వైభవంగా గోపుర కుంభాభిషేకం, ప్రాణప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-06-21T06:26:34+05:30 IST

మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో నీలకంఠేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధారణ, నూతన దేవాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు రెండోరోజు ఆదివారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా గోపుర కుంభాభిషేకం, ప్రాణప్రతిష్ఠ
శ్రీసప్తమునీశ్వర హోమం కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరారెడ్డి, గ్రామస్థులు

మడకశిర, జూన్‌ 20: మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో నీలకంఠేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధారణ, నూతన దేవాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు రెండోరోజు ఆదివారం వైభవంగా నిర్వహించారు. మునేశ్వరస్వామి ఆలయంలో గోపుర కుంబాభిషేకం, ప్రాణ ప్రతిష్ఠ గావించారు. ఉదయం మునీశ్వర, ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయాల్లో శ్రీవిశ్వక్షేన మహాగణపతి పూజ, పుణ్యాహ వాచనం, ద్వారారాధన, కుంభోప కుంబారాధన, శ్రీపంచముఖ ఆంజనేయస్వామి మూలమంత్ర, శ్రీసప్త మునీశ్వర, ప్రాణ ప్రతిష్ఠాంగ హోమాలు, మహా పూర్ణాహుతి చేశారు. ఉదయం 10.51 గంటల నుంచి శ్రీ మునేశ్వరస్వామి ఆలయంలో గోపుర కుంబాభిషేకం, ప్రాణ ప్రతిష్ఠ, ఉదయం 11.15 నుంచి శ్రీపంచముఖ ఆంజనేయస్వామికి కుంభాభిషేకం, శ్రీప్రసన్న ఆంజనేయస్వామి ప్రాణప్రతిష్ఠ, నేత్రోన్మిలనము, పంచామృతాభిషేకం, అలంకారం, మహా మంగళ హారతి, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొని, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.


నేటి పూజాకార్యక్రమాలు

సోమవారం ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం 9.30 గంటలకు నూతన ఉత్సవ విగ్రహాలు, కళశముల గ్రామోత్సవం, 10 గంటలకు యాగశాల నిర్మాణ పూజలు, సాయంత్రం 5.30 నుంచి మంగళ ద్రవ్యములతో యాగశాల ప్రవేశం, జ్యోతి ప్రజ్వలన, సభాప్రార్థన, మహాగణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, ఆచార్యరుత్విక వర్ణము, వేదపారాయణం, రాత్రి 7 గంటల నుంచి నీలకంఠేశ్వరస్వా మి ఆలయంలో నూతనంగా నిర్మించిన యాగశాలలో గణపతి హో మం, అంకురార్పణంగా హోమం, యాగశాల ప్రారంభోత్సవం, జలాధివాసం, కళశాధివాసం, రాత్రి 8.30 గంటలకు మహామంగళ హారతి, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


Updated Date - 2021-06-21T06:26:34+05:30 IST