అటెన్షన..!

ABN , First Publish Date - 2021-12-08T06:32:00+05:30 IST

జిల్లా అధికార యంత్రాంగానికి మూడో వేవ్‌ కరోనా ఆం దోళనకు గురిచేస్తోంది. ఓ వైపు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని బయటకు మేకపోతు గాంభీర్యం చూపుతున్నా నిజంగా మూడో వేవ్‌ జనవరిలో విజృంభిస్తే అరికట్టగలమా అనే ఆందోళన ఆ అధికారులను వెంటాడుతోంది.

అటెన్షన..!

అలజడి రేపుతున్న ఒమైక్రాన

అప్రమత్తమవుతున్న అధికారులు

విదేశాల నుంచి వచ్చిన వారిపై గురి

మళ్లీ టెస్టింగ్‌, ట్రేసింగ్‌కు అదేశాలు

శ్రీకాకుళం జిల్లాలో ఒమైక్రాన కేసు ప్రచారం

విదేశాల నుంచి జిల్లాకొచ్చిన ముగ్గురికి పాజిటివ్‌

లోలోపలే అధికారుల వ్యవహారాలు

అనంతపురం వైద్యం, డిసెంబరు 7: జిల్లా అధికార యంత్రాంగానికి మూడో వేవ్‌ కరోనా ఆం దోళనకు గురిచేస్తోంది. ఓ వైపు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని బయటకు మేకపోతు గాంభీర్యం చూపుతున్నా నిజంగా మూడో వేవ్‌ జనవరిలో విజృంభిస్తే అరికట్టగలమా అనే ఆందోళన ఆ అధికారులను వెంటాడుతోంది. దీనికి ప్రధాన కారణం 2020 మార్చిలో రెండు కేసులతో మొదలై నాలుగైదు నెలలకుపైగా తొలి కరోనా వేవ్‌ జనాన్ని వెంటాడుతూ వచ్చింది. ఏడాది పాటు కేసులు నమోదవుతూ వచ్చాయి. 62 వేలకుపైగా జనం తొలివిడతలో కరోనా బారిన పడ్డారు. ఇందులో 400 మంది వరకు చనిపోయారు. సెకెండ్‌ వేవ్‌ ఈ ఏడాది మార్చిలో ఒకేసారి జనంపై విరుచుకు ప డింది. మార్చి, ఏప్రిల్‌, మే మూడు నెలలు అందరినీ ముప్పతిప్పలు పెట్టింది. వేలాది మంది మహమ్మారికి చిక్కి, విలవిల్లాడారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన సకాలంలో అందక వైద్యం సైతం అందించలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు నెలల్లోనే లక్ష పాజిటివ్‌ కేసులు రావడంతోపాటు 600 మంది వరకు చనిపోయారు. ఆస్పత్రికి రాకుండా వచ్చిన గంటల్లోనే వైద్యం అందక చనిపోయిన వారు వందలాది మంది ఉన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆక్సిజన ఖాళీ కావడంతో ఊపిరి ఆగిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ జిల్లా అధికార యంత్రాంగానికి సెకెండ్‌ వేవ్‌ తలచుకుంటేనే గుండెలు గుబేలుమంటున్నాయి. ఇప్పుడు ఒమైక్రాన వైరస్‌ అనీ, ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం గత రెండు విడతల కరోనా సమయంలో చూసిన ఆర్తనాదాలు, అవస్థలు మళ్లీ చూడాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ స్థాయిలో కరోనా కేసులు నమోదైనా.. వారికి అవసరమైన పడకలు, వైద్యసేవలు అందించాలంటే వసతులు ఉన్నా.. నిధుల సమస్య యంత్రాంగాన్ని వెంటాడుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తుండడంతో జిల్లా యంత్రాంగం సైతం థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే మంత్రి శంకరనారాయణ, కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన మంగళవారం జిల్లా అఽధికారులతో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌పై సమావేశమై, చర్చించారు. విదేశాల నుంచి వచ్చిన, వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఇప్పటికే 500 మందికిపైగానే వివిధ దేశాల నుంచి జిల్లాకు వచ్చినట్లు అధికారవర్గాలు తెలుపుతున్నాయి. వారిని గుర్తించి, హోం ఐసోలేషనలో ఉండేవిధంగా వైద్యశాఖ చర్యలు చేపట్టింది. అనేకమంది చిరునామాలు తేడా ఉండడంతో అధికారులు చేతులెత్తేసినట్లు చెబుతున్నారు. దీనివల్ల ఇతర దేశాల నుంచి వచ్చినవారు అనేకమంది యథేచ్ఛగా తిరుగుతున్నారు. గుర్తించిన వారందరికీ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ఇందులో ముగ్గురికి పాజిటివ్‌ రావడంతో వారికి ఒమైక్రాన లక్షణాలున్నాయా.. లేదా.. అని గుర్తించేందుకు హైదరాబాద్‌ సీసీఎంబీ ప్రత్యేక ల్యాబ్‌కు పంపించినట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించగా ఒమైక్రాన లక్షణాలు బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది అనంతపురం జిల్లాలో అలజడి రేపుతోంది. ఇక్కడ కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్‌ రావడంతో నమూనాలను హైదరాబాద్‌ పంపారు. వీటి ఫలితాలు ఎలా ఉంటాయోనని టెన్షన పడుతున్నారు. అధికారులు మాత్రం ఆ ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారనీ, సాధారణ కరోనా లక్షణాలేననీ, ఎవరూ టెన్షన పడాల్సిన అవసరంలేదని చెబుతున్నారు. అయినా ముందస్తు జాగ్రత్తలకు సిద్ధమవుతున్నారు. పాజిటివ్‌ కేసులు వచ్చిన వెంటనే వా రి కాంటాక్ట్‌లను గుర్తించాలని కలెక్టర్‌ ఆదేశించారు. టెస్టింగ్‌లు మళ్లీ పెంచాలని వైద్యశాఖకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యం త్రాంగాన్ని కలెక్టర్‌ అలర్ట్‌ చేశారు. దాదాపు జనవరిలో థర్డ్‌వేవ్‌ ప్రభావం కనిపించే అవకాశాలున్నాయనీ, దీంతో యంత్రాంగం, జనం ఆందోళన చెందుతున్నారు.బడిలో కరోనా కలకలం

కోడూరు ఉన్నత పాఠశాలలో 

ఉపాధ్యాయురాలికి పాజిటివ్‌

అప్రమత్తమైన వైద్య సిబ్బంది

చిలమత్తూరు, డిసెంబరు 7: కరోనా మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూపుతోంది. మండలంలోని కోడూరు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఒక్కసారిగా పాఠశాలలో కలకలం రేకెత్తింది. దీంతో పాఠశాలలో పనిచేస్తున్న మిగతా టీచర్లు, విద్యార్థులు భయాదోళనలకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది మంగళవారం పాఠశాలకు చేరుకుని, కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 120 మంది నుంచి శాంపిళ్లు సేకరించారు. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కార్యక్రమంలో సీహెచఓ కుమార్‌రెడ్డి, హెల్త్‌ అసిస్టెంట్‌ ప్రకాష్‌, ఏఎనఎం పార్వతి, సుకన్య, లక్ష్మీరంగమ్మ పాల్గొన్నారు.


నలుగురికి కరోనా

అనంతపురం వైద్యం, డిసెంబరు7: జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మంగళవారం కొత్త మరణాలు నమోదు కాలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 158090 మంది కరోనా బారిన పడగా.. ఇందులో 156922 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1093 మంది చనిపోగా ప్రస్తుతం 75 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-08T06:32:00+05:30 IST