వైద్యాధికారి సెలవుపై చర్చ
ABN , First Publish Date - 2021-08-25T05:42:40+05:30 IST
జిల్లా వైద్యశాఖకు ఇన్‌చార్జ్ పాలన తప్పదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నా యి. ఇప్పటికే జిల్లా సర్వజనాస్పత్రి, వైద్య కళాశాలల్లో ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది

అనంతపురం వైద్యం, ఆగస్టు24: జిల్లా వైద్యశాఖకు ఇన్‌చార్జ్ పాలన తప్పదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నా యి. ఇప్పటికే జిల్లా సర్వజనాస్పత్రి, వైద్య కళాశాలల్లో ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. ఇప్పుడు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కామేశ్వరప్రసాద్ సెలవుపై వెళ్లడం చర్చకు తావిస్తోంది. డీఎంహెచ్‌ఓ ఆగస్టు 16వ తేదీ నుంచి 15 రోజులు సెలవులో వెళ్లారు. జిల్లా అదనపు వైద్యాధికారి రామసుబ్బారావుకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. కామేశ్వరప్రసాద్ ముందు నుంచీ ప్రధాన కార్యాలయాల్లో ఎక్కువ కాలం పనిచేస్తూ వచ్చారు. గతేడాది కరోనా ఉధృత సమయంలో జేసీ డాక్టర్ సిరి అప్పటి డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిల్‌కుమార్ మధ్య వివాదం తలెత్తడంతో అనిల్‌ను కడపకు బదిలీ చేశారు. ఆ సమయంలో రాష్ట్ర శాఖలో పనిచేస్తున్న కామేశ్వర ప్రసాద్‌ను జిల్లా వైద్యశాఖాధికారిగా ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగానే బాధ్యతలు సాగిస్తూ వస్తున్నారు. అవకాశం వస్తే అనంత నుంచి వెళ్లిపోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారుల బదిలీలకు ఆమోదం తెలిపిందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బదిలీ చేయించుకునేందుకు కామేశ్వరప్రసాద్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం వైద్యవర్గాల్లో సాగుతోంది. దీంతో ఈ నెలాఖరులో జాయిన్ అవుతారా, సెలవు పొడగించుకుని అటే బదిలీపై వెళ్తారా అనే చర్చ ఆ శాఖలో సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.