పల్లెల్లో ‘రేషన కార్డుల’ కోత

ABN , First Publish Date - 2021-08-25T06:29:06+05:30 IST

ప్రభుత్వం చెప్తోంది ఒకటి....చేస్తోంది మరొకటి. ప్రతి పేదవాడి ఇంటి ముంగిట్లోకే సంక్షేమం అందిస్తామని ఒకవైపు చెప్తూ మరోవైపు అదే పేదవానికి దక్కాల్సిన సంక్షేమ పథకాలను యథేచ్చగా తొలగిస్తోంది.

పల్లెల్లో ‘రేషన కార్డుల’ కోత

-ప్రభుత్వ పథకాలకు నోచుకోని పేదలు 

-లబోదిబోమంటున్న బాధితులు

చిలమత్తూరు, ఆగస్టు 24: ప్రభుత్వం చెప్తోంది ఒకటి....చేస్తోంది మరొకటి. ప్రతి పేదవాడి ఇంటి ముంగిట్లోకే సంక్షేమం అందిస్తామని ఒకవైపు చెప్తూ మరోవైపు అదే పేదవానికి దక్కాల్సిన సంక్షేమ పథకాలను యథేచ్చగా తొలగిస్తోంది. ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకూడదన్న ఉద్దేశ్యంతో  రేషన కార్డుకు పథకాలను అనుసంధానం చేసింది. అందులో భాగంగా అర్హులను గుర్తిస్తూ...అనర్హులను ఏరివేయడానికి ప్రత్యేక బృందాలతో రేషన కార్డుల ఏరివేతను చేపట్టింది. అయితే ఈ సర్వే కొందరి పేదల పాలిట శాపంగా మారింది. ఇష్టానుసారంగా సర్వే చేయడంతో పేదలు రేషన కార్డులను కోల్పోవాల్సి వచ్చింది. అందుకు నిదర్శనం మండలంలోని కోట్లోపల్లి గ్రామానికి చెందిన కురుబ సూర్యనారాయణ. ఇతనికి  భార్య, ఇద్దరు ఆడపిల్లలు, తల్లి ఉన్నారు. ఇతనికి గతంలో ప్రభుత్వం రేషన కార్డు మంజూరు చేసింది. అప్పటి నుంచి అతనికి రేషన షాపు ద్వారా నెలనెల సరుకులు అందేవి. దాంతో పాటు అతని తల్లికి వృద్ధాప్య ఫించను కూడా వచ్చేది. అయితే 2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన కార్డుల ఏరివేత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అతనికి పది ఎకరాలకు పైనే భూమి ఉందని అకారణం చూపుతూ ఉన్న రేషన కార్డుని తొలగించారు. అప్పటి నుంచి అతని కుటుంబానికి ప్రభుత్వం అందించే కిలో రూపాయి బియ్యం పూర్తీగా రద్దయ్యాయి. ప్రభుత్వం నుంచి అందే అన్ని సంక్షేమ పథకాలను అతని కుటుంబానికి పూర్తీ స్థాయిలో ఆగిపోయాయి. తల్లికి వృద్ధాప్య పింఛన సైతం కట్‌ అయ్యింది. కానీ అతడు పూర్తీస్థాయిలో రేషన కార్డు కలిగి ఉండటానికి అర్హుడే. అతనికి అధికారులు చెప్పినట్లుగా పది ఎకరాలు భూమి లేదు. కనీసం ఒక సెంటు భూమి కూడా లేదు. అయినా అతనికి భూమి ఎక్కువగా ఉందనే కారణం చూపుతూ రేషన కార్డు తొలగించారు. దీంతో ఆ పేద కుటుంబానికి ఆందాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోయాయి. ఇటుంవటి బాధితులు మండలంలో వందల సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలు తప్పులతడకగా ఉండటంతో ఎంతో మంది అర్హులు కూడా అనర్హులయ్యారు. తద్వారా పథకాలకు దూరమయ్యారు. మండలంలో ఉన్న 44 చౌకధాన్యపు డిపోల పరిధిలో మొత్తం   మొత్తం 16,558 రేషన కార్డులు ఉన్నాయి. వివిధ రకాల సర్వేల పేరుతో ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 800 కార్డులకు పైగానే రద్దయినట్లు తెలుస్తోంది. 

అధికారుల పొరపాట్లు.. లబ్ధిదారుల పాట్లు..

 రేషన కార్డుల ఏరివేతలో కొందరు అధికారులు చేసిన పొరపాట్లుకు అనేక మంది పేదలు బలయ్యారు. చేసిన తప్పుడు సర్వేలో లేని కారణాలను చూపుతూ ఉన్న రేషన కార్డులను తొలగించి చేతులు దులుపుకున్నారు. కానీ కార్డు కోల్పోయిన పేదలు మాత్రం రెండేళ్లుగా ఇప్పటికీ  తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ, గ్రామ సచివాలయాల చుట్టూ జెరాక్స్‌ కాఫీలను పట్టుకొని కాళ్లు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ వారి సమస్య పరిష్కారం కాలేదు. కేవలం నెల నెల వచ్చే రేషన బియ్యం ఒక్కటే అందకుండా పోతే పర్వాలేదు. కార్డుకి అనుసంధానం చేసి అందజేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అకారణంగా కార్డు కోల్పోయిన బాధితులకు దక్కకుండా పోతున్నాయి. ప్రధానంగా అమ్మఒడి, ఇంటి స్థలం, ప్రభుత్వ గృహం, జగనన్న చేయూత తదితర పథకాలను కోల్పోవలసి వచ్చింది. 

దరఖాస్తులు బుట్టదాఖలు

అకారణంగా రేషన  కార్డులు కోల్పోయిన బాధితులకు రెవెన్యూ అధికారులు ఆరు అంచెల పరిశీలన కింద ధరఖాస్తు చేసుకోమని ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు. వారు చెప్పిన విధంగా దరఖాస్తు చేసుకున్నా వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. కారణంగా రెండేళ్లుగా ఇచ్చిన ధరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. ఏ ఒక్కరికి పరిష్కరించిన దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడైతే 6 స్టెఫ్‌ వాలిడేషన కింద దరఖాస్తు చేసుకోవాలని చూస్తే అందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ అసలు కనపడటం లేదు. దీంతో ఈ ధరఖాస్తులను సచివాలయాల్లో కూడా స్వీకరించడం లేదు. 


Updated Date - 2021-08-25T06:29:06+05:30 IST