అభివృద్ధి పనుల్లో పక్షపాతం చూపొద్దు

ABN , First Publish Date - 2021-12-31T05:47:51+05:30 IST

అభివృద్ధి పనుల్లో పక్షపాత ధోరణి తగదని 1, 3వ వార్డు టీడీపీ కౌన్సిలర్లు సప్తగిరి, గీత అన్నారు. నగర పంచాయతీలోని 20వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అందరికీ సమన్యాయం చేయాలన్నారు.

అభివృద్ధి పనుల్లో పక్షపాతం చూపొద్దు
సమస్యలను చైర్మనకు వివరిస్తున్న కౌన్సిలర్‌

సర్వసభ్య సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు 


పెనుకొండ, డిసెంబరు 30: అభివృద్ధి పనుల్లో పక్షపాత ధోరణి తగదని 1, 3వ వార్డు టీడీపీ కౌన్సిలర్లు సప్తగిరి, గీత అన్నారు. నగర పంచాయతీలోని 20వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అందరికీ సమన్యాయం చేయాలన్నారు. వైసీపీ కౌన్సిలర్లకు ఒక న్యాయం, టీడీపీ వారికి మరోన్యాయం ఏంటని కమిషనర్‌ వెంకటరాముడు, చైర్మన ఉమర్‌ఫారూక్‌ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి చైర్మన అధ్యక్షత వహించారు. ముందుగా ఏడుగురు పారిశుధ్య కార్మికులను రెండునెలలపాటు నియమించడం, గొల్లపల్లి నీటి పథకానికి సంబంధించి రూ.99 వేలతో మరమ్మతులు, వైజంక్షన చెరువుకట్టవద్ద ఆర్చ్‌ల నిర్మాణం తదితర పనులను ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం కౌన్సిలర్లు గీత, సప్తగిరి మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయన్నారు. మురుగు నీరు రోడ్లపై చేరడంతో మురుగుకుంటల్లా ఏర్పడి ప్రజలు రోగాల బారినపడుతున్నారన్నారు. వీధిదీపాలు లేక ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు ప్రతివార్డుకు 15వీధి దీపాలను అందజేశారని, తమ వార్డుల్లో మాత్రం కౌన్సిలర్లకు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులకు అందజేసి పక్షపాతం చూపుతున్నారన్నారు. అధికారులు అందరికీ సమన్యాయం చేయాలని కోరారు. 16వ వార్డు కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ షీప్‌ఫారం వద్ద ఏర్పాటుచేసిన మంచినీటి పథకం నుంచి రోజూ 9 గంటలపాటు నీటి సరఫరా జరుగుతోందని, 24గంటలు పనిచేయాలంటే కొత్తగా విద్యుత లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా మునిసిపాలిటీలో చేరిన కోనాపురం, వెంకటరెడ్డిపల్లి పంచాయతీల్లో కొత్తగా కొళాయిలను ఏర్పాటుచేసి పాతవాటిని రెగ్యులరైజ్డ్‌ చేయాలన్నారు. 15వ వార్డు కౌన్సిలర్‌ రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ జీఐసీ కాలనీలోని పంచాయతీ స్థలంలో బోరువేసుకుని కాంప్లెక్స్‌ కడుతున్నారని పంచాయతీ స్థలంలో వేసిన బోరును ఉపయోగించరాదంటూ యజమానికి ఎన్నిమార్లు హెచ్చరించినా పట్టించుకోవడం లేదన్నారు. పట్టణంలో కొళాయిలు తనిఖీచేసి అక్రమంగా వేసుకున్న వాటిని తొలగించాలని, లేనిపక్షంలో రుసుము కట్టించుకుని రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. చైర్మన ఉమర్‌ఫారూక్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో ఎవరిపట్లా పక్షపాతం చూపలేదన్నారు. అందరికీ సమన్యా యం చేస్తామన్నారు. సమావేశంలో మేనేజర్‌ నరసింహులు, వైస్‌ చైర్మనలు సునీల్‌కుమార్‌, నందినిరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T05:47:51+05:30 IST