అత్త పింఛన కోడలుకు..!

ABN , First Publish Date - 2021-12-09T05:38:48+05:30 IST

అత్త పింఛన కోడలుకు మంజూరు చేసిన ఘటన గుత్తి మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది.

అత్త పింఛన కోడలుకు..!
లక్ష్మికి జారీ చేసిన కార్డు



సచివాలయ సిబ్బంది నిర్వాకం..


గుత్తి, డిసెంబరు 8: అత్త పింఛన కోడలుకు మంజూరు చేసిన ఘటన గుత్తి మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీలోని 4వ వార్డు సచివాలయ పరిధిలోని నాలగడ్డ వీధిలో నివాసముంటున్న వడ్డె లక్ష్మమ్మ (ఆధార్‌నెం:519962061869) భర్త చనిపోవడంతో వితంతు పింఛన మంజూరు చేశారు. ఐడీనెం: 148982 ద్వారా ప్రతినెలా రూ. 2,250 వలంటీర్లు అందజేస్తున్నారు. పింఛన పుస్తకాల స్థానంలో ప్రభుత్వం నూతనంగా కార్డులను  ప్రవేశపెట్టింది. వలంటీర్‌, వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శుల నిర్లక్ష్యంతో వృద్ధురాలైన లక్ష్మమ్మకు వచ్చే వితంతు పింఛన ఆమె కోడలు లక్ష్మి (ఆధార్‌నెం:256019992392) పేరిట ఐడీనెం: 112148982 ఆమె ఫోటోతో సహా జారీ అయ్యింది. భర్త బతికుండగానే ఆమెను వితంతువును చేశారు. తన ఫొటోను కార్డులో ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే మారుస్తామంటూ వలంటీర్‌ వెళ్లిపోయిందని బాధితురాలు లక్ష్మి పేర్కొంది. ఇక్కడ మరో విచిత్రం చోటు చేసుకుంది.  మూడు నెలల క్రితం లక్ష్మమ్మ పింఛన నిలిపివేసినట్లు నోటీసులు జారీ చేశారు. ఆమె చనిపోవడంతో నిలిపివేసినట్లు అందులో పేర్కొన్నారు. తాను బతికున్నానని, తనకు పింఛన ఇవ్వాలని అధికారుల వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకుండాపోయిందని లక్ష్మమ్మ వాపోయింది. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డిని వివరణ కోరగా పింఛన తొలగింపులో పొరబాట్లు జరిగి ఉంటే సరిదిద్దుతామన్నారు.


Updated Date - 2021-12-09T05:38:48+05:30 IST