జిల్లాలో కరోనాతో వేలమంది మృతి
ABN , First Publish Date - 2021-10-29T05:44:24+05:30 IST
కరోనా కేసులు తగ్గిపోయాయి. మరణాలు సంభవించడం లేదు. ఇప్పుడు కరోనా మరణాల ఆర్థికసాయం మంజూరుపై అందరి దృష్టి పడింది

చావులు దాచారు.. సాయమైనా చేస్తారా?
అధికారులు చూపిస్తున్నది 1093 మందే
వాస్తవానికి ఈ సంఖ్య
మూడింతలు ఉంటుందని అంచనా
రూ.50 వేల సాయంపై అయోమయం
అందరికీ అందించాలని విపక్షాల డిమాండ్
కరోనా సృష్టించిన అలజడి
అంతాఇంతా కాదు..
ఆ భయానక దృశ్యాలను తలచుకుంటేనే
ఒళ్లు జలదరిస్తుంది..
ఆస్పత్రిలో బెడ్డు దొరక్క..
ఆక్సిజన అందక..
అంబులెన్సలోనే..
ఎందరో మరణించారు..
వారి కుటుంబికులు చేసిన
ఆర్తనాదాలు వర్ణనాతీతం..
అయినా.. ప్రభుత్వాలు కరుణ చూపక..
మరణాలు దాచి, మాయ చేశాయి..
అధికారులూ మానవత్వం మరచి..
చావుల లెక్క చూపక..
పాలకుల మెప్పు పొందేందుకు పాకులాడారు..
దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న
ఆ కుటుంబాలపై
ఇప్పుడైనా దయ చూపుతారో.. లేదో..?
ఆర్థికసాయమైనా అందిస్తారో.. లేదో..?
మళ్లీ తప్పుడు లెక్కలు చూపి..
ద్రోహం చేస్తారా..?
అనంతపురం వైద్యం, అక్టోబరు 28: కరోనా కేసులు తగ్గిపోయాయి. మరణాలు సంభవించడం లేదు. ఇప్పుడు కరోనా మరణాల ఆర్థికసాయం మంజూరుపై అందరి దృష్టి పడింది. కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించి, ఆదుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చింది. అది కూడా రాష్ట్ర విపత్తుల నిధి కింద కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేలు సాయం అందించాలని రాషా్ట్రలకు కేంద్రం సూచించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించిన వారికి ఈ సాయం అందించాలని అందులో పేర్కొంది. అది కూడా జిల్లా కలెక్టర్ చైర్మనగా వ్యవహరిస్తూ సాయం అందించాలని సూచించింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలు దరఖాస్తు చేసుకోవడానికి కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ఆదేశించారు. కొవిడ్‌తో మరణించినట్లు జిల్లా వైద్యాధికారుల సర్టిఫికెట్ తప్పనిసరిగా దరఖాస్తుకు జత పరచాల్సి ఉంటుంది. ఇక్కడే కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020 మార్చిలో జిల్లాలో కరోనా కేసులు ప్రారంభమయ్యాయి. 2021 ఫిబ్రవరి ఆఖరి నాటికి ఏడాదికి కలిపి 599 మంది జిల్లాలో మరణించారు. 2021 మార్చి నుంచి రెండో దశ కరోనా కేసులు మళ్లీ తీవ్రమవుతూ వచ్చాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కరోనా తీవ్రంగా ఉండింది. బాధితులు అమాంతం పెరిగిపోయారు. చివరికి ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన అందకుండా పోయాయి. దీంతో ఊపిరి ఆడక ఆస్పత్రికి వస్తే పడక, ఆక్సిజన సమయానికి దొరక్క, వైద్యం అందక రోజూ అనేకమంది ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. ఒక్క జిల్లా సర్వజనాస్పత్రి కొవిడ్ విభాగంలోనే రోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. బాధిత కుటుంబాల ఆర్తనాదాలతో ఆస్పత్రి మిన్నంటి పోతూ వచ్చింది. ఎక్కడ నుంచో ఊపిరాడక తీవ్ర ఆయాసంతో ఆస్పత్రికి వచ్చీరాగానే ఇక్కడ వైద్యం అందక వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరందరికీ కొవిడ్‌తో చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫికెట్ ఇవ్వలేదు. బాధిత కుటుంబ సభ్యులు చనిపోయిన వెంటనే ఏడ్చుకుంటూ తీసుకెళ్లి ఖననం చేశారు. ఇప్పుడు రూ.50 వేల ఆర్థికసాయానికి డాక్టర్ డెత సర్టిఫికెట్ తప్పనిసరి అని నిబంధన పెట్టారు. ఆ రోజు జిల్లా ఉన్నతాధికారులు కరోనా మరణాలు తక్కువగా చూపించి, ప్రభుత్వ మెప్పుపొందేందుకు వైర్‌సతో మరణించిన వారిని గుర్తించలేదు. దీంతో వారికి ఆర్థికసాయం అందకుండా పోతోంది. అధికారులు మాత్రం ఇప్పటి వరకు 1093 మంది మాత్రమే మరణించినట్లు చూపుతున్నారు. అనధికారికంగా ఇంతకు మూడింతలు మంది కరోనా బారిన పడి చనిపోయినట్లు వైద్యవర్గాలే చెప్పుకుంటున్నాయి. దీనినిబట్టి నిజంగా కరోనా బారిన పడి మరణించిన వారికి కరోనా ఆర్థికసాయం రూ.50 వేలు అందకుండా పోతోంది. దీనిని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రత్యేకంగా సర్వే చేపట్టి, కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరిని గుర్తించి, ఆ కుటుంబాలకు సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
సాయం అందించడంలో చిత్తశుద్ధి కరువు
- కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి
కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అంది ంచడం లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం అధికారులు చూపిన వారికే ఇచ్చి తప్పుకోవాలని చూ స్తోంది. కరోనాతో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి సాయం అందించాలి. అందుకే ప్రత్యేక సర్వే చేపట్టాలి. ఆ తర్వాత వాస్తవాలు తెలుస్తాయి. సా యం అందించవచ్చు. అలాకాకుండా ప్రభుత్వం అధికార లెక్కలకు వెళితే అన్యాయం చేసినట్లే.

మరణాలపై దాగుడు మూతలు
- జగదీశ, సీపీఐ జిల్లా కార్యదర్శి
కరోనా మరణాలపై ఆది నుంచీ అధికారులు దాగుడుమూతలు ఆడుతూ వస్తున్నారు. చివరకు కేంద్రం చూపిన మరణాల సంఖ్యకు రాష్ట్రంలో ప్రభుత్వం చూపిన లెక్కకు తేడా ఉంది. మరణా ల వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం కోరినా.. ఇప్పటికీ ఇవ్వలేదంటే ప్రభుత్వ దాగుడుమూతలు తెలుస్తోంది. కరోనా మృతులందరి కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలి.

ప్రత్యేక సర్వే చేపట్టాలి
- రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి
కరోనా మరణాల సంఖ్యలో చాలా గందరగోళం ఉంది. అధికారులు సక్రమంగా నమోదు చేయలేదు. అందుకే వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సర్వే చేపడితే కరోనాతో మరణించిన వారి వివరాలు బయటపడతాయి. వాటిపై పూర్తిస్థాయిలో అధికారులు విచారణ జరిపి, వాస్తవంగా మరణించిన కుటుంబాలకు సాయం అందేలా చూడాలి. అలా కాకుండా అధికారులు చూపిన లెక్కల మేరకు సాయం అందిస్తామంటే రాజకీయ పక్షపాతంతో ఇచ్చినట్లు ఉంటుంది. ప్రతి బాధిత కుటుంబానికి సాయం అందించి, ఆదుకోవాలి.
