నేత్రపర్వం.. చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం
ABN , First Publish Date - 2021-03-24T05:45:16+05:30 IST
పట్టణంలోని గవిమఠ స్థిత చంద్రమౌళీశ్వరస్వామి రథోత్సవం మంగళవారం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం చంద్రమౌళీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తిని పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి ఆధ్వర్యంలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలుపుదీర్చారు.

శివనామస్మరణతో మార్మోగిన గవిమఠం
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
ఉరవకొండ, మార్చి 23: పట్టణంలోని గవిమఠ స్థిత చంద్రమౌళీశ్వరస్వామి రథోత్సవం మంగళవారం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం చంద్రమౌళీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తిని పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి ఆధ్వర్యంలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలుపుదీర్చారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రథం అలంకరణ కోసం ప్రత్యేక పూలహారాలను తెప్పించారు. గజలక్ష్మి(ఏనుగు)తోపాటు, గ్రామపంచాయతీ నుం చి గవిమఠం వరకు పూలహారాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ పూల అలంకరణతో రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రథాన్ని అశేష జనసంద్రం నడుమ గవిమఠం నుంచి ఎదురు బసవన్న గుడి వరకు లాగారు. శివనామస్మరణతో గవిమఠం ప్రాం తమంతా మార్మోగింది. భక్తులు రథంపైకి పండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. తిరిగి రథాన్ని యథాస్థితికి చేర్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా బళ్లారి, తుంకూరు తదితర ప్రాంతాలనుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. పీఠాధిపతి ఆధ్వర్యంలో భక్తి ప్రవచనాలు, ధార్మిక కార్యక్రమాలు సాగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి, ఆదోని చౌకీమఠం పీఠాధిపతి కల్యాణ్‌స్వామి, గవిమఠం సహాయ కమిషనర్ రమే్‌షబాబు, తహసీల్దారు మునివేలు, వైసీపీ యువ నాయకులు నిఖిల్‌నాథ్ రెడ్డి, ప్రణయ్‌రెడ్డి, ఏజెంటు రాజన్నగౌడ్, కార్యదర్శి శ్యామల, మార్కెట్‌యార్డు చైర్‌పర్సన సుశీలమ్మ, సర్పంచు లలితమ్మ, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, కురుబ కార్పొరేషన డైరెక్టర్ గోవిందు, ఉపసర్పంచు వన్నప్ప తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం:
చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోపీ చారిటబుల్ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బ్లడ్‌బ్యాంకు మేనేజరు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మూడు రోజులపాటు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని దానాలలో కెల్లా రక్తదానం గొప్పదన్నారు.
అన్నదానం :
బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు కేపీ జ్యువెలరీస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పీఠాధిపతి చెన్నబసవరాజేంద్రస్వామి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి, టీడీపీ నాయకులు జగదీష్ ఆచారి, రాజశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.