భర్త హత్య కేసు ఛేదింపు

ABN , First Publish Date - 2021-10-27T06:21:47+05:30 IST

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన కేసును గోరంట్ల పోలీసులు ఛేదించారు.

భర్త హత్య కేసు ఛేదింపు


 భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్‌

గోరంట్ల, అక్టోబరు 26: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను  హతమార్చిన కేసును గోరంట్ల పోలీసులు ఛేదించారు. చిలమత్తూరు మండలం శెట్టిపల్లికి చెందిన షేక్‌ మహ్మద్‌ రఫీక్‌(25)ని హత్యచేసిన కేసులో అతడి భార్య షబీనా, ఆమె ప్రియుడు వలంటీర్‌ శివకుమార్‌ను మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు సీఐ జయనాయక్‌ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్‌ మహ్మద్‌ రఫీక్‌ భార్య షబీనాకు అదే గ్రామానికి చెందిన వలంటీరు శివకుమార్‌తో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం భర్త, బంధువులకు  తెలియడంతో వారు ఆమెను మందలించారు. ప్రియుడు శివకుమార్‌ను గ్రామం వదిలేలా చర్యలు చేపట్టారు. దీంతో భర్త అడ్డు తొలగించాలని షబీనా, శివకుమార్‌ పన్నాగం పన్నారు. అందులో భాగంగా ఈనెల 19న రాత్రి 9 గంటల సమయంలో  ఇద్దరూ కలిసి భర్తను ఇంట్లోనే బండరాళ్లతో హతమార్చారు. అనంతరం రఫీక్‌ మృతదేహాన్ని అతడి ద్విచక్రవాహనంలోనే కోడూరు-పుట్టపర్తి రహదారిలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో పాపిరెడ్డిపల్లి వద్ద పొలాల్లోని రైతులు టార్చ్‌ వెలిగిస్తూ రావడంతో రోడ్డుపైనే మృతదేహాన్ని, ద్విచక్రవాహనాన్ని వదిలేసి పారిపోయారు. ఘటనాస్థలంలో ఆనవాళ్లను మాయంచేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈక్రమంలో గోరంట్ల మండలంలోని తమ్మినాయనపల్లి వద్ద నిందితులు షబీనా, శివకుమార్‌ను మంగళవారం మధ్యాహ్నం అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. హత్యకు సంబంధించిన దుస్తులు, బండరాళ్లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

Updated Date - 2021-10-27T06:21:47+05:30 IST