ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఏంటి?

ABN , First Publish Date - 2021-10-07T06:17:59+05:30 IST

రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగానికి వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఏంటని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఏంటి?

మాజీ శాసనసభ్యుడు జితేంద్రగౌడు

గుంతకల్లు, అక్టోబరు 6: రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగానికి వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఏంటని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు ప్రశ్నించారు. బుధవారం ఉదయం జితేంద్రగౌడు టీడీపీ మండల నాయకులు నల్లదాసరిపల్లి గ్రామ పొలాలను సందర్శించారు. వేరుశనగ పొలాలను, వర్షానికి నానిన వేరుశనగ ఫలసాయాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ రంగులువేసి రైతు భరోసా కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించారని, కానీ వాటి ద్వారా రైతులకు ఇస్తున్న భరోసా శూన్యమన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు పంట పరిహారాలు, బీమా, రుణమాఫీలు, సబ్సిడీ విత్తనాలను, ఎరువులను, పరికరాలను ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం జగనదేనన్నారు. నిరుడు అధిక వర్షాలతోనూ, ఇప్పుడు వర్షాభావంతోనూ పంటలు చేతికిరాక రైతులు తల్లడిల్లుతుంటే కనీసం ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి పరామర్శించిన పాపానపోవడంలేదన్నారు. గ్రామాలకు వెళ్తే సబ్సిడీ ఎరువులు, పరికరాలు, పంట పరిహారాలు, బీమా విషయంగా నిలదీస్తారన్న భయంతో ఏ నాయకుడూ పల్లెలవైపు కన్నెత్తి చూడలేదన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే వైసీపీకి ఇది సిగ్గుచేటైన విషయమని ఎద్దేవాచేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాయల రామయ్య, కౌన్సిలరు పవనకుమార్‌ గౌడు, టీడీపీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి జీ వెంకటేశులు, నాయకులు పాల మల్లికార్జున, మహదేవ్‌, రామన్న చౌదరి, గ్రామీణ రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-07T06:17:59+05:30 IST