించుకోవాలి. పైగా జలాలను కేటాయించినప్పటికీ ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా వస్తే తప్ప జిల్లాకు కేటాయించిన జలాలు అందవు ఈ నేపథ్యంలో ఎగువన ప్రాజెక్టులను నిర్మించి ఎక్కడికక్కడ కట్టడి చేస్తే స్థిరీకరించిన ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది.  జిల్లాలో ఉన్న రిజర్వాయర్‌లను అటు తుంగభద్ర, ఇటు హంద్రీ నీవా రెండింటిని సమన్వయం చేసి పీఏబీఆర్‌, ఎంపీఆర్‌లకు నీటిని మళ్లించే అనువైన వాతావరణం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎగువ నుంచి రావాల్సిన వరదనీటిని కట్టడి చేసి నిర్మాణాలు చేపడితే జిల్లాలో ఇప్పటికే స్థిరీకరించిన ఆయకట్టుకు నీరందించలేని పరిస్థితుల్లో మరింత దుర్భర పరిస్థితులు ఎదురవుతాయి. తుంగభద్ర, హంద్రీనీవాల ద్వారా 4.90 లక్షల ఆయకట్టు కేటాయించినప్పటికీ అంత స్థాయిలో సాగు చేయలేని పరిస్థితి. భవిష్యత్తులో హంద్రీనీవాను వెడల్పు చేసి మరింత నీటిని జిల్లాకు తీసు కురావాలన్న ఆలోచన ఉండటంతో ఆయకట్టుకు నీరు పుష్కలంగా అందుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎగువన అక్రమ ప్రాజెక్టుల ప్రభా వం జిల్లాపై తీవ్రంగా పడనుంది. 



ప్రాజెక్టులను అడ్డుకోకపోతే...

కృష్ణానదీ జలాల ఆధారంగా ఉన్న హంద్రీనీవాపై తె లంగాణ ప్రాజెక్టుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది.  జిల్లాలో కృష్ణా పరివాహక ప్రాంతంలో అనుబంధంగా ఉండే వేదావతి హగరి న దిపై భైరవానితిప్ప ప్రాజెక్టు నిర్మించారు. పెన్నానదిపై పేరూరు ప్రాజెక్టును నిర్మించారు. కాగా ఇప్పటివరకు ఎగువనున్న కర్ణాటక ప్రాంతంలో అక్ర మ నిర్మాణాలు చేపట్టడంతో భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీటి లభ్యత పూర్తిగా పడిపోయింది. పేరూరులో 10,080 ఎకరాలు, భైరవానితిప్ప ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాల ఆయ కట్టు ఉంది. ఈ రెండు ప్రాజెక్టులకు కృష్ణా జలాలను మళ్లించేందుకు ప్రభుత్వం టెండర్ల పద్ధతి ద్వారా ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించింది. దీంతో పాటు వందలాది చెరువులకు కృష్ణా జలాలను మళ్లించి జిల్లాను సస్యశ్యామలం చేయాలని భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎగువ నున్న ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తే ఇప్పటికే ఒట్టిపోయిన జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. ఈ నేపథ్యంలో అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకపోతే హంద్రీనీవా ద్వారా గొల్లపల్లి, చెర్లోపల్లి, మారాల, భైరవానితిప్ప, పేరూరు డ్యామ్‌లకు నీరు అందించేందుకు తీవ్ర కష్టాలు ఎదురవుతాయని అం చనా వేస్తున్నారు. దీంతో జిల్లాపై ప్రభావం చూ పే ఆ ప్రాజెక్టులను నిలిపివేసేందుకు ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 



కేసీ కెనాల్‌ వాటా కేటాయింపుపై ప్రభావం 

కేసీ కెనాల్‌ డైవర్షన్‌ నీటిని పీఏబీఆర్‌కు తాగునీటి అవసరాల కోసం పది టీఎంసీలు కేటాయించిన విషయం తెలిసిందే. అందులో ఏటా రెండు టీఎంసీలకు మించి తీసుకోలేని పరిస్థితి. కాకపోతే శ్రీశైలంలో వరద నీరు తగినంత స్థాయిలో అందకపోతే కేసీ కెనాల్‌ డైవర్షన్‌ నీటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. మళ్లించే జలాలను మళ్లించకుండా అడ్డుకునే పరిస్థితులు ఎదురవుతాయి. ప్రాంతీయంగా నీటి కోసం పోట్లాటలు ప్రారంభమవు తాయి. ఈ నేపథ్యంలో ఎగువన నిర్మించే అక్రమ ప్రాజెక్టులను పూర్తిగా అడ్డుకుని జిల్లాకు కేటాయించిన జలాలను తీసుకురావడంలో ప్రభుత్వం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపై చొరవ చూపి జిల్లాకు జరిగే నష్టాన్ని నివారించాలి. 



కృష్ణా జలాల  నిల్వ సామర్థ్యం  

ఆధారిత జిల్లా 

ప్రాజెక్టులు 


పీఏబీఆర్‌          11.10 టీఎంసీలు 

ఎంపీఆర్‌      5.17 టీఎంసీలు 

భైరవాన్‌తిప్ప   2.00 టీఎంసీలు 

పేరూరు డ్యామ్‌  1.70 టీఎంసీలు 

జీడిపల్లి          1.694 టీఎంసీలు 

చాగల్లు         1.52 టీఎంసీలు 

గొల్లపల్లి          1.61 టీఎంసీలు 

చెర్లోపల్లి          1.42 టీఎంసీలు 

మారాల          0.46 టీఎంసీలు 

సుబ్బరాయసాగర్‌ 0.42 టీఎంసీలు 

మొత్తం            27.10 టీఎంసీలు 

Updated Date - 2021-06-25T05:56:27+05:30 IST