డ్రైవింగ్‌ నరకప్రాయం..!

ABN , First Publish Date - 2021-08-21T06:49:09+05:30 IST

అనంత నగరంలో బయటకు రావాలంటే గుండె దడదడా కొట్టుకుంటుంది. మృత్యుగుహలోకి వెళ్లినట్లే.

డ్రైవింగ్‌ నరకప్రాయం..!

నగరంలో యమా డేంజర్‌

డ్రైవింగ్‌ నరకప్రాయం..!

ర్యాష్‌, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో తరచూ ప్రమాదాలు

భయాందోళనలో స్థానికులు, వాహనచోదకులు

దృష్టి సారించని ట్రాఫిక్‌ పోలీసులు

జరిమానాలు, వాటి రికవరీలే లక్ష్యంగా విధులు

ప్రమాదకర ప్రాంతాలనూ పట్టించుకోని వైనం

అనంతపురం క్రైం, ఆగస్టు 20: అనంత నగరంలో బయటకు రావాలంటే గుండె దడదడా కొట్టుకుంటుంది. మృత్యుగుహలోకి వెళ్లినట్లే. విపరీతమైన ర్యాష్‌ డ్రైవింగ్‌. లెక్కలేనంత నిర్లక్ష్యం. దీంతో ఎవరు ఎలా వచ్చి, ఢీకొట్టి వెళ్లిపోతారోనన్న భయం. ఉన్నఫలంగా అడ్డంగా వచ్చేస్తారు. మన ముందు నుంచే రాకెట్‌ స్పీడ్‌తో వెళ్లిపోతారు. సడన్‌ బ్రేక్‌ వేసేసరికి గుండె ఆగినంత పనవుతుంది. వెనకనుంచి అతివేగంతో వచ్చి, ఢీకొడతారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఒళ్లంతా కళ్లు చేసుకుని, నగరంలో ప్రయాణించాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. లేదంటే ఒళ్లంతా గాయాలపాలే. దీంతో అనంత నగరంలో కన్నా.. మెట్రో సిటీ్‌సలోనే డ్రైవింగ్‌ సేఫ్‌ అని అందరూ అభిప్రాయపడుతుంటారు. ఎంతలా ర్యాష్‌ డ్రైవింగ్‌, ఎంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తున్నా.. అడ్డుచెప్పే నాథుడే ఉండడు. కట్టడిచేసే పోలీసే కనబడడు.

నగరంలో డ్రైవింగ్‌ నరకప్రాయంగా మారింది. ఒకవైపు రోడ్ల విస్తరణ చేపట్టకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య, మరోవైపు ర్యాష్‌, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో గుండె దడదడలాడిపోతోంది. ట్రాఫిక్‌ పోలీసుల పనితీరు అంతంతే ఉండటంతో నగరం, శివారు ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది మృతిచెందుతున్నారు. గాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సగటు నగరజీవి వాహనంతో రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.


ఏ ప్రమాదం చూసినా అంతే...

నగరంలో ఎక్కడ ప్రమాదం జరిగినా అధికారుల నుంచి విపించేది ర్యాష్‌ డ్రైవింగ్‌, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ అనే మాటలే. ఇది వాస్తవమే. ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రమాదాలు తగ్గించవచ్చు, వాహనచోదకులకు ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడానికి వీలుంటుందనే దిశగా మాత్రం ఆలోచించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఏటా 50 నుంచి 80 వరకు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే 20 నుంచి 30 మంది మృతి చెందుతుండగా.. సుమారు 50 నుంచి 70 మంది తీవ్రంగా గాయపడుతున్నారు. ప్రశ్నిస్తే.. ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే, నగర పాలక సంస్థ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు, రవాణాశాఖ అధికారులతో కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎవరికి వారు చెప్పి తప్పించుకోవడం గమనార్హం.


తరచూ రోడ్డు ప్రమాదాలు 

నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు గాయాలపాలవుతున్నారు. సంబంధిత అధికారులు ఘటన జరిగిన సమయంలో  హడావుడి చేయడం తప్ప వాటి నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. గత నెలలోనే నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని క్రాంతి ఆస్పత్రి సమీపంలో ఓ కారు అతివేగంగా వచ్చి ఓ స్కూటీని ఢీకొట్టడంతో  ఓ మహిళా అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన  మరవకనే మరోరోజు టిప్పర్‌ లారీ ద్విచక్ర వాహనచోద కుడి కాలుపై పోవడంతో కాలు నుజ్జునుజ్జయింది. అధిక రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మరుసటిరోజు మృతిచెందాడు. ఈ ప్రాంతంలో ఒకదాని తరువాత మరో ప్రమాదం జరిగి ఇద్దరి ప్రాణాలు పోవడంతో అధి కార యంత్రాంగంపై పెద్దఎత్తున ప్రజల నుంచి విమ ర్శలు రావడంతో స్పీడ్‌ బ్రేకర్లు వేయించారు. ఇలా నిత్యం నగరంలో ఎక్కడో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది.


జరిమానాలు.. రికవరీలే లక్ష్యంగా విధులు

నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కువగా ట్రాఫిక్‌ నియంత్రణ పేరుతో వాహనాదారులపై జరిమానాలు విధించడం, పెండింగ్‌ చలానాలను రికవరీ చేయించడం వంటి పనుల్లోనే నిమగ్నమయ్యారు. ఉన్నతాధికారులు కూడా వారికి లక్ష్యం విధించినట్లు సమాచారం. దీంతో ట్రాఫిక్‌ నియంత్రణ, ర్యాష్‌ డ్రైవింగ్‌, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ తదితర నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై దృష్టిసారించడం మరవడంతోనే తరచూ రోడ్డు ప్రమాదా లు సంభవిస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. పైగా ఎలాంటి ట్రాఫిక్‌ లేకపోయిన నగరంలో రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటం కలవరం రేపుతోంది. మొత్తంగా పరిశీలిస్తే.. ట్రాఫిక్‌ పోలీసులు ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి లేకుండా చూసుకుంటున్నారే తప్ప.. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేదిశగా ఆలోచించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.  


నియంత్రణపై నిర్లక్ష్యం ఎందుకో...?

నగరంతోపాటు నగర శివారులో కలిసి మొత్తంగా 10 బ్లాక్‌స్పాట్స్‌, డేంజర్‌ జోన్లను గుర్తించారు. ఇలాంటి ప్రాంతాల్లో కూడా వాటి నియంత్రణ దిశగా ఆలోచన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ట్రాఫిక్‌, రవాణా శాఖతోపాటు నగరపాలక సంస్థ, ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు కూడా స్పందించాల్సిన అవస రం ఉంది. గుర్తించిన 10 ప్రాంతాలతో పాటు అపుడప్పు డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను మరిన్ని గుర్తించి  ని యంత్రణకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. స్పీడ్‌ బ్రేకర్లతో పాటు రేడియం స్టిక్కర్లు, లైటింగ్‌ బోర్డులు, ఆయా ప్రాంతాల్లో పలు హెచ్చరిక బోర్డులు, సీసీ కెమె రాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్‌ సిబ్బంది నిఘా పెంచి రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా ఆలోచన చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా జాతీయ రహదారికి ఆనుకుని ఉండే డీమార్డ్‌, తపోవనం సర్కిల్‌, టీవీటవర్‌ సర్కిల్‌, తదితర ప్రాంతాల్లో వేగ నియంత్రణ చర్యలు చేపడితే మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.


పది బ్లాక్‌స్పాట్లు

నగరంలో పది ప్రాంతాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించారు. నగర శివారులోని టీవీటవర్‌, బళ్లారి బైపాస్‌ సర్కిల్‌, కళ్యాణదుర్గంరోడ్డు సర్కిల్‌, పీటీసీ ఫ్లైఓవర్‌, తపోవనం సర్కిల్‌, శిల్పారామం, రవిపెట్రోల్‌ బంక్‌, నగర శివారులోని కక్కలపల్లి క్రాస్‌ (ఓ ప్రధాన ప త్రిక కార్యాలయ సమీపంలో), డీమార్ట్‌, తాజాగా ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని క్రాంతి ఆస్పత్రి సర్కిల్‌ను గుర్తించారు. ఇదంతా తెలిసి కూడా ఆయా ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో నిఘా లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ట్రాఫిక్‌ సిబ్బంది మొత్తం మూడు షిఫ్టులుగా విధుల్లో ఉంటున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు ఆగకపోవడం విమర్శలకు తావిస్తోంది.


ఈ ఏడాది నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించిన కొన్ని.. 

- జనవరి 3న నగరంలోని ఎల్‌బీ నగర్‌కు చెందిన ఇర్షాద్‌బేగం (31) డీమార్డ్‌కు వచ్చి, అక్కడి నుంచి జాతీ య రహదారిని కాలినడకన దాటుతుండగా గుర్తుతెలియని వా హనం ఢీకొట్టిపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

- జనవరి 16న రాయదుర్గం మండలం జుంజరాంపల్లికి చెందిన భీమప్ప ద్విచక్రవాహనంలో నగరానికి వస్తుండగా.. నాల్గవ రోడ్డు వద్ద రాంగ్‌రూట్‌లో వచ్చిన మరో ద్విచక్రవాహనం ఎదురుగా ఢీకొట్టింది. దీంతో భీమప్ప మృతిచెందాడు.

- మార్చి 17న ఆర్ట్స్‌ కళాశాల సమీపంలో ఓ గ్యాస్‌ లారీ ర్యాష్‌ డ్రైవింగ్‌తో మరో రెండు రోజుల్లో పెళ్లి కావాల్సిన షకీల్‌ అహ్మద్‌ (27) ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఆ యువకుడు మృతిచెందాడు. పైగా అక్కడ స్పీడ్‌ బ్రైకర్‌ కూడా ఉంది.

-  మే 14న మహారాష్ట్రకు చెందిన దిగంబర రాథోడ్‌, తమ సమీప బంధువులు మౌనిత మరో ఇద్దరితో కలిసి కారులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. నగర శివారులోని తపోవనం సమీపంలో హెచ్చెల్సీకి చెందిన డివైడర్లను అతివేగంగా ఢీకొట్టాడు. దీంతో రాథోడ్‌ మృతి చెందగా.. మౌనిక గాయపడింది.

నగర శివారులోని వివేకానందనగర్‌కు చెందిన సూర్య ప్రకాష్‌ (51) ద్విచక్రవాహనంలో ఈ ఏడాది జూన్‌ 9న ఉదయం 8 గంటల సమయంలో నగరంలోకి బయల్దేరాడు. పీటీసీ ఫ్లైఓవర్‌ మీదకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి పోయింది. దీంతో తీవ్రంగా గాయపడి సూర్యప్రకాష్‌ మృతిచెందాడు.

- జూన్‌ 23న నగరంలోని కోవ్వూర్‌నగర్‌కు చెందిన అడ్వకేట్‌ హరికృష్ణ(35) తన స్నేహితులతో కలిసి బత్తలపల్లిలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు. రాప్తాడు మీదుగా జీపులో తిరిగి వస్తుండగా నగర శివారులోని కక్కలపల్లి క్రాస్‌ సమీపంలో ఎదురుగా వచ్చే లారీని ఢీకొట్టారు. దీంతో హరికృష్ణ మృతిచెందాడు.

- జూలై 27న పట్టపగలే ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన లగేజీ ఆటో నగర శివారులోని టీవీటవర్‌ సమీపంలో అతివేగంగా డ్రైవింగ్‌ చేస్తూ ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెలో ఉండే జైపూర్‌కు చెందిన కూలీ రాందాస్‌ అంబదాస్‌ పవర్‌ (52) మృతి చెందాడు. ఇవన్నీ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన ఘటనలకు సంబంధించినవి కొన్ని మాత్రమే.. ఇంతలా రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నా సంబంధిత అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.


గత ఐదేళ్లలో నగరంతోపాటు 

నగర శివారు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు...

 

సంవత్సరం ప్రమాదాలు మృతులు గాయపడిన 

  వారు

2017             57         18         40

2018             55      25         34

2019             73        29         70

2020             54     24     50

2021

(ఇప్పటి     36     12     33

వరకు)



Updated Date - 2021-08-21T06:49:09+05:30 IST