ఉపాధి బిల్లుల చెల్లింపులో మెలిక
ABN , First Publish Date - 2021-09-03T06:24:25+05:30 IST
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎనఆర్‌ఈజీఎ్‌స) కింద తెలుగుదేశం పాలనలో చేసిన ప నులకు సంబంధించిన బిల్లుల సొమ్ము చెల్లింపులకు అధికార పార్టీ నేతలు అడ్డుపడుతూనే ఉన్నారు.

బిల్లులు ఇవ్వొద్దు..!
ఉపాధి బిల్లుల చెల్లింపులో మెలిక
తనిఖీలకు వెళ్లాలని ముఖ్యనేత ఆదేశం?
సోషల్ మీడియాలో అధికారులకు మెసేజ్‌లు
వైరల్ చేస్తున్న వైసీపీ శ్రేణులు
రాయదుర్గం, సెప్టెంబరు 2: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎనఆర్‌ఈజీఎ్‌స) కింద తెలుగుదేశం పాలనలో చేసిన ప నులకు సంబంధించిన బిల్లుల సొమ్ము చెల్లింపులకు అధికార పార్టీ నేతలు అడ్డుపడుతూనే ఉన్నారు. హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం చెల్లించేందుకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వైసీపీ శ్రేణులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నిధులు సర్పంచలు, కార్యదర్శుల ఖాతాల్లో జమ అయినప్పటికీ వాటిని మాత్రం చెల్లించడంలో మెలిక పెడుతున్నట్లు తెలియవచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల కంటే కొందరు వైసీపీ నాయకుల ఒత్తిళ్లకే అధికారులు తలొగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సొమ్ము చెల్లించడంలో కొన్ని మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని వైసీపీకి చెందిన కొందరు వైరల్ చేస్తూ అధికారులకు చెల్లించకుండా పరోక్షంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యనేత కూడా నిధుల చెల్లింపులు చేయకూడదనీ, తాము చెప్పేదాకా ఆగాలని ఆదేశించడమే కాకుండా క్షేత్రస్థాయిలో పనులను వెళ్లి, తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో అధికారులు సొమ్ము చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. ఇప్పటికే పనులు చేసి ఆర్థికంగా చితికిపోయిన వారికి చెల్లించాల్సిన డబ్బు కూడా ఇవ్వకుండా పరోక్షంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు వాపోతున్నారు.
తనిఖీలు చేయండి..
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద తెలుగుదేశం పార్టీ హయాంలో సర్పంచలు పనులు చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు చేశారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు గ్రీన సిగ్నల్ ఇచ్చాక ఎంబుక్ రికార్డు చేసి, బిల్లులు చెల్లిస్తారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ కూడా నిర్వహించి, పనులు జరిగాయని నిగ్గుతేల్చి నివేదిక కూడా సమర్పించారు. అయినప్పటికీ మళ్లీ తనిఖీలు చేసి, ఇవ్వాలని తిరకాసు పెట్టడంలో ఆంతర్యం మాత్రం అణచివేతగా భావిస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా రూ.3 కోట్ల దాకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. వాటిని చెల్లించాలని హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీలోపు చెల్లించాల్సిందింగా ఆదేశించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ప్రభుత్వం విడుదల చేసి ఎంపీడీఓలకు పంపింది. మొదటి విడత కింద కొన్ని పనులకు, రెండోసారి కొన్ని పంచాయతీలకు డబ్బు పడ్డాయి. సిమెంటు రోడ్లు, షెడ్లులాంటి పనులు చేసి ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ వచ్చిన వారికి ఊరట కలిగింది. ఖాతాల్లో పడిన డబ్బును డ్రా చేసి, ఇవ్వాలని పనులు చేసిన వారు అడుగుతున్నా.. సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యనేత అనుమతి ఉంటేనే డబ్బు చెల్లించాలని చెప్పడంతో ఒక్కసారిగా పనులు చేసినవారు చక్కర్లు కొడుతున్నారు. అధికారులు మాత్రం ఏదోవిధంగా అక్కడి నుంచి చెప్పించాలని చేతులెత్తేస్తున్నట్లు తెలిసింది. దీంతో డబ్బు కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ కొందరు వైసీపీ నాయకులు అనుమతి ఇచ్చే వరకు డబ్బు ఇవ్వలేమని తెగేసి చెబుతుండటంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
సోషల్ మీడియాలో వైరల్
నిధులు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులకు సంబంధించి చెల్లింపు అంశంలో అధికారులకు కొందరు వైసీపీ నాయకులు సోషల్ మీడియా ద్వారా మెసేజ్‌లు పెట్టి, వైరల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తి చేసిన పనులకు డబ్బు చెల్లించే విషయంలో సర్పంచలు, పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. పనులు పూర్తయినట్లు నిర్ధారించుకుని, చెల్లింపులు చేయాలనీ, అలాకాకుండా చెల్లిస్తే గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మెసేజ్‌లను వైరల్ చేయాల్సిందిగా విన్నవించారు. వైసీపీకి చెందిన కొందరు నాయకులు ఇప్పటికే అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెట్టి నిధులు చెల్లించకుండా అడ్డుకునే ప్రయత్నం శాయశక్తులా చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు ఏకంగా తాము ఏమీ చేయలేమని వెళ్లి వాళ్లను అడ్డుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. దీంతో డబ్బు చెల్లింపులో పూర్తిగా అధికారులు ప్రభుత్వ ఉత్తర్వుల కంటే వైసీపీ నాయకుల మాటలకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలియవచ్చింది.
చెప్పించినా.. పర్సెంటేజీలు ఇవ్వాల్సిందే...
నియోజకవర్గంలోని గుమ్మఘట్ట, రాయదుర్గం, డీ హీరేహాళ్, కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో ఇప్పటికే రెండు విడతల్లో ఎనఆర్‌ఈజీఎ్‌స కింద చేసిన పనులకు నిధులు ఖాతాల్లో జమ అయ్యాయి. నిధులు పొందేందుకు నానాతిప్పలు పడుతున్నారు. కొందరు సర్పంచలు ఏకంగా ఐదు శాతం డబ్బు తమకు చెల్లించడంతోపాటు ముఖ్యనేతతో చెప్పించాలని మెలిక పెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యనేత చెప్పినప్పటికీ పర్సెంటేజీలు మాత్రం ఇవ్వాల్సిందేనని కరాఖండిగా తేల్చిచెబుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చేసిన పనుల్లో 21 శాతం నిధులు కోత విధించి, చెల్లింపులు చేస్తున్నారు. అందులో కూడా ఐదుశాతం పర్సెంటేజీల రూపంలో ఇస్తే నష్టపోతామని పనులు చేసినవారు వాపోతున్నారు. వడ్డీలకు తెచ్చి పనులు చేశామనీ, ఇంత ఆలస్యంగా డబ్బు వచ్చినా వాటికి వడ్డీలు కూడా చెల్లించలేని దయనీయ పరిస్థితి ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్‌ను కలవాలని నిర్ణయం
పనులు చేసినప్పటికీ చెల్లింపులు చేయడంలో వేధిస్తున్నట్లు కొందరు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ను కలిసి, పరిస్థితిని వివరించాలని నిర్ణయించుకుంటున్నారు. కొందరు అధికారులు స్పష్టంగా ముఖ్య నేతతో చెప్పించాలని చెబుతుండటంతో ఇక కలెక్టర్‌ను కలిసి, విన్నవించడమే ఉత్తమమని భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పనులు చేసినందుకే ఈ తిప్పలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. పైగా డబ్బుల చెల్లింపునకు కొన్నిచోట్ల పార్టీ మారాలని కొందరు టీడీపీ నాయకులకు ఒత్తిళ్లు పెడుతున్నట్లు తెలియవచ్చింది. వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.