దాణాపై బాదుడే..!

ABN , First Publish Date - 2021-12-30T06:53:37+05:30 IST

ఆదాయం వచ్చే ఏ మార్గాన్నీ రాష్ట్ర ప్రభుత్వం వదలడం లేదు. ఫీడ్‌ యాక్టు పేరుతో పశువులు, కోళ్లు, కుక్కలకు అవసరమైన దాణా విక్రయానికి లైసెన్సు ఫీజు వసూలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జనవరి నుంచి ఫీడ్‌ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

దాణాపై బాదుడే..!

ఉత్పత్తిదారులు, వ్యాపారులకు 

లైసెన్సులు తప్పనిసరి  

ఇప్పటికే నోటీసులు జారీ

లేకపోతే భారీ జరిమానాలు

ఆందోళనలో వ్యాపారులు


అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 29: ఆదాయం వచ్చే ఏ మార్గాన్నీ రాష్ట్ర ప్రభుత్వం వదలడం లేదు. ఫీడ్‌ యాక్టు పేరుతో పశువులు, కోళ్లు, కుక్కలకు అవసరమైన దాణా విక్రయానికి లైసెన్సు ఫీజు వసూలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జనవరి నుంచి ఫీడ్‌ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఫీడ్‌ చట్టం మేరకు లైసెన్సు ఫీజు చెల్లించాలని దాణా వ్యాపారులకు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దాణా ఉత్పత్తిదారులు, వ్యాపారులు జనవరి నుంచి లైసెన్సు లేకుండా దాణా విక్రయిస్తే భారీ జరిమానాలు విధించేందుకు ఆ శాఖ యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఆ మేరకు డివిజన్ల వారీగా ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు  చేసింది.


జనవరి నుంచి అమలు

జనవరి 1వ తేదీ నుంచి ఫీడ్‌ చట్టం అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 98 దాణా విక్రయ కేంద్రాలున్నట్లు పశుసంవర్థక శాఖ అధికారుల ప్రాథమిక సమాచారం. అనంతపురం డివిజనలో 18, ధర్మవరం 31, పెనుకొండ 19, హిందూపురం 16, ఉరవకొండ 14 దాణా విక్రయకేంద్రాలున్నట్లు సమాచారం. వాస్తవానికి అంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు గుర్తించిన దాణా విక్రయదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. లైసెన్సు తీసుకున్న వారే జనవరి నుంచి దాణా విక్రయించాలని అందులో స్పష్టం చేశారు.


లైసెన్సు లేకపోతే భారీ జరిమానాలు

ఫీడ్‌ చట్టం నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. నూతన సంవత్సరం ఆరంభం నుంచి తనిఖీలు చేపట్టి లైనెన్సులేని వారిపై భారీగా జరిమానాలు విధించేందుకు పశుసంవర్థక శాఖ యంత్రాంగం సిద్ధమైంది. లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు దాణా, అనుబంధ ఉత్పత్తులను తయారుచేసే యూనిట్లకు లైసెన్సు ఫీజు రూ.2లక్షలుగా నిర్ణయించారు. డిస్ర్టిబ్యూటర్లు రూ.1.25 లక్షలు, రిటైలర్లకు రూ.25వేలుగా లైసెన్సు ఫీజు నిర్ణయించారు. నెలాఖరులోగా తప్పనిసరిగా ఫీజు చెల్లించి, లైసెన్సు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఒకసారి లైసెన్సు తీసుకుంటే సరిపోతుందనీ, మళ్లీ రెన్యువల్‌ చేయాల్సిన అవసరం లేదని పశుసవర్థక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దాణా నాణ్యతలో తేడాలున్నా, లైసెన్సు లేకుండా విక్రయం, ఉత్పత్తి చేసినా రూ.2 లక్షలు జరిమానా, రెండోసారి దొరికితే జరిమానాతోపాటు సరుకు సీజ్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఫీడ్‌ చట్టంలో పొందుపరిచారు. దాణా నాణ్యత, ప్రమాణాల్లో తేడాలుంటే లైసెన్సు రద్దు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై దాణా వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాడి  పశువులకు అందించే నాణ్యమైన దాణా 50 కిలోల బస్తా మూడేళ్ల క్రితం రూ.600 ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో రూ.1000 నుంచి రూ.1200కి పెరిగింది. ఇటీవల ఒక్కో బస్తాపై మరో రూ.20 నుంచి రూ.80 దాకా పెరిగింది. లైసెన్సులు తప్పనిసరి చేయడంతో దాణా ధరలు మరింత పెంచే అవకావం ఉన్నట్లు సమాచారం. దీని ప్రభావంతో రైతులు, జీవాల పెంపకందారులపై అదనపు భారం పడనుంది. లైసెన్సు జారీతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే నాణ్యమైన దాణా విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరి ఏ మేరకు ప్రభుత్వం చొరవ చూపుతుందో వేచిచూడాల్సిందే.


లైసెన్సులు లేకపోతే చర్యలు:వెంకటేష్‌, పశుసంవర్థక శాఖ జేడీ 

ఫీడ్‌ చట్టం మేరకు దాణా విక్రయదారులు తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలి. నెలాఖరులోగా స్థానిక ఆర్బీకేల్లో నిర్దేశించిన ఫీజు చెల్లించి, లైసెన్సు పొందాలి. నాణ్యతాప్రమాణాల విషయంలో పారదర్శకత కోసమే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. జనవరి నుంచి లైసెన్సు లేకుండా దాణా ఉత్పత్తి, విక్రయం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం.

Updated Date - 2021-12-30T06:53:37+05:30 IST