పెరిగిన ఓటర్లు
ABN , First Publish Date - 2021-02-01T06:33:58+05:30 IST
త్వరలో జరగబోతున్న పంచాయతీ ఎన్నికల్లో మండ ల వ్యాప్తంగా 4364 ఓటర్లు పెరిగారు.

చిలమత్తూరు, జనవరి 31: త్వరలో జరగబోతున్న పంచాయతీ ఎన్నికల్లో మండ ల వ్యాప్తంగా 4364 ఓటర్లు పెరిగారు. 2014లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని 11 పంచాయతీలకు 36694 మంది ఓటర్లు ఉండగా, ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు 41058 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్దంగా ఉన్నారు. దానికి తోడు కోడూరు పంచాయతీలో ఇంత వరకు కలిసి ఉన్న దిగువపల్లి తండాని ఎస్టీ ప్రత్యేక పంచాయతీగా ప్రభుత్వం ప్రకటించడంతో మండలంలో పంచాయతీల సంఖ్య 12కి చేరింది. ఈ తండాలో 433 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా చిలమత్తూరు పంచాయతీలో గరిష్టంగా 2071 మంది కొత్తగా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా కోడూరు పంచాయతీలో 335 మంది పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
అతివలకే అగ్రస్థానం
పెనుకొండ రూరల్, జనవరి 31: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. మండలంలో సగానికి సగం మహిళలకే ఎక్కువగా రిజర్వేషన్లు కల్పించారు. మండల వ్యాప్తంగా 11 పంచాయతీల్లో నాలుగో విడతలో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. అందులో అడదాకులపల్లి, దుద్దేబండ, వెంకటగిరిపాళ్యం, సర్పంచ్ స్థానాలకు (జనర్ మహిళ), శెట్టిపల్లి (ఎస్టీ మహిళ), నాగలూరు (ఎస్టీ మహిళ), గుట్టూరు (బీసీ మహిళ)గా రిజర్వేషన్లు కేటాయించారు. మిగిలిన గోనిపేట, మావటూరు, రాంపురం, వెంకటగిరిపాళ్యం సర్పంచ్ స్థానాలకు జనరల్ కేటగిరి కేటాయించారు. అందులో అడదాకులపల్లి పంచాయతీలో సర్పంచ్ స్థానానికి జనరల్ మహిళ కేటాయించారు. ఈ పంచాయతీలో 1419మంది ఓటర్లుండగా మహిళలు 738మంది, పురుషులు 681 ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లే ఎక్కువ శాతం ఉండటంతో పంచాయతీలో మహిళలే కీలకంగా మారనున్నారు. గత 2013 సంవత్సరంలో అడదాకులపల్లి పంచాయతీకి జనరల్ మహిళ కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు దండు మమత సర్పంచ్‌స్థానాకి పోటీచేసి వైసీపీ మద్దతుదారులైన జయమ్మపై 113 ఓట్లతో గెలుపొందారు. పంచాయతీలో టీడీపీ, వైసీపీ తమ మద్దతుదారులను సర్పంచ్ స్థానం కైవశం చేసుకునేందుకు నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీలో మహిళల ఓట్లు ఎక్కువశాతం ఎవరు ఆకట్టుకుంటారనే కోణంలో ఇరుపార్టీల నాయకులు బరిలో నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
రిజర్వేషన్ వర్గాలకే అధికారం
హిందూపురం, జనవరి 31: హిం దూపురం నియోజక వర్గంలో ఆదాయ వనరులున్నా మేజర్ పంచాయతీలన్నీ రిజర్వేషన్ వర్గాలకే అధికారం దక్కానున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపుగుర్రాలను బరిలో నిలిపేందుకు ప్రధాన పార్టీలు తమ మద్దతుదారుల అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. హిందూపురం మండలం పారిశ్రామిక వాడ అనుసంధానంగా ఉన్నా కిరెకెర (ఎస్సీ మహిళ), తూమకుంట(బీసీ మహిళ) అలాగే మండల కేంద్రాలైన మేజర్ పంచాయతీలు లేపాక్షి (ఎస్సీ జనరల్), చిలమత్తూరు (ఎస్సీ మహిళ), గ్రానైట్ పరిశ్రమల హబ్‌గా ఉన్నా కోడూరు (బీసీ జనరల్)గా కేటాయించారు. ఈ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు పోటీచేసేందుకు ఆశావాహులు సంఖ్య అధికంగా ముందుకు వస్తున్నా ప్రధాన పార్టీలు ఆర్థిక బలమున్న మద్ధతుదారుల కోసం అన్వేషణ చేస్తున్నాయి. ఈ పంచాయతీల్లో ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో పోటీ చేసే అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అధిక మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక అంశం కష్టతరంగా మారింది.
పల్లెల్లో ‘రాజకీయ’ వేడి
హిందూపురం టౌన్, జనవరి 31: పల్లెల్లో స్థానిక సంస్థల వేడి రోజు రోజుకు అధికమవు తోంది. ప్రధానంగా టీడీపీ, వైసీపీ పార్టీలు మద్ధతుదారుల కోసం గ్రామాల్లో ఆయా పార్టీ ముఖ్య నాయకులు వేట సాగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో మంచి పేరుతోపాటు ఆర్థికంగా బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపాలని అధిష్టానం నుంచి స్థానిక నాయకులకు ఆదేశాలు అందడంతో ఆయా పార్టీల ముఖ్య నాయకులు తమ మద్దతుదారులను రంగంలోకి దింపేందుకు జల్లెడ పడుతున్నారు. దీంతోపాటు పంచాయతీలకు వచ్చిన రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులను గుర్తించే పనుల్లో నిమగ్నమయ్యారు. జనరల్‌తో పాటు రిజర్వేషన్ స్థానాల్లో కూడా అభ్యర్థులు పోటీల్లో నిలిచేందుకు సై అంటున్నారు. ప్రధాన పార్టీలతోపాటు బీజేపీ, జనసేన కూడా ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకునాలన్న ఉద్దేశ్యంతో కొన్నిచోట్ల బరిలోకి దింపేందుకు సిద్దమవుతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో నాలుగో విడతలో ఎన్నికలు జరుగనుండగా ఇప్పటి నుండే అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో 38పంచాయతీలుండగా వీటిలో ప్రధానంగా ఆదాయాన్ని సమకూర్చే పంచాయతీల సర్పంచ్ స్థానాలను తమ పార్టీ మద్దతుదారులను ఎలాగైనా గెలిపించుకోవాలని సన్నద్దం అవుతున్నారు. ఒకటి రెండు చోట్ల అధిక సంఖ్యలో ఆశావహులున్నా మరికొన్నిచోట్ల బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గంలో గతం నుంచి తెలుగుదేశం పార్టీకే సర్పంచ్ స్థానాల్లో కూడా ఆ పార్టీ మద్దతుదారులే అధిక సంఖ్యలో గెలుస్తూ వస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి మరిన్ని సర్పంచ్ స్థానాలను టీడీపీ మద్దతుదారులు గెలిపించుకునేందుకు సిద్దం అవుతున్నారు.
‘స్థానిక’ సమరానికి సై
మడకశిర, జనవరి 31: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో పంచాయతీ ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలతోపాటు మిగతా పార్టీల వారు కూడా సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయా పార్టీల నాయకులు కసరత్తు ప్రారంభించారు. పలుచోట్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాగా మరికొన్ని చోట్ల పోటీ నెలకొంది. నియోజకవర్గంలో 66 పంచాయతీలు ఉన్నాయి. అందులో అమరాపురం 11 పంచాయతీలు, రొళ్ల 10 పంచాయతీలు, అగళి 13 పంచాయతీలు, గుడిబండ 16 పంచాయతీలు, మడకశిర 16 పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు అధికంగా ఉండటంతో నాయకులు సైతం స్థానికంగా సమావేశమై అభ్యర్థుల్లో ఏకాభిప్రాయం వచ్చేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మద్దతుదారుల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. దీంతోపాటు కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులు సైతం పోటీలో ఉండనున్నారు. అదేవిధంగా పలుచోట్ల పార్టీ మద్దతు లభించకపోయినా తాముసైతం పోటీలో ఉంటామని ఇప్పటికే పలువురు బాహాటంగానే చెబుతున్నారు. ప్రధానంగా పార్టీ కోసం కష్టపడిన వారికి, గెలిచే అభ్యర్థులకు తాము మద్దతు ఇస్తే గెలుపు సునాయాసం అవుతుందని ఆయా పార్టీల నాయకులు భావిస్తూ ప్రణాళికలు రూపొందించుకొంటున్నారు. ఇప్పటికే ఆశావాహులు పార్టీల మద్దతు కోసం అధినాయకత్వం ముందు తమ ప్రతిపాదనలు ఉంచుతున్నారు. తాము పార్టీ కోసం కష్టపడ్డామని, తప్పక అవకాశం ఇస్తే గెలిచి వస్తామని అంటున్నారు. ఆయా పార్టీల నాయకులు సైతం గెలుపు అభ్యర్థులనే రంగంలోకి దింపాలని అన్వేషిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం ఆయా పంచాయతీల్లోని నాయకులు ఎవరికి మద్దతు ఇస్తే తాము విజయం సాధించవచ్చనే దానిపై కసరత్తు చేస్తున్నారు.