ఉల్లి ధరలు పతనం
ABN , First Publish Date - 2021-03-22T05:25:11+05:30 IST
కష్టాన్ని నమ్ముకుని రైతులు ఉల్లిపంటను సాగుచేయగా ఒక్కసారిగా ధరల పతనంతో ఉల్లి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

-భారీగా సాగు చేసిన సానిపల్లి రైతులు
-పంట చేతికందే సమయానికి తగ్గిన ధర
రొద్దం, మార్చి 21: కష్టాన్ని నమ్ముకుని రైతులు ఉల్లిపంటను సాగుచేయగా ఒక్కసారిగా ధరల పతనంతో ఉల్లి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రొద్దం మండలం సానిపల్లికి చెందిన అనేక మంది రైతులు 60ఎకరాల్లో ఉల్లిపంట సాగుచేశారు. ఐదు నెలల క్రితం ఉల్లి ధరలు రూ.50నుంచి 60 ధర పలికాయి. ఉల్లి ధరలపై ఆశలు పెంచుకున్న సానిపల్లి రైతులు అధిక సంఖ్యలో పంటలు సాగుచేశారు. అయితే ఉల్లి ధరలు కిలో రూ.11కి పడిపోవడంతో రైతులు కుదేలయ్యారు. ఒక్కో రైతు ఎకరం పంటకు పెట్టుబడి రూ.70వేలు పెట్టి పంటను సాగుచేశారు. అయితే పంట ఆశాజనకంగా ఉండి ఎకరానికి 150 బస్తాలు ఉల్లి దిగుబడి వచ్చింది. ధరల పతనంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. కిలో ఉల్లి ధర రూ.11అమ్ముడుపోతే పెట్టుబడులు మాత్రమే చేతికొస్తాయని ఉల్లి రైతులు వాపోతున్నారు. ఒక్కసానిపల్లి గ్రామానికి మాత్రమే పండించిన పంటకు ఈ యేడాది ఆదాయం రూ.కోటి రావాల్సి ఉండగా నష్టాన్ని చెవిచూశారు. ఉల్లి ధరలు అమాంతం పడిపోవడంతో ఉల్లిపంటనే నమ్ముకున్న రైతాంగం ఉల్లిని అమ్మలేక డబ్బులు చేతికి రాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవాలని గ్రామస్థులు వాపోతున్నారు.