మరమగ్గాలపై ఎనఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు
ABN , First Publish Date - 2021-10-29T05:39:59+05:30 IST
మరమగ్గాల ఉత్పత్తులపై చేనేత జౌళిశాఖ ఎనఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం దాడులు చేశారు.
హిందూపురం, అక్టోబరు 28: మరమగ్గాల ఉత్పత్తులపై చేనేత జౌళిశాఖ ఎనఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం దాడులు చేశారు. చేనేతలకు అండగా కేంద్ర ప్రభుత్వం 11 రకాల ఉత్పత్తులను చేతి మగ్గాల ద్వారానే రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. రిజర్వు చేసిన ఉత్పత్తులను మరమగ్గాల యజమానులు ఉల్లంఘిస్తున్నారన్న ఫిర్యాదులతో చెన్త్నె తిరుపతి చేనేత జౌళిశాఖ ఎనఫోర్స్‌మెంట్ అధికారుల బృందాలు హిందూపురంలో ముద్దిరెడ్డిపల్లి, వీవర్స్ కాలనీ, లేపాక్షిలోని మరమగ్గాలపై ఉత్పత్తులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి చేనేత జౌళిశాఖ డిప్యూటీ డెరెక్టర్ భీమయ్య మాట్లాడుతూ సాధారణంగా జరిగే తనిఖీలు అని అన్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేనేతలకు రిజర్వు చేసిన ఉత్పత్తులకు సంబంధించి మరమగ్గాల యజమానులు ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారా..? అన్న విషయంపై తనిఖీ చేశామన్నారు. పవర్‌లూమ్స్‌పై ఉత్పత్తుల్లో నియమనిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడికాలేదన్నారు. చెన్నెయ్ రీజనల్, తిరుపతి చేనేత జౌళిశాఖ ఎనఫోర్స్‌మెంట్ నాలుగు బృందాలతో మూడు రోజులుగా తనిఖీ చేపడుతున్నట్లు చెప్పారు. దాడుల్లో చెన్నై రీజనల్ ఎనఫోర్స్‌మెంట్ అధికారి మనోహర్, తిరుపతి ఏడీ ఎనఫోర్స్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. దాడుల విషయం తెలుసుకున్న కొందరు మరమగ్గాల యూనిట్ల నిర్వాహకులు ఇళ్లకు తాళం వేయడంతో అధికారులు వెనుదిరాగాల్సివచ్చింది.