ఉద్యోగుల ఉద్యమ పంథా..!

ABN , First Publish Date - 2021-12-09T06:37:08+05:30 IST

తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వోద్యోగులు ఉద్యమ పంథాను కొనసాగించారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం రెండో రోజు ఉద్యోగులు, సిబ్బంది న ల్లబ్యాడ్జీలు ధరించి, నిరసనలు చేపట్టారు.

ఉద్యోగుల ఉద్యమ పంథా..!
జేడీఏ కార్యాలయం ఎదుట ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

రెండోరోజూ కొనసాగిననిరసనలు

నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు  

సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి  

ఏపీజేఏసీ ఐక్యవేదిక నాయకుల డిమాండ్‌ 

అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 8:  తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వోద్యోగులు ఉద్యమ పంథాను కొనసాగించారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం రెండో రోజు ఉద్యోగులు, సిబ్బంది న ల్లబ్యాడ్జీలు ధరించి, నిరసనలు చేపట్టారు. కలెక్టరేట్‌, రెవె న్యూ కార్యాలయాలు, వ్యవసాయ, ఏపీఎంఐపీ, ఉద్యాన, పశుసంవర్థక, వైద్య ఆరోగ్య, నీటిపారుదల, ఐసీడీఎస్‌, ప్రభుత్వ పాఠశాలలతోపాటు మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన వ్యక్తం చేశారు. బుఽధవారం వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయం ఎదుట ఏపీజేఏసీ అమరావతి, ఏపీజేఏసీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ వైఖరికి వ్యతరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఐక్యవేదిక నాయకులు దివాకర్‌రావు, అతావుల్లా మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై  ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. 11వ పీఆర్సీని వెంటనే ప్రకటించి, డీఏలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎ్‌సను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని సీఎం జగనమోహనరెడ్డి హామీ ఇవ్వడంతోనే సరిపెట్టారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్‌ చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఆర్సీపై సీఎం స్పష్టత ఇచ్చారని కొన్ని సంఘాల నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దని సూచించారు. ఏపీజేఏసీ ఐక్యవేదిక నాయకులకు ఇప్పటిదాకా సమస్యల పరిష్కారంపై సీఎం, ఇతరులెవరూ స్పష్టమైన వైఖరిని తెలియజేయలేదన్నారు. ప్రభుత్వోద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొన్ని సంఘాల నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు. వారి మాటలు పట్టించుకోకుండా ఐక్యవేదిక నాయకుల పిలుపు  మేరకు  నిరసనలు కొనసాగించి, విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి, సమస్యలు పరిష్కరించే దాకా నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యోగుల సంఘం నాయకులు రాజేంద్రప్రసాద్‌, ఆదంఖాన, జమీలాబేగం పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T06:37:08+05:30 IST