రైతుల ద్రోహి ముఖ్యమంత్రి జగన : కాలవ
ABN , First Publish Date - 2021-10-30T05:21:56+05:30 IST
వ్యవసాయం వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నా సీఎం జగన రెడ్డికి ఏమాత్రం పట్టడం లేదని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.
మడకశిర టౌన, అక్టోబరు 29: వ్యవసాయం వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నా సీఎం జగన రెడ్డికి ఏమాత్రం పట్టడం లేదని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. రైతు ద్రోహిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వరుసగా పంటనష్టంలో రైతులు ఇబ్బందులుపడుతుంటే వైసీపీ ప్రభుత్వం నుంచి సాయం అందని ద్రాక్షలా మారిందన్నారు. కనీసం పంటనష్టంపై అటు వ్యవసాయశాఖమంత్రి, ఇటు జిల్లా మంత్రులు కానీ సమీక్షించిన దాఖలాలు లేవన్నారు. 2019లో మంజూరైన పంటనష్ట పరిహారాన్ని రూ.936 కోట్లను అందిస్తామని అసెంబ్లీసాక్షిగా మాట ఇచ్చారని, అయినా ఇప్పటి వరకు అందివ్వలేదని, ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు.వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినిందని, ఎకరాకు రెండు బస్తాలు కూడా దిగుబడి రావడం లేదన్నారు. ఇంతగా పంటనష్టపోయినా ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. అధికారులతో పనులు చేయించుకోవడం ఈ ప్రభుత్వానికి చేతకాదనిa, ఈక్రాప్ బుక్కింగ్ కనీసం 35 శాతం దాటలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంటనష్టపరిహారాన్ని అందించి ప్రతి ఏడాది రైతులను ఆదుకున్నారన్నారు. కానీ ప్రస్తుతం మాత్రం రైతులకు ప్రోత్సాహం లేక గిట్టుబాటు ధరలు లేక రైతులను నిండాముంచుతూ రైతు ద్రోహిగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మిగిలిపోయారన్నారు. జిల్లాలో వేరుశనగ పంటనష్టపరిహారం కోసం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. అనంతరం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి కాలవ శ్రీనివాసులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్, మాజీ చైర్మన రాజా, మాజీ కౌన్సిలర్ నాగిరెడ్డి, నాయకులు భక్తర్, పుల్లయ్యచౌదరి తదితరులు ఉన్నారు.