వరద పోటు... వంతెనలపై వేటు

ABN , First Publish Date - 2021-11-29T05:22:15+05:30 IST

వరద నీటి ప్రవాహంతో నదులపై నిర్మించిన వంతెనలు ధ్వంసం కావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వరద పోటు... వంతెనలపై వేటు
కొడికొండ వద్ద ధ్వంసమైన చిత్రావతి నది వంతెన

-భారీగా ధ్వంసమైన వంతెనలు

 -స్తంభించిన గ్రామీణ రవాణా వ్యవస్థ

 -ఇసుక త్రవ్వకాలతోనే బ్రిడ్జిలకు ప్రమాదం

చిలమత్తూరు, నవంబరు 28: వరద నీటి ప్రవాహంతో నదులపై నిర్మించిన వంతెనలు ధ్వంసం కావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షం, ఎగువన కర్ణాటకలో వచ్చిన వరద భీభత్సంతో ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా మండలంలో ఉన్న చిత్రావతి, కుషావతి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో పలు చోట్ల రవాణా వ్యవస్థ పూర్తీగా దెబ్బతింది. గ్రామీణ ప్రజ లు బయట ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొడికొండ వద్ద చిత్రావతి నదిపై నిర్మించిన వంతెన తెగిపోయింది. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయాలు కలుగుతున్నాయి. ఇప్పటికీ కొడికొండ, సోమఘట్ట, పలగలపల్లి, చాగలేరు. మొరసలపల్లి గ్రామాలకు వెళ్లాలంటే వీలులేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కోడూరు వద్ద కుషావతి నదిపై నిర్మించిన వంతెన నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ కారణంగా కోడూరు, మధురేపల్లి, కోట్లోపల్లి, చిన్నప్పరెడ్డిపల్లి గ్రామాస్థులకు రాకపోకలు స్తంభించాయి. సుబ్బరావుపేట వద్ద ఉన్న చిత్రావతి నదిపై నిర్మించిన కాజ్‌వే నిర్మాణం పూర్తీగా కోతకు గురైంది. ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని విధంగా మారింది. శెట్టిపల్లి వద్ద చిత్రావతి, కుషావతి నదులు రెండు కలిసి ముందుకు కదులుతాయి. అయితే అక్కడ వరదనీటి ప్రవాహం ఊహించని విధంగా రావడంతో అక్కడ ఏర్పాటుచేసిన కాజ్‌వే మొత్తం కోతకు గురైంది. ఈ కాజ్‌వే ద్వారా పక్కనే ఉన్న మోతుకపల్లి, పోతులప్పపల్లి, పెద్దిరెడ్డిపల్లి, చాగలేరు, శానగానపల్లి గ్రామాల ప్రజలు శెట్టిపల్లికి సునాయాసంగా వచ్చివెళ్లేవారు. అయితే ఇప్పుడది కోతకు గురవడంతో పది రోజులుగా ఆ గ్రామాల నుంచి రాకపోకలు బంద్‌ అయ్యాయి. ఈ రెండు నదుల సమీప  గ్రామాల్లో  వారం రోజులుగా రవాణా వ్యవస్థ పూర్తీగా స్తంభించిపోయింది. అయినా సంబంధిత అధికారులు తాత్కాలిక చర్యలు కూడా చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. కోడూరు, కొడికొండ వద్ద ధ్వంసమైన వంతెనలను యుద్ధప్రాతిపదికన స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి తాత్కాలిక మరమత్తులు చేసుకున్నారు. దాంతో ద్విచక్ర వాహనాలకు మాత్రం వెసులుబాటు కలిగింది. స్కూల్‌ బస్సులు, ఇతరత్రా అత్యవసర రవాణాకు ఇబ్బందులు తొలగడం లేదు. 

ఇసుక త్రవ్వకాలతో పెను నష్టం

గత కొంత కాలంగా నదుల్లో ఇష్టానుసారంగా ఇసుకను త్రవ్వేయడంతోనే వంతెనలకు ప్రమాదం వచ్చిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కొడికొండ, కోడూరు, సుబ్బరావుపేట వద్ద చిత్రావతి, కుషావతి నదుల్లో వంతెనలకు అతి సమీపంగా ఇసుకను తోడేయడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. నీటి ప్రవాహ ఉఽధృతి భారీ ఉండటంతో వంతెనల అడుగుభాగం నుంచి పెకలించిందని, ఇప్పటికైనా అధికారులు వంతెనలకు సమీపంలో ఇసుక త్రవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 
Updated Date - 2021-11-29T05:22:15+05:30 IST