అస్తవ్యస్తం
ABN , First Publish Date - 2021-07-24T06:07:07+05:30 IST
జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న అనంతపురం సర్వజనాస్పత్రిలో అస్తవ్యస్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమయపాలన పాటించడం లేదు. కరోనాతో బయోమెట్రిక్ హాజరుకు స్వస్తి పలికారు. ఇది ఇష్టారాజ్యానికి దారితీస్తోంది.

అందని సీనియర్ల సేవలు
రోగులకు జూనియర్లే దిక్కు
పారామెడికల్ సిబ్బంది ఇష్టానుసారం
సామాన్య ప్రజలకు తప్పని ఇబ్బందులు
చోద్యంచూస్తున్న పర్యవేక్షణాధికారులు
అనంతపురం వైద్యం, జూలై 23: జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న అనంతపురం సర్వజనాస్పత్రిలో అస్తవ్యస్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమయపాలన పాటించడం లేదు. కరోనాతో బయోమెట్రిక్ హాజరుకు స్వస్తి పలికారు. ఇది ఇష్టారాజ్యానికి దారితీస్తోంది. సీనియర్ వైద్యులు ఆస్పత్రిలో కనిపించడం లేదు. జూనియర్ వైద్యులే రోగులకు దిక్కుగా మారిపోయారు. దీంతో పెద్ద డాక్టర్లు ఉంటారనీ, నాణ్యమైన వైద్యం అందుతుందని ఆస్పత్రికి వస్తున్న రోగులకు నిరాశే మిగులుతోంది. ఓపీలకు సీనియర్ వైద్యులు డుమ్మా కొడుతుండటంతో ఈ పరిస్థితి దాపురిస్తోంది. ఈ ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. దీనిని అరికట్టడానికి బయోమెట్రిక్‌తోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో పరిస్థితిలో కొంత మార్పు కనిపించింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు మినహాయించడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆస్పత్రిలో 23 ఓపీ విభాగాలున్నాయి. వాటికి అధికభాగం వైద్యులు ఆలస్యంగా వస్తున్నారు. మెరుపు తీగల్లా కనిపించి, తిరిగి వెళ్లిపోతున్నాడు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ సేవలు అందాలి. జనం రద్దీ పెరగడంతో ఈ సమయం ఒంటి గంటకు పెంచారు. అయినా ఏ విభాగంలోనూ సమయం మేరకు ఓపీలు సాగడం లేదు. సీనియర్ వైద్యులు దగ్గరరుండి జూనియర్స్తో రోగులకు సేవలు అందేలా చూడాలి. సీనియర్స్ ఓపీలలో ఉండకుండా జూనియర్స్‌పై వదిలి వెళ్లిపోతున్నారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రులు, సొంత క్లినిక్‌లకు వెళ్లి, అక్కడ డబ్బులకు వైద్యం అందిస్తూ జేబులు నింపుకుంటున్నారు. మరి కొందరు ఆస్పత్రిలో ఉన్నా.. కాఫీ బార్కే పరిమితమవుతున్నారు. అక్కడే గంటలకొద్దీ కూర్చుని, బాతాకహానీలు కొట్టి వెళ్లిపోతున్నారు. ఇక పారామెడికల్ సిబ్బంది పరిస్థితి దారుణంగా మారింది. ల్యాబ్‌లకు ఉదయం 8 గంటలకే సిబ్బంది హాజరు కావాలి. బయోమెట్రిక్ లేకపోవడంతో ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి, వెళ్లిపోతున్నారు. దీంతో సర్వజనాస్పత్రిలో పేదరోగులకు వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. దీనంతటికీ ఇనచార్జ్ సూపరింటెండ్ వ్యవస్థే కారణమన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. అందరూ సీనియర్లు ఉండటం, ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేయడం కారణంగా ఇనచార్జ్ సూపరింటెండెంట్లు వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతకాలం ఈ బాధ్యతల్లో ఉంటామోనన్న విషయం ఇనచార్జ్‌లకు తెలియడం లేదు. అందుకే వారు కూడా ఉన్నంతకాలం బాధ్యత నెరవేర్చుకుంటూ పోతున్నారు. ఆర్‌ఎంఓలు ఉన్నా.. వారు కూడా డ్యూటీలు వేయడానికే పరిమితమవుతున్నారన్న విమర్శలుఉన్నాయి. ఇది సామాన్య రోగులకు ఇబ్బందిగా మారింది. అన్ని వసతులు ఉన్నా మెరుగైన వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, వైద్యులు, సిబ్బందిని గాడిలో పెట్టి ప్రజలకు వైద్యసేవలు అందేలా చూడాల్సిన అవసరం ఉంది.