ఊజీగూళ్లకు రీలర్లు చెప్పిందే ధరా..?

ABN , First Publish Date - 2021-10-29T05:39:09+05:30 IST

ఊజీ గూళ్లుకు రీలర్లు ఇష్టానుసారం ఽధర తగ్గిస్తున్నా మార్కెట్‌ అధికారులు స్పందించలేదంటూ పట్టురైతులు మార్కెట్‌ వద్ద నిరసన చేపట్టారు.

ఊజీగూళ్లకు రీలర్లు చెప్పిందే ధరా..?

అధికారులు ఎందుకు స్పందించడంలేదు

మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు ఏవీ..? 

మొబైల్‌ ఫోన్లు, నగదు చోరీ జరుగుతున్నా భద్రతా చర్యలు శూన్యం

పట్టుగూళ్లకు గిట్టుబాటు వచ్చేలా చర్యలు తీసుకోవాలి

నిరసనలో పట్టు రైతులు


హిందూపురం, అక్టోబరు 28: ఊజీ గూళ్లుకు రీలర్లు ఇష్టానుసారం ఽధర తగ్గిస్తున్నా మార్కెట్‌ అధికారులు స్పందించలేదంటూ పట్టురైతులు మార్కెట్‌ వద్ద నిరసన చేపట్టారు. గురువారం హిందూపురం పట్టగూళ్ల మార్కెట్‌లో ఊజీ పట్టుగూళ్ల ధరలు తగ్గడంతోపాటు మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇటీవల మార్కెట్‌లో ఊజీ గూళ్లకు ధర ఇవ్వకపోడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. అదేవిధంగా మార్కెట్‌లో మొబైల్‌ ఫోన్లు, నగదు చోరీకి గురవుతున్నాయన్నారు. ఈ విషయంపై పలుమార్లు మార్కెట్‌ అధికారులకు విన్నవించినా భద్రతా చర్యలు చేపట్టలేదన్నారు. రైతు సేవలో మార్కెట్‌ అంటూ ప్రభుత్వం చెబుతున్నా కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. పట్టుగూళ్లను వదిలిపెట్టి వెళ్లలేక రోజంతా ఇబ్బందులు పడుతున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు వచ్చే మార్కెట్‌లో సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పట్టుగూళ్లకు గిట్టుబాటు ధర వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతుల నిరసనతో పట్టుగూళ్ల విక్రయాలు నిలిచిపోయాయి. మార్కెట్‌ అధికారులు రైతులతో చర్చలు జరపడంతో వారు నిరసన విరమించారు. అనంతరం పట్టుగూళ్ల కొనుగోళ్లు జరిగాయి. రైతుల ఆందోళనపై హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌ అధికారి రామ్మోహన మాట్లాడుతూ ఊజీ గూళ్ల ధరలు మార్కెట్‌లో ఏ రోజు ఆ రోజుపై ఆధారంపడి ఉంటుందన్నారు. విద్యుత సర్య్కూట్‌ వల్ల మార్కెట్‌లో సీసీ కె మెరాలు పనిచేయడంలేదన్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తున్నామన్నారు. కాగా మార్కెట్‌కు 5.4 టన్నుల పట్టగూళ్లు రాగా బైవోల్టీన రకం కనిష్టంగా కిలో రూ. 326, గరిష్టంగా రూ. 509, సగటున రూ. 451 చొప్పున ధర పలికాయి.

Updated Date - 2021-10-29T05:39:09+05:30 IST