వైసీపీ నాయకుల కోసం రోడ్డు కుదింపు

ABN , First Publish Date - 2021-10-07T06:54:16+05:30 IST

వైసీపీ నాయకుల పట్టాల వేట కొనసాగుతూనే ఉంది.

వైసీపీ నాయకుల కోసం రోడ్డు కుదింపు
కరెంటు పోల్‌నూకలిపేసుకుని బేస్‌మెంటును నిర్మించిన దృశ్యం

పట్టలేని అక్రమాలు

వైసీపీ నాయకుల కోసం రోడ్డు కుదింపు

నిబంధనలకు పాతర వేసిన రెవెన్యూ శాఖ

అస్మదీయుల లబ్ధికి.. 

లబ్ధిదారులకు ఇక్కట్టు

అక్రమ బేస్‌మట్టాలను 

కూల్చిన మున్సిపల్‌ అధికారులు 

గుంతకల్లు, అక్టోబరు6: వైసీపీ నాయకుల పట్టాల వేట కొనసాగుతూనే ఉంది. వారి ఆనందం కోసం రెవెన్యూ అధికారులు నిబంధనలను తోసిరాజని, రోడ్లను కుదించి మరీ పట్టాలను పంచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక సెంటు స్థలం పట్టాను ఆనలైనలో జారీ చేస్తుండగా, వైసీపీ నాయకుల కోసం అడ్డదారుల్లో రెండు సెంట్ల స్థలాల అప్పగింతకు తెరతీశారు. వారు ఇళ్లు నిర్మించుకుంటే తమకు ఇబ్బందంటూ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవటంతో వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. వారు కూడా అధికార పార్టీ వైపే వత్తాసు పలుకుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక పట్టాదారులు వాపోతున్న సంఘటన గుంతకల్లులో జరిగింది. 


అక్రమ బేస్‌మట్టాల కూల్చివేత

 పట్టణంలోని ఇందిరానగర్‌లో 6వ లే-ఔట్‌లో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఖాళీగా ఉన్నాయంటూ అధికార పార్టీకి చెందిన కొందరు ఆక్రమించి ఆరు ప్లాట్లలో బేస్‌మెంట్లను నిర్మించుకున్నారు. అదే పార్టీకి చెందిన మరి కొందరు ఈ కబ్జాను ఓర్చుకోలేక మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు శుక్రవారం ఆరు బేస్‌మెంట్లను ఎక్స్‌కవేటరు సాయంతో కూల్చివేశారు. ఇటువంటి ఆక్రమణలు అనేకం ఈ ప్రాంతంలో ఉన్నాయి. లబ్ధిదారులకు హౌస్‌లోన ఇచ్చేలోపే ఖాళీగా ఉన్నా యంటూ ఆక్రమిస్తుండటంతో తలనొప్పులు వచ్చిపడుతు న్నాయి. ఈ ప్రాంతంలోని స్థలాలకు ఇటీవలి కాలంలో రేట్లు పెరిగిపోవడంతో ఎక్కడ ఖాళీలున్నాయా? అంటూ కబ్జాదారులు గాలిస్తున్నారు. ఖాళీ కనిపించిందా.. తహసీల్దారు రద్దు చేశారని నోటిమాటగా చెప్పేసి లాగేసుకుంటున్న వైనాలు అనేకం జరుగుతున్నాయి. లబ్ధిదారులు ఏమరుపాటుగా ఉన్నారంటే చాలు గతంలో నిర్మించిన పునాదులనూ తొలగించేసి పాగా వేసేస్తున్నారు. 



అక్రమాలకు రెవెన్యూ సాయం

అధికార పార్టీ నాయకుల అక్రమాలకు రెవెన్యూ శాఖ సాయమందిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ కాలనీలోని ఐదో నెంబరు లే-ఔట్‌లో చూపించిన 60 అడుగుల రోడ్డును కుదించి 40 అడుగుల రోడ్డు గా మార్చి ఆ రోడ్డు పొడవునా కొత్తగా ప్లాట్లను పుట్టించి వైసీపీ నాయకులపరం చేశారంటూ స్థానిక లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల కార్యక్ర మంలో భాగంగా అందరికీ ఇళ్లు పథకం కింద నివేశన స్థలాలను పంపిణీచేయడానికి ప్రభుత్వం కొత్తగా భూములను కొనలేక ఈ ప్రదేశంలోని ఖాళీ పట్టాలను రద్దు చేసింది. తర్వాత ఈ లే-ఔట్‌లోని రోడ్లను మార్పుచేసి ఒ క్కొక్కరికి ఒక సెంటు చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. కానీ దోనిముక్కల రోడ్డులోని ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పట్టాలను మాత్రం రద్దు చేయలేదు. ఈ పరిస్థితుల్లో వైసీపీకి చెందిన కొందరు ఉన్నట్టుండి 60 అడుగుల రోడ్డులో 20 అడుగుల స్థలాలలో తమకు పట్టాలున్నాయంటూ ప్రత్యక్షమయ్యారు. లే-ఔట్‌ పొడవునా 20 అడుగుల చొప్పున కొలతలు వేసి ఇళ్ల నిర్మాణాలను హుటాహుటిన ప్రారంభించారు. కొందరు కరెంటు పోళ్లను దాటుకుని ముందుకు వచ్చి ఇళ్లను నిర్మించుకుం టుండగా, ఓ ఘనుడు  ఏకంగా కరెంటు స్తంభాన్ని  కూడా కలిపేసుకుని బేస్‌మెంటును నిర్మించుకోవడం గమనా ర్హం. ఇంత జరుగుతున్నా అటు మున్సిపల్‌  అధికారులు గానీ, ఇటు రెవెన్యూ అధికారులుగానీ మారు  మాట్లాడటం లేదు. అంతవరకూ తమవి కార్నర్‌ ప్లాట్లని భావిస్తూ వచ్చిన లబ్ధిదారులు తమ ఇళ్ల పక్కన ఇతరులు ఇళ్లు కట్టుకుంటుండటంతో తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. రెవెన్యూ అధికారులను, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. కాగా ఈ పట్టాలకు రెవెన్యూ అధికారుల ద్వారా అధికారిక ఆమోదం పొందడానికి వైసీపీ నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. అందరూ అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతుండటంతో ఏంచేయాలో పాలుపోక న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నారు.



ఆఫ్‌లైన పట్టాలు ఎక్కడివి?

వైసీపీ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులందరికీ ఆనలైన ద్వారా ప్రింటెడ్‌ పట్టాలను జారీచేస్తోంది. అది కూడా ఒక సెంటు స్థలాన్ని మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వచ్చాక రహదారిని 60 అడుగుల నుంచి 40 అడుగులకు కుదించిన తర్వాత 5వ లే-ఔట్‌లో 20 ఇంటూ 40 అడుగుల కొలతలతో వైసీపీ నాయకులు ఇళ్ల పట్టాలను పుట్టించారు. అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆఫ్‌ లైన పట్టాలు ఎవరిచ్చారన్న విషయంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికుల నుంచి అభ్యంతరాలు తలెత్తుతున్న నేపథ్యంలో.. కావాలంటే మీ ఇంటికి ఓ రెండు అడుగులు వదలి కట్టుకుంటాం అంటూ రాయబారాలు ప్రారంభించారు. ఈ పట్టాల వ్యవహారమంతా తప్పుల తడకగా ఉన్నా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా వైసీపీ నాయకులకు వత్తాసు పలుతున్నారని, తమకు అన్యాయం చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా కొత్తగా వెలసిన పట్టాల విలువ దాదాపు రూ. 45 లక్షలకు పైచిలుకుగా ఉండటంతో ఈ అక్రమ ఎత్తుగడలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ పట్టాలను  ఒక్కొక్కటి రూ. 6 లక్షలకు అమ్ముకున్నట్టుగా తెలుస్తోంది. అదనంగా పుట్టుకువచ్చిన స్థలాలకు ఎవరు పట్టాలను జారీచేశారు? ఎప్పుడు జారీచేశారు? అన్న విషయాలను పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ఇదిలా ఉండగా ఈ కాలనీలో పేదలంటూ తీసుకున్న నివేశన స్థలాలలో వ్యాపార సముదాయాలను నిర్మించి వేలాది రూపాయల అద్దె నిర్ణయించి  బాడుగలకు ఇస్తుండటం ఇక్కడ కనిపిస్తోంది. ఈ అక్రమ భూకబ్జాలకు ఎన్నడు ఫుల్‌స్టాప్‌ పడుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. 



Updated Date - 2021-10-07T06:54:16+05:30 IST