వాన జోరు..

ABN , First Publish Date - 2021-11-21T07:02:04+05:30 IST

జిల్లాలో వాన జోరు తగ్గట్లేదు. పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

వాన జోరు..
తలుపుల మండలంలో వర్షానికి దెబ్బతిన్న వరి పంటను చూపుతున్న రైతులు

జిల్లాలో భారీ వర్షం.. పెరిగిన పంట నష్టం

అనంతపురం వ్యవసాయం, నవంబరు 20: జిల్లాలో వాన జోరు తగ్గట్లేదు. పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వంకలు, వాగులు పోటెత్తాయి. నదులు ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తున్నాయి. పంటలు నీట మునిగి, అన్నదాతకు పెను నష్టం వాటిల్లింది. జనావాసాల్లోకి నీరు చేరింది. పలుచోట్ల ఇల్లు నేలకూలాయి. పాపాఘ్ని, పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిత్రావతి కాస్త శాంతించినా.. ఇంకా ముప్పు తొలగలేదు. చెరువులు నిండిపోయి, ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతపురం సమీపంలోని బుక్కరాయసముద్రం చెరువు పూర్తిగా నిండిపోయి, మరువపై నుంచి నీరు పెద్దఎత్తున ప్రవహిస్తోంది. దీంతో బుక్కరాయసముద్రంలో వాహన రాకపోకలు ఆపేశారు. నదులు, వంకలు దాటకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్‌ దెబ్బతినడంతో పలు రైళ్లు రద్దు చేశారు.


వర్షపాతం నమోదు ఇలా..

జిల్లాలో అత్యధికంగా బొమ్మనహాళ్‌లో 61.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కణేకల్లు 44.0, కళ్యాణదుర్గం 38.6, గుమ్మఘట్ట 33.2, శెట్టూరు 33.0, బ్రహ్మసముద్రం 31.4, కంబదూరు 29.6, రొళ్ల 29.2, ఉరవకొండ, అమరాపురం 28.6, ఆత్మకూరు, రాయదుర్గం 27.8, విడపనకల్లు 26.2, కనగానపల్లి, బెలుగుప్ప, హిందూపురం 24.8, పామిడి 24.4, డీ.హిరేహాళ్‌ 24.0, తాడిమర్రి 23.8, కుందుర్పి 22.2, వజ్రకరూరు 22.0, గుడిబండ 20.4, మడకశిర 20.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 19.4 మిల్లీమీటర్లలోపు వాన కురిసింది. శనివారం అనంతపురం, ఉరవకొండ, రాప్తాడు, గార్లదిన్నె, పుట్లూరు, శెట్టూరు, తాడిపత్రి, తలుపుల తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం పడింది. కళ్యాణదుర్గం, శింగనమల, విడపనకల్లు, కుందుర్పి, అగళి, వజ్రకరూరు, చిలమత్తూరు, ముదిగుబ్బ, బెలుగుప్ప తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఈనెల జిల్లా సరాసరి సాధారణ వర్షపాతం 34.7 మి.మీ.. కాగా.. ఇప్పటిదాకా 175.1 మి.మీ., నమోదైంది.


పెరిగిన పంటనష్టం

జిల్లాలో భారీ వర్షాలకు పంటనష్టం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 55 మండలాల్లో 87,228 ఎకరాల్లో రూ.130.98 కోట్ల విలువైన పప్పుశనగ, వరి, వేరుశనగ, మొక్కజొన్న, పత్తి, కంది, ప్రొద్దుతిరుగుడు తదితర పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. అలాగే 287 ఎకరాల్లో రూ.3.13 కోట్ల విలువైన అరటి, మామిడి, చీనీ, మిరప, ఉల్లి, బొప్పాయి, టమోటా, కర్బూజ తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయిలో పంటనష్టంపై వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది సర్వే కొనసాగిస్తున్నారు. పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

Updated Date - 2021-11-21T07:02:04+05:30 IST