కేజీబీవీ సీట్లకు సిఫార్సులు
ABN , First Publish Date - 2021-10-29T06:07:33+05:30 IST
జిల్లావ్యాప్తంగా కేజీబీవీల్లో మిగిలిపోయిన సీట్లకు రాజకీయ సిఫార్సులు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం.
తలలు పట్టుకుంటున్న అధికారులు
అనంతపురం విద్య, అక్టోబరు 28 : జిల్లావ్యాప్తంగా కేజీబీవీల్లో మిగిలిపోయిన సీట్లకు రాజకీయ సిఫార్సులు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం. ఇది కేజీబీవీల ప్రత్యేకాధికారులు, సమగ్రశిక్ష ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. గతంలో రాష్ట్ర స్థాయిలోనే సీట్ల కేటాయింపు జరిగేది. తాజాగా జిల్లాస్థాయి కమిటీ ఆధ్వర్యంలోనే సీట్ల కేటాయింపు చేయాలంటూ ఆదేశాలిచ్చారు. జిల్లావ్యాప్తంగా 476 సీట్లకు 1179 దరఖాస్తులు రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలతో కూడిన దరఖాస్తులు రావడం వారికి తలనొప్పిగా మారింది.
సిఫార్సులే సిఫార్సులు...
జిల్లావ్యాప్తంగా 62 కేజీబీవీలున్నాయి. వీటి పరిధిలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ బోధన అందిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్రస్థాయి నుంచి సీట్లు కేటాయించేవారు. ఇప్పటి వరకూ 7 విడతలుగా కేటాయించారు. అయినప్పటికీ 6, 7, 8 తరగతులు, ఇంటర్‌లో 476 సీట్లు మిగిలాయి. సీట్లు కావాలంటూ నిత్యం కేజీబీవీలు, సమగ్రశిక్ష ప్రాజెక్టు కార్యాలయం చుట్టూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తిరిగిపోతున్నారు. సీట్ల కేటాయింపు తమ చేతుల్లో లేదంటూ ప్రాజెక్టు అధికారులు చెప్పి, పంపుతున్నారు. గతంలో రాష్ట్రస్థాయిలో సీట్ల కేటాయింపు చేస్తుండగా.. తాజాగా జిల్లాలకు అప్పగించారు. జిల్లాస్థాయి కమిటీ ఆధ్వర్యంలో సీట్లు కేటాయించాల్సి ఉంది. ఆ మేరకు అనుమతి పొందేందుకు కలెక్టర్‌కు ఫైల్ పెట్టారు. ఇప్పటికే చాలా కేజీబీవీల్లో విద్యార్థినులు చేరి, తరగతులు వింటున్నారు. మిగిలిన సీట్ల కోసం విద్యార్థులు క్యూ కడుతున్నారు. పైగా వారంతా ఆయా తరగతులు మిస్ అయినట్టే. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే నిర్ణయం తీసుకుని, సీట్ల భర్తీకి అవకాశమివ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
అర్హులకే సీట్లు: తిలక్ విద్యాసాగర్, ఏపీసీ
కేజీబీవీల్లో మిగిలిపోయిన సీట్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. సీట్ల భర్తీ ప్రక్రియ అనుమతి కోరుతూ కలెక్టర్‌కు ఫైల్ పెట్టాం. అనుమతి రాగానే జేసీ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో సీట్లు కేటాయిస్తాం. పెండింగ్ సీట్ల కంటే రెట్టింపు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. అర్హులకు కేటాయిస్తాం.