ఉపాధి పనులపై కేంద్ర బృందం అసంతృప్తి

ABN , First Publish Date - 2021-10-29T05:45:53+05:30 IST

ఉపాధి పనులపై కేంద్ర బృందం సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఉపాధి పనులపై కేంద్ర బృందం అసంతృప్తి
వజ్రకరూరు మండలం కొనకొండ్లలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యులు

చేసిన పనులు వివరించలేక నీళ్లు నమిలిన సిబ్బంది 

వజ్రకరూరు మండలం కొనకొండ్లలో చేదు అనుభవాలు

స్థానిక అధికారుల తీరుపై మండిపాటు 

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 28:  ఉపాధి పనులపై కేంద్ర బృందం సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వజ్రకరూరు మండలం కొనకొండ్లలో ఉపాధి నిధులతో చేపట్టిన పలు రకాల పనుల తనిఖీలో అశ్చర్యకరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. స్థానిక అఽధికారులు, సిబ్బంది పనితీరుపై కేంద్ర బృందం సభ్యులు మండిపడ్డారు. గురువారం  కేంద్ర బృందం సభ్యులు అమరేంద్రప్రతా్‌పసింగ్‌, కిరణ్‌పాడియా వజ్రకరూరు మండలం కొనకొండ్ల, ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామా ల్లో పలు రకాల ఉపాధి పనులను తనిఖీ చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనకొండ్ల గ్రా మంలో ఉపాధి నిధులతో రోడ్లకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన కింద నాటిన మొక్కలు, నీటికుంటలు, ఊట కుంటలు, రైతు పొలాల్లో కందకం పనులను పరిశీలించారు. రైతు రాజశేఖర్‌ పొలంలో కందకం పనులు చేసినట్లు వర్క్‌ ఐడీ ఉన్నప్పటికీ అక్కడ గుంతలు లేకపోవడంతో కేంద్ర బృందం సభ్యులు ఆశ్చర్యపోయారు. ఉపాధి నిధులతో పొలం చుట్టూ తవ్విన కందకాలు ఏమయ్యాయని రైతును ప్రశ్నించారు. ఉపాధి పనులతోనే కందకాలు తవ్వారనీ, ఆ తర్వాత తానే పూడ్చేశానని సదరు రైతు సమాధానం చెప్పాడు. రికార్డుల్లో లెక్కలకు క్షేత్రస్థాయిలో పని చేసినట్టు లేకపోవడంతో కేంద్ర బృందం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే గ్రామం లో జగనన్న కాలనీలో చేసిన నాలుగు వర్క్‌ ఐడీలకు సంబంధించి పనులను వివరించాలని స్థాని క సిబ్బందిని కేంద్ర బృందం ప్రశ్నించింది. సదరు సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోయారు. తాము కొత్తగా వచ్చామంటూ మిన్నకుండిపోయారు. అదే పనులపై ఎంపీడీఓను ప్రశ్నించినా.. ప్రయోజనం లేదు. దీంతో స్థానిక అఽధికారులు, సిబ్బంది తీరుపై కేంద్ర బృందం సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీస బాధ్యత లేకుం డా అధికారులు పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. జగనన్న కాలనీలో పనులు పరిశీలించేందుకు కేంద్ర బృందం సభ్యులు వచ్చినా.. అక్కడ గృహనిర్మాణ శాఖ అధికారులు హాజరుకాకపోవడం గమనార్హం. అదే గ్రామంలోని ఊటగుంతను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఏ స్థాయి అధికారి జిల్లాకు వచ్చినా అదే ఊట కుంటను చూపిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ప్రజల నుంచి ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనంతరం కొనకొండ్ల గ్రామ సచివాలయంలో ఉపాధి కూలీలు, మేట్లతో కేంద్ర బృందం సభ్యలు ముఖాముఖి మాట్లాడారు. అడిగిన వెంటనే పనులు పెడుతున్నారా..? సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నారా..? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యా హ్నం తర్వాత ముదిగుబ్బ మండలం దొరిగల్లు, అడవి బ్రాహ్మణపల్లి పరిధిలో పలచోట్ల తవ్విన కందకాల పనులు పరిశీలించారు. జొన్నలకొత్తపల్లిలో ఉపాధి నిధులతో సాగు చేసిన మామిడి తోట ను పరిశీలించారు. అనంతరం దొరిగల్లులో ఉపాధి కూలీలతో ముఖాముఖి మాట్లాడారు. శుక్రవారం రెండోరోజు కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో ఉపాధి పనులను తనిఖీ చేయనున్నారు. కేంద్ర బృందం సభ్యుల వెంట గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ చిన్నతాతయ్య, జాయింట్‌ కమిషనర్లు శివప్రసాద్‌, కళ్యాణచక్రవర్తి, జేసీ సిరి, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-10-29T05:45:53+05:30 IST