నియంతల్లా..

ABN , First Publish Date - 2021-03-02T06:57:31+05:30 IST

ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు నియంతల మాదిరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము చెప్పిందే జరగాలనీ, లేకుంటే ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారు.

నియంతల్లా..

వైసీపీ శ్రేణుల ఇష్టారాజ్యం

పల్లెపోరులో ఓటేయలేదని కొందరి పింఛన్ల నిలిపివేత

మున్సిపోల్స్‌లో ఓటేయకపోతే ప్రభుత్వ లబ్ధి తొలగిస్తామని హెచ్చరికలు

పింఛన్ల పంపిణీలో వలంటీర్ల వెంటే అధికార పార్టీ నాయకులు

కండువా మార్చకపోతే ఆర్థిక మూలాలపై దాడులు

వంత పాడుతున్న అధికారులు

మున్సిపోల్స్‌లో అధికార పార్టీ నేతల బరితెగింపు

అనంతపురం, మార్చి1(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు నియంతల మాదిరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము చెప్పిందే జరగాలనీ, లేకుంటే ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారు. అమలు చేస్తున్నారు కూడా. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులనే కాదు, ప్రజలను కూడా వదలట్లేదు. అందరిపైనా జులుం ప్రదర్శిస్తున్నారు. నియంతల్లా తయారయ్యారు. అధికారంలో ఉన్నామనీ, తామేం చేసినా చెల్లుతుందనే ధీమాలో వైసీపీ నేతలున్నారు. బుజ్జగింపులైనా.. బెదిరింపులైనా.. ప్రలోభాలైనా.. అన్నింటా అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. వలంటీర్లు  మొదలుకొని.. అధికారుల వరకూ వైసీపీ ముఖ్య నేతలకు అంటకాగాల్సిన పరిస్థితి ఆ వర్గాలకు ఎదురవుతోంది. వైసీపీ నేతలు ఏం చెబితే అదే శాసనమన్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. అధికార పక్షం దౌర్జన్యాలు, అరాచకాలు, ఆగడాలు, బెదిరింపులకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వర్గాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా.. చర్యలకు ఉపక్రమించిన దాఖలాలు లేవనటంలో సందేహం లేదు. దీంతో అధికార పార్టీ నాయకులు, వారి అనుచరగణం పేట్రేగిపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు జిల్లాలో సోమవారం తలెత్తిన ఘటనలు అద్దం పడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులకు ఓటేయలేదని పింఛన్ల పంపిణీని నిలిపేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓటేయకపోతే సంక్షేమ పథకాల లబ్ధి రాకుండా అడ్డుకుంటామనే హెచ్చరికలు పంపుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించిన అంశాల్లో నేరుగా ఆ పార్టీ నేతలే జోక్యం చేసుకుంటున్నారు. నయానో.. భయానో.. చెప్పిచూసినా.. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవటంతోపాటు కండువా మార్చుకోవాలని హెచ్చరికలు పంపుతున్నారు. వినని పక్షంలో అధికారులను అడ్డుపెట్టుకుని, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ఆర్థిక మూలాలపై దెబ్బతీసే చర్యలకు పూనుకుంటున్నారంటే జిల్లాలో అధికార పార్టీ నేతల బరితెగింపు ఏపాటిదో దీన్నిబట్టి అర్థమవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మేధావి వర్గాలు, రాజకీయ విశ్లేషకులు సైతం అధికార పార్టీ నేతల అధికార జులుంపై పెదవి విరుస్తుండటం గమనార్హం. బాధిత వర్గాలు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేసినా.. వారి ఘోషను పట్టించుకునే పరిస్థితులు జిల్లాలో కనిపించడం లేదు. అంటే కొందరు అధికారులు.. అధికార పార్టీ నేతలకు వంత పాడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మచ్చుకు కొన్ని ఘటనలు పరిశీలిస్తే..

ఓటేయలేదని పంపిణీ చేయని పింఛన్లు

నార్పల మండలం దిగుమర్రి పంచాయతీలో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వైసీపీ మద్దతురాలు 38 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమిని స్థానిక వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ కక్షను ఆ గ్రామంలో కొందరు పింఛన్‌దారులపై చూపారు. ‘మీరు ఓటు వేయకపోవటంతోనే తమ పార్టీ మద్దతురాలు ఓడిపోయింద’నే సాకును చూపుతూ.. గ్రామంలోని 8 మంది డప్పు, చర్మకారుల పింఛన్ల సొమ్ము పంపిణీ చేయకుండా ఆపేశారు. కొంత కాలంగా వీరంతా పింఛన్లు అందుకుంటున్నారు. హఠాత్తుగా వీరు పింఛన్ల సొమ్ము అందుకునేందుకు అనర్హులయ్యారు. దీన్నిబట్టి చూస్తే.. వైసీపీ నాయకుల ఒత్తిళ్లు అధికారులపై ఏ మేరకు ఉన్నాయన్నది స్పష్టంగా అర్థమవుతోంది. చివరికి ఆ బాధిత లబ్ధిదారులు.. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగే స్థాయికి పరిస్థితులు దారితీశాయి. సంబంధిత అధికారులు లబ్ధిదారుల నుంచి నిలదీతను ఎదుర్కొన్నారు. ఆ లబ్ధిదారులు.. టీడీపీకే ఓటేశారని వైసీపీ నాయకుల వాదనకు అధికారులు వంతపాడటం ఏ మేరకు సమంజసమని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారంటే అధికార పార్టీ నాయకుల శాసనాలకు అధికారులు ఏ మేరకు వంత పాడుతున్నారన్నది తేటతెల్లమవుతోంది.

ఓటేయకపోతే ప్రభుత్వ లబ్ధి అందదని హెచ్చరికలు

మున్సిపల్‌ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓటేయకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల లబ్ధి అందకుండా చేస్తామనే హెచ్చరికలు అధికార పార్టీ నేతల నుంచి ఓటర్లకు జారీ అవుతున్నాయి. కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం. పింఛన్ల పంపిణీలో భాగంగా వలంటీర్లను అడ్డుపెట్టుకుని, అధికార పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వలంటీర్ల వెంట వెళ్లి నేరుగా ఓటర్లనే బెదిరింపులకు గురిచేసే పరిస్థితులు క్షేత్రస్థాయిలో దర్శనమిస్తున్నాయి. కళ్యాణదుర్గం మున్సిపాల్టీలోని 12వ వార్డులో సంబంధిత వలంటీర్‌ పింఛన్‌ పంపిణీకి సిద్ధమవ్వగా.. అతడితోపాటు స్థానిక అధికార పార్టీ కౌన్సెలర్‌ భర్త ఇంటింటికీ వెళ్లి, పింఛన్‌ సొమ్ము అందజేస్తూ ఓటేయాలని లబ్ధిదారులను కోరాడు. వైసీపీ నాయకుడి ప్రచారాన్ని టీడీపీ అభ్యర్థిని భర్త అడ్డుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన ఆ వైసీపీ నాయకుడు.. టీడీపీ నాయకులపై అధికార జులుం ప్రదర్శించాడు. ‘వలంటీర్‌తో కలిసి ప్రచారం చేస్తా.. ఎవరికైనా ఫిర్యాదు చేసుకో’ అంటూ ప్రతాపాన్ని చూపాడంటే... అధికారులు సైతం వైసీపీ నాయకుల చర్యలను అడ్డుకట్ట వేయలేని పరిస్థితిలో ఉన్నారనటంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా..  ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థికి ఓటు వేయలేదన్న నెపంతో టీడీపీ సానుభూతిపరులకు పింఛన్‌ పంపిణీకి నిరాకరించారు. సోమవారం కళ్యాణదుర్గం మండలంలోని గోళ్ల గ్రామంలో  ఏకంగా 72 మంది లబ్ధిదారులకు పింఛన్‌ ఇవ్వకుండా గ్రామ వలంటీర్లు ఎగనామం పెట్టారు. ప్రతినెలా అందే పింఛన్‌ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వలంటీర్లను నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ కవిత, మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటేశులు, రమేష్‌, బొజ్జన్న, వెంకటేశులు తదితరులు లబ్ధిదారులతో కలిసి గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు. గంటపాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పింఛన్ల పంపిణీలో కుట్రపూరిత రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కండువా మార్చకపోతే ఆర్థిక మూలాలపై దాడులు

నామినేషన్లు విత్‌ డ్రా చేసుకోకపోయినా.. ఉన్న పార్టీ కండువాను తీసేసి, వైసీపీలో చేరకపోయినా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలపై అధికార పార్టీ నేతలు ప్రతాపాన్ని చూపుతున్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను నయానోభయానో లోబరుచుకునేందుకు ప్రయత్నాలు సాగించినా.. ఫలించని పక్షంలో అధికారులను రంగంలోకి దింపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయదుర్గం పట్టణంలో టీడీపీ అభ్యర్థులకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. కండువా మార్చకపోతే... అభ్యర్థుల ఆర్థిక మూలాలపై దాడులు చేయించే చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగానే స్థానిక టీడీపీ నాయకుడికి మొదట ప్రలోభాల ఎర చూపారు. అందుకు ససేమిరా అనడంతో ఆయనకు సంబంధించిన సామిల్‌పై అటవీ శాఖాధికారులతో దాడులు చేయించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సామిల్‌ యజమాని కుమార్తె మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోవాలని అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. ససేమిరా అనటంతో ఏకంగా అధికారులతో దాడులు చేయించటంతోపాటు సామిల్‌ యంత్రాలను తొలగించారు. అనుమతులు లేవంటూ అధికారులు సాకులు చూపుతుండటం చూస్తే.. ఇన్నాళ్లుగా ఏం చేశారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే సామిల్‌పై దాడులు చేశారన్నది చూసిన వారికైనా.. విన్నవారికైనా అర్థం కాగలదు. పార్టీ కండువా మార్చి ఉంటే.. టీడీపీ నాయకుడు నిర్వహిస్తున్న ఆ సామిల్‌ సక్రమమేనన్న అధికారుల వైఖరికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.


Updated Date - 2021-03-02T06:57:31+05:30 IST