అన్నీ ఆ ఒక్కడికే..
ABN , First Publish Date - 2021-12-26T06:55:08+05:30 IST
మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఒకే ఒక్కడికి ధారాదత్తం చేసేశారు. క్షేత్రస్థాయిలో తిరగలేకనో లేక కాసులకు అలవాటుపడ్డారో ఏమోగానీ అన్ని పథకాలు ఆ ఒక్కడితో పాటు ఆయన బినామీలకే గత ఇరవై సంవత్స రాలుగా అప్పగిస్తున్నారు.

బినామీ పేర్లతో పీఎంఎ్‌సపీ, ఎనఎ్‌ఫడీబీ కింద
పాండ్లు, కియోస్కో షాపులు ఏర్పాటు
వత్తాసు పలికిన అధికారులు
ఫిర్యాదులొస్తున్నా...’ఆదర్శ’ంగా తీసుకోవాలంటూ
అధికారుల ఉచిత సలహా
ఓ బినామీ చేపకు మత్స్యశాఖ అధికారుల సహకారం
అనంతపురం ప్రెస్‌క్లబ్, డిసెంబరు25: మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఒకే ఒక్కడికి ధారాదత్తం చేసేశారు. క్షేత్రస్థాయిలో తిరగలేకనో లేక కాసులకు అలవాటుపడ్డారో ఏమోగానీ అన్ని పథకాలు ఆ ఒక్కడితో పాటు ఆయన బినామీలకే గత ఇరవై సంవత్స రాలుగా అప్పగిస్తున్నారు. ఎంపీఎ్‌సపీ అయినా, ఎనఎ్‌ఫ డీబీ అయినా ప్రభుత్వం మత్స్యశాఖకు కేటాయించే ఏ షాపునైనా ఆ ఒక్కడికే కట్టబెట్టేశారంటే అతిశయోక్తి కాదు. పాండ్లయినా, రిటైల్ షాపు అయినా, కియోస్కో షాపు అయినా మరేదైనా అతడికే సొంతం. ఎవరైనా ఆయనకే ఎందుకిస్తున్నారనీ అధికారులను ప్రశ్నిస్తే ఆదర్శంగా తీసు కోవాలే గానీ విమర్శలు చేయరాదంటూ ఉచిత సలహా ఇస్తుండటంపై పలువురు సొసైటీ సభ్యులు మండిపడు తున్నారు. ఆ శాఖ పరిధిలోకి కొత్తగా ఏ అధికారి వచ్చినా ఇట్టే బుట్టలో వేసుకోవడం ఆ ఒక్కడికి వెన్నతో పెట్టిన విద్య. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయన తాను నిర్మించుకున్న బినామీ రాజ్యంలో పాండ్ల కు పదే పదే దరఖాస్తులు చేసుకుంటున్నట్లు సమాచారం. విమర్శలు తీవ్రమవుతున్న నేపథ్యంలో... ప్రస్తుతమున్న అధికారులు ఆయన పెట్టుకున్న ఫైళ్లను పక్కనబెట్టినట్లు సమాచారం.
బినామీ పేర్లతో...
మత్స్యశాఖ పరిధిలోని సంక్షేమాన్ని మేసేస్తున్న మత్స్య రాజు బినామీ పేర్లతో తన రాజ్యాన్ని జిల్లాలో పలు చోట్ల విస్తరింపజేసుకున్నాడు. ఎనఎ్‌ఫడీబీ కింద అమలయ్యే పథకాలన్నీ దాదాపుగా తనవశం చేసుకున్నాడు. శింగనమల నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 40 ఎకరాల్లో పీఎం ఎస్‌పీ స్కీమ్ కింద దాదాపు 9 పాండ్లను తవ్వుకున్నాడు. 24 ఎకరాల్లో ఆయన 5 పాండ్లను తవ్వుకోగా... మిగిలిన 16 ఎకరాల్లో తన బంధువుల పేర్ల మీద మరో 4 పాండ్ల ను 10 ఏళ్ల లీజు కింద తవ్వుకున్నాడు. అయితే వీటి నిర్వ హణలో నీటి సౌకర్యం సరిగ్గా లేదని ఆ ఒక్కడు పాండ్లను కొద్దిరోజులు వదిలేసినట్లు సమాచారం. లీజు సమయం దగ్గర పడటంతో ఆయన మరో బినామీని రంగంలోకి దిం పాడు. లీజును ఆయన పేరుమీద మార్చేందుకు అప్పటి అధికారులతో పాటు ఆయన కూడా గట్టి ప్రయత్నాలు జరిపి సఫలీకృతుడయ్యాడు. రాప్తాడు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో తన కుటుంబసభ్యులు, మిత్రుల పేర్ల మీద దాదాపు 20 ఎకరాల్లో పీఎంఎ్‌సపీ(ప్రధానమంత్రి స్పెషల్ ప్యాకేజీ) కింద 10 పాండ్లు తవ్వుకున్నట్లు సమాచారం. ఈ పాండ్ల తవ్వకం విషయంలోనూ బినామీ పేర్లతో చేస్తున్నాడని తెలిసినా... అధికారులు కళ్లు మూసుకొని అనుమతులిచ్చేసినట్లు ఆ శాఖ వర్గాల్లోనే జోరుగా చర్చ సాగుతోంది. ఒకటిన్నర హెక్టార్‌లో పాండ్ తవ్వాలంటే దాదాపు రూ. 10 లక్షలకుపైమాటే. అలాంటి నాలుగు పాండ్లకు సంబంధించి ఒకే వ్యక్తి బినామీ పేర్లపై ఏర్పాటు చేయడానికి అధికారులు అనుమతులివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో దీనిపై స్థానికంగా రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు అవేమీ పట్టించు కోకుండా అనుమతులిచ్చినట్లు సమాచారం. గత 10 ఏళ్లకుపైగా నిర్వహిస్తున్న ఈ పాండ్లకు పలుమార్లు సబ్సి డీ నిధులు తెచ్చుకున్నట్లు ఆ శాఖ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ పాండ్లలో ఒక పాండ్ రెనోవేషన కోసం రూ. 5 లక్షలతో ఫైలు కార్యాలయానికి చేరింది. అయితే విమర్శలొస్తున్న నేపథ్యంలో ఆ ఫైలును ప్రస్తుతమున్న అధికారులు పక్కనబెట్టినట్లు సమాచారం. ఐదేళ్ల క్రితం ఎనఎ్‌ఫడీబీ కింద యూనిట్ రూ. 10 లక్షలు ఉన్న కియోస్కో షాపును నగరంలోని పీటీసీ సమీపంలో దక్కించుకున్నాడు. ఇది కూడా తమ బంధువుల పేరిట మంజూరు చేయించుకున్నాడు. అయితే అప్పటి అధికారు లు యూనిట్ కాస్ట్ రూ. 10 లక్షలు ఉండగా... ఆ ఒక్కడు రూ. 12 లక్ష లక్షలతో ఎస్ట్‌మేట్ వేసి ఎనఎ్‌ఫడీబీ అధికారు లతో మంజూరు చేయించుకున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఇందులో 40 శాతం సబ్సిడీ విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వు లు జారీ చేశారుగానీ... ఆ ఉత్తర్వుల్లో సైతం యూనిట్ కాస్ట్‌ను పొందుపరచకపోవడం పలు విమర్శలు దారి తీస్తోంది. అప్పట్లో శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఫైలును ముందుకు కదిపినట్లు సమాచారం. తాజాగా అదే షాపు పరిధిలో నాలుగు చక్రాల వాహనాన్ని సబ్సిడీ తో తీసుకున్నట్లు సమాచారం. సప్తగిరి సర్కిల్ సమీపంలో చేపల షాపును తన పేరిట దక్కించుకున్నాడు. ఈ షాపు దాదాపు 20 ఏళ్లుగా ఆయనే ఏలుతున్నట్లు సమాచారం. నిబంధనల మేరకు ఆప్కాప్ కింద ఏర్పాటైన షాపునకు ఐదేళ్లకోసారి టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా... ఆ అధికా రులు ఆ టెండర్లు ఎప్పుడు నిర్వహిస్తున్నారో... ఎవరిని ఆహ్వానిస్తున్నారో తెలియదుగానీ.. రెండు దశాబ్దాలుగా ఆ బినామీ చేపకే అప్పగిస్తూ వస్తున్నారు. ఇలా మత్స్యశాఖ లోని అప్పటి కొందరు అధికారులు మామూళ్లు మత్తుతో ఆ బినామీ చేపకు అన్ని సంక్షేమ పథకాలను దగ్గరుండి అప్పజెప్పారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పాండ్ల ఫైళ్లకు సంబంధించిగానీ... సప్తగిరి సర్కిల్ సమీపంలోనున్న షాపు, పీటీసీ సమీపంలోనున్న షాపున కు సంబంధించిన వివరాలను అడిగితే.. తమకేమీ తెలియదు అప్పటి అధికారులు ఎలా చేశారో ఏంటో అర్థం కావడం లేదని చెబుతుండటం వి మర్శలకు మరింత ఊతమిస్తోంది. ప్రస్తుతం శాఖకు డీడీ కేడర్ పోస్టు ను కేటాయించారు. ఆ స్థానంలో వచ్చిన డీడీ అయినా బినామీ పేర్లతో ఏర్పాటు చేసు కున్న పాండ్లు, షాపులపై చర్యలు తీసుకొని అర్హులైన వారికి పథకాలు అందేలా చూస్తారో లేదో వేచి చూడాల్సిందే.
పదిహేనేళ్లకుపైగా ఆ షాపునకు టెండర్లేవీ..?
అధికారులు ఇచ్చిన ‘ఆదర్శ’ చేప బిరుదుతో నగరంలోని సప్తగిరి సర్కిల్ సమీపంలో ఒక షాపును దక్కించుకు న్నాడు. అయితే ఆ షాపు అప్పట్లో ఆప్కాఫ్ అధికారులు నిర్మించి ఇచ్చారు. అయితే నిబంధనల మేరకు ఐదేళ్లకొక సారి నిర్వహించాల్సిన టెండర్‌ను దాదాపుగా మరిచారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దాదాపు 15 ఏళ్లుగా ఆ షాపు అద్దె విషయం, టెండర్ విషయాన్ని గాలికొదిలే యడం వెనుక ఆప్కా్‌ఫలోని కొందరు అధికారులు ఆయన దగ్గర నుంచి మామూళ్లు తీసుకోవడమేనన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ బినామీ చేప తాను ఏర్పాటు చేసుకున్న పాండ్లలో చేపలు పెంచడం... అక్కడి నుంచి తెచ్చి తన షాపుల్లో వ్యాపారాలు సాగిస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. అసలు ఆ పరిసర ప్రాంతాల్లో షాపులకు భారీ డిమాండ్ ఉంది. అయినా ఇప్పటికీ ఆ షాపును అధికారికంగా రూ. 5 వేలు అద్దె అని చెబుతు న్నప్పటికీ అనధికారికంగా రూ. 3 వేలకే ఆ బినామీ చేప కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎప్పుడు టెండర్లు నిర్వ హించారో.. ఎవరెవరిని ఆహ్వానించారు.. ఎంత మంది పా ల్గొన్నారన్న సమాచారాన్ని ఆప్కాఫ్ అధికారులును అడిగి తే అందుకు సంబంధించిన ఒక్క ఫైలు కూడా వారి వద్ద లేకపోవడం... గట్టిగా అడిగితే పరిశీలించి పంపుతామని చెబుతుండటం విమర్శలకు మరింత ఊతమిస్తోంది. ఇలా ఔత్సాహికులు, మత్స్యకారులు, సొసైటీలకు అన్ని వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలను చేరువ చేయాల్సిన అధికారులు ఒక్కరికే ధారాదత్తం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మాకేం సంబంధం లేదు: శాంతి, మత్స్యశాఖ డీడీ
ఎనఎ్‌ఫడీబీ అయినా... ఆప్కాఫ్ అయినా మాకేమీ సం బంధం ఉండదు. అంతా ఆనలైన సిస్టం.. ఎవరికి వారు ఆనలైనలో ఆయా స్కీముల కింద దరఖాస్తు చేసుకుం టారు. పైస్థాయి అధికారులు ఎంపిక చేసి మాకు ఫైళ్లను పంపుతారు. మేము పరిశీలన చేసి పథకంగానీ.. సబ్సిడీనిగానీ విడుదల చేస్తాం. రాప్తాడు, శింగనమల, కియోస్కో, ఆప్కాఫ్ కింద షాపుల విషయంలో మాకేమీ సంబంధం లేదు. అప్పటి అధికారులు ఆ ఫైళ్లను ఎలా పంపారో మాకు తెలియదు.