బాధ్యులెవరు..?

ABN , First Publish Date - 2021-03-22T06:30:18+05:30 IST

నకిలీ వాహన ముఠా ఆగడాలకు అనంత ఆర్టీఓ ఆఫీస్‌ కేంద్రంగా మారింది.

బాధ్యులెవరు..?

నకిలీ డాక్యుమెంట్లతో కర్ణాటక వాహనాలు ఏపీకి మార్పు 

‘వాహన మిత్ర’లో సరిచూడకుండా ఓకే చెప్పిన అధికారులు 

అనంత ఆర్టీఓ కేంద్రంగా అక్రమ వ్యవహారాలు 

దాదాపు 52 వాహనాలను 

అక్రమంగా విక్రయించిన ముఠా 

48 వాహనాలను స్వాధీనం

చేసుకున్న కర్ణాటక పోలీసులు 

తాజాగా కొందరు ఆర్టీఏ

అధికారులను విచారించిన వైనం  

రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి

మోసపోయిన అమాయకులు 

తప్పించుకు తిరుగుతున్న

ముఠా సభ్యులు 

అనంతపురం వ్యవసాయం, మార్చి 21  : నకిలీ వాహన ముఠా ఆగడాలకు అనంత ఆర్టీఓ ఆఫీస్‌ కేంద్రంగా మారింది. కర్ణాటకకు చెందిన ఖరీదైన కార్లను నకిలీ డాక్యుమెంట్లతో ఏపీకి మార్పు చేయించి, ఆ తర్వాత అమాయక ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అనంత ఆర్టీఓ కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు నకిలీ ముఠా నుంచి  ఆమ్యామ్యాలు పుచ్చుకొని  నకిలీ డాక్యుమెంట్లను పరిశీలించకుండానే గుడ్డిగా ఒకే చేశారు. నిబంధనల మేరకు వాహన మిత్ర వెబ్‌సైట్‌లో వాహనాల డాక్యుమెంట్లను పరిశీలించి, అన్నీ కరెక్ట్‌గా ఉం టేనే ఒక యజమాని నుంచి మరో వ్యక్తికి రిజిస్ర్టేషన్‌ చేయాల్సి ఉంది. నకిలీ ముఠా వలలో పడిన కొందరు ఆర్టీఏ అధికారులు అవన్నీ చేయకుండానే ఫైల్‌ ఒకే చేశారన్న విమర్శలున్నాయి. ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు నిబంధనల మేరకు డాక్యుమెంట్లు పరిశీలించి ఉంటే అక్కడే అక్రమాల వ్యవహారానికి అడ్డుకట్టపడేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమ్యామ్యాలకు కక్కుర్తి పడటంతో అమా యకులు మోసపోయేందుకు అధికారులు ఒక కారణమ య్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ ముఠా సభ్యుల మాయమాటలు నమ్మి మోసపోయిన వాహనదారులు ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. వీటికి ఆ శాఖ అధికారులెవరూ సరైన సమాధానం చెప్పలేకపోతు న్నారు. తమకేం సంబంధం లేదంటూ చేతులు దులుపు కుంటున్నారు. నకిలీ ముఠా సభ్యులకు ఆర్టీఓ అధికారులు సహకరించి తమను నట్టేట ముంచారంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. లక్షలాది రూపాయలు నష్టపో యిన తమకు ఎవరు న్యాయం చేస్తారంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. 


నకిలీ డాక్యుమెంట్లతో బురిడీ

జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు మరో నలుగురితో ముఠాగా ఏర్పడి నకిలీ దందాకు పాల్పడ్డారు. కర్ణాటకలో కారు కొనుగోలు చేసి లాక్‌డౌన్‌ నేపథ్యంలో కంతులు కట్ట లేని వారిని ముఠా సభ్యులు సంప్రదించారు. కార్ల డౌన్‌పే మెంట్‌ డబ్బు వెనక్కి ఇప్పించి, బ్యాంక్‌ కంతులు తామే చెల్లిస్తామని నమ్మించినట్లు సమాచారం. అక్కడి వాహన యజమానులకు కొంత డబ్బులు ముట్టజెప్పి కారుతోపా టు డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఇలా కర్ణాటక నుంచి తీ సుకొచ్చిన దాదాపు 52 ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలను (ఎల్లో బోర్డు) నకిలీ డాక్యుమెంట్లతో ఏపీకి మార్పు చేయించారు. నకిలీ ఎన్‌ఓసీ సృష్టించి, ఆయా వాహనాలపై ఇన్సూరెన్స్‌ లేనట్లు రికార్డులు తయారు చేసి అనంత ఆర్టీఓ కార్యా లయంలో  తంతు ముగించేశారు. 


వాహనాలను స్వాధీనం చేసుకున్న కర్ణాటక పోలీసులు 

అనంత ఆర్టీఓ ఆఫీ్‌సలో అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేయిం చుకున్న ఐదు వాహనాలను గతేడాది సెప్టెంబరులో అ నంత ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేశారు. ఇందులో అనం తకు చెందిన నలుగురు ముఠా సభ్యులు కీలకంగా వ్యవహరించినట్లు తేల్చారు. ఈ నకిలీ వ్యవహారంపై స్థా నిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్యుమెంట్లు పరి శీలించకుండా రిజిస్ర్టేషన్‌ చేసిన అనంత ఇన్‌చార్జ్‌ ఆర్టీఓ, ఏఓ మహబూబ్‌బాషా, సీనియర్‌ అసిస్టెంట్‌ మాలిక్‌ బాషాలను సస్పెండ్‌ చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అలాగే అక్రమంగా వాహనాల రిజి స్ర్టేషన్‌ చేయించిన నగరానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా చాలా వాహనాలు అక్రమంగా రిజిస్ర్టేషన్లు చేసుకున్నారని, త్వరలో వాటిని బయట పెడ తామని అనంత ఆర్టీఓ ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఆ దిశగా ముందుకు వెళ్లలేదు. ఇంతలోనే ఈ ఏడాది జనవరిలో కర్ణాటక పోలీసులు జిల్లాలో 30కిపైగా వాహనాలను స్వాధీనం చేసుకొని వెళ్లిపోయారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు బాణసవాడి ఉపవిభాగం కేజీ హళ్లి పోలీసులు జిల్లాకు చెందిన ఐదుగురు నకిలీ ముఠా  కీలక సభ్యులను అరెస్టు చేశారు. అనంత ముఠా సభ్యులు విక్రయించిన రూ.4 కోట్లకుపైగా విలువ చేసే 48 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పలువురితో పాటు కర్నూలు, కడప జిల్లాకు చెందిన వారికి నకిలీ ము ఠా ఖరీదైన వాహనాలను విక్రయించినట్లు సమాచారం. దాదాపు 52 కర్ణాటక వాహనాలను అనంత ఆర్టీఓ కార్యాల యంలోనే నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ర్టేషన్‌ చేయించినట్లు కర్ణాటక పోలీసులు తేల్చారు. నకిలీ ముఠా సభ్యుల్లో ఒకరిద్దరు తమతో అనంత ఆర్టీఓ కార్యాలయ అధికారులు డబ్బులు తీసుకొని రిజిస్ర్టేషన్‌ చేశారని విచారణలో వెల్ల డించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కింద ట అనంత ఆర్టీఓ ఆఫీ్‌సలోని కొందరు అధికారులను కేజీ హళ్లి పోలీసుస్టేషన్‌కు పిలిపించుకొని అక్కడి పోలీసులు విచారించినట్లు సమాచారం. కర్ణాటక పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తే అసలైన బాధ్యులపై చర్యలు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


బాధితులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠా సభ్యులు 

కర్ణాటకకు చెందిన అక్రమ వాహనాలను నకిలీ డాక్యు మెంట్లతో రిజిస్ర్టేషన్‌ చేయించడంతో అమాయకులు బల య్యారు. కర్ణాటక పోలీసులు ఇళ్ల వద్దకు వచ్చి అక్రమ వా హనాలను కొన్నారంటూ నిర్దాక్షిణ్యంగా స్వాధీనం చేసుకు న్నారు. కర్ణాటక పోలీసులు వచ్చిన సమయంలో ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి బాధితులు తమ గోడును వెల్లబో సుకున్నా ఎవరూ సమాధానం చెప్పలేదు. కర్ణాటక పోలీ సులు అరెస్టు చేసిన ముఠా సభ్యులు ప్రస్తుతం జిల్లాలోనే ఉంటున్నట్లు సమాచారం. అయితే వాహనాలు కొనుగోలు చేసిన వారికి చిక్కకుండా తిరుగుతున్నట్లు తెలిసింది. వాహనాలు కొనుగోలు చేసిన వారిలో పలుకుబడి కలిగిన వ్యక్తులు ముఠా సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో జరిగిన విషయాన్ని తెలియజేసి డబ్బులు తిరి గి వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. అప్పు లు చేసి వాహనాలు కొనుగోలు చేసిన మరికొంత మంది బాధితులు తమ బాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోనే మథనపడుతున్నారు. మరి కొందరు బాధితులు ఒక గ్రూప్‌గా ఏర్పడి తమనుమోసం చేసిన ముఠా సభ్యుల ను  నిలదీసి తమ డబ్బులు ఎలాగైనా వెనక్కి ఇప్పించుకో వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. తమను నమ్మించి మోసం చేసినప్పటికీ స్థానిక పోలీసులెవరూ తమ ఫిర్యా దును స్వీకరించడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. బాధితుల నుంచి డబ్బులు వెనక్కి ఇవ్వాలన్న డిమాండ్‌ వస్తుందన్న ముందస్తు ఆలోచనతో ముఠా సభ్యులు ఎవరి కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. 


Updated Date - 2021-03-22T06:30:18+05:30 IST